ఐటీ గ్రిడ్ పై దాడి చేస్తే..చంద్రబాబుకెందుకు వణుకు?

బేతాళ కథ

హైదరాబాద్ కు చెందిన  ఐటీ గ్రిడ్ కంపెనీ పాత్రపై పోలీసులు సోదాలు చేస్తోంటే..
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంలో కంగారెందుకు?  ప్రభుత్వం దగ్గర ఉండాల్సిన డేటా ప్రైవేటు కంపెనీకి ఎలా వచ్చింది?
రెండు రాష్ట్రాలను పట్టి కుదిపేస్తోన్న  వివాదంపై బేతాళుడి  అనుమానం ఏంటి? దానికి విక్రమార్కుడు చెప్పిన సమాధానం ఏంటి?

 పట్టువదలని విక్రమార్కుడు    పరధ్యానంగా స్మశానం లో అడుగు పెట్టాడు.
పరధ్యానంగా ఏదో ఆలోచిస్తూ  బేతాళుడి వైపు అడుగులు వేశాడు.
చెట్టుమీది బేతాళుని భుజాలకెత్తుకున్నాడు.
విక్రమార్కుని  చూసి..ఏంటి విక్రమార్కా  రోబో లాగ   ఏంటి ఈ రోజు యంత్రంలా కదులుతున్నావు. ఓ నవ్వు లేదు . ఓ పలకరింపు లేదు అన్నాడు బేతాళుడు.
ఏం లేదు బేతాళా..ఎండాకాలం మొదలైపోయింది. వడదెబ్బ కొట్టేసినట్లుంది అన్నాడు విక్రమార్కుడు.
విక్రమార్కా ఈ రోజు నీకొక ఆసక్తికరమైన కథ చెబుతాను.
సావధానంగా విను.  అని కథ చెప్పడం మొదలు పెట్టాడు.
‘హైదరాబాద్ లో ఐటీ గ్రిడ్స్ అనే ఓ చిన్న కంపెనీ ఉంది.
ఆ కంపెనీ దగ్గర ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన మొత్తం ఓటర్ల డేటా..కలర్ ఫోటోలు...ఆధార్ కార్డులతో సహా ఉందని...అదో పెద్ద కుంభకోణమని  ఆంధ్ర ప్రదేశ్ లో ప్రధాన ప్రతిపక్షమైన వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ నేత విజయసాయిరెడ్డి  ఫిర్యాదు చేశారు. ఐటీ గ్రిడ్స్ కంపెనీలో పోలీసులు సోదాలు మొదలు పెట్టగానే   ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  అగ్గిమీద గుగ్గిలం అయిపోయారు. మా పైనే దాడులు చేస్తారా? మర్యాదగా ఉంటే మర్యాదగా ఉంటాం..గీత దాటితే ఖబడ్దార్ అని పోలీసులను హెచ్చరించారు. అంతే కాదు..ఏపీ ప్రజల డేటాని ఐటీ గ్రిడ్స్ కంపెనీ చౌర్యం చేస్తే తెలంగాణ పోలీసులకేంటి సంబంధం అని మండిపోయారనుకో. తమ జోలికి వస్తే ఎవరినీ వదిలిపెట్టేది లేదని వార్నింగూ ఇచ్చారు. ఇదంతా కూడా తెలుగుదేశం పార్టీని దెబ్బతీయడానికి అందరూ కలిసి చేస్తోన్న కుట్రే నని చంద్రబాబు నాయుడు అంటున్నారు.‘
ఇప్పుడు చెప్పు విక్రమార్కా...ఐటీ గ్రిడ్  కంపెనీలో సోదాలు చేస్తే..చంద్రబాబు నాయుడికెందుకు కోపం వచ్చింది.
దాన్ని ఏపీ తెలంగాణ రాష్ట్రాల మధ్య యుద్ధంగా ఆయన వర్ణిస్తున్నారు?  దీని వెనుక ఉన్న మర్మం ఏంటి? దీనికి సమాధానం తెలిసీ కూడా చెప్పకపోయావో నీ తల వెయ్యి  వ్రక్కలైపోతుంది జాగ్రత్త‘ అని బేతాళుడు ముగించాడు.
విక్రమార్కుడు ఒక్క క్షణం ఆలోచించి
‘బేతాళా నువ్వు చెప్పినట్లు ఐటీ గ్రిడ్ కంపెనీ  హైదరాబాద్ లోనే ఉంది. అదో చిన్న ప్రైవేటు కంపెనీయే కూడా.
ఆ కంపెనీలో సోదాలు జరిగితే ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు కంగారు పడాల్సింది ఏమీ ఉండకూడదు.అయితే  అసలు విషయం ఏంటంటే..ఆ కంపెనీ సిఇఓ అశోక్ ...మన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి కుమారుడు నారా లోకేష్ కు బాగా సన్నిహితుడు. ఈ కంపెనీయే టిడిపికి చెందిన సేవామిత్ర యాప్ ను రూపొందించింది కూడా.  లోకేష్ అంటే తెలుసు కదా ఏపీకి ఐటీ శాఖ మంత్రి కూడా. అందుకే ఈ ఐటీ కంపెనీని అడ్డు పెట్టుకుని ఏపీలో ఎన్నికల ఏడాదిలో తమకి ఓటు వేయరనుకున్న వారి పేర్లను ఓటర్ల జాబితా నుండి తొలగించడానికి ప్లాన్ చేశారు. అందుకోసం ప్రభుత్వం దగ్గర ఉన్న ఏపీ ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని..కలర్ ఫోటోలతో సహా వారి ఓటరు కార్డులు..ఆధార్‌ కార్డుల వివరాలను కూడా ఐటీ గ్రిడ్ కంపెనీకి అందించారు. ఐటీ గ్రిడ్ కంపెనీతో పాటు  విశాఖ పట్నంలోని బ్లూ ఫ్రాగ్ టెక్నాలజీస్  కంపెనీ  కలిసి...ఓటర్ల కులాలు...చిరునామాల ఆధారంగా వారు ఏ పార్టీకి ఓటు వేస్తారో తెలుసుకుంటున్నారు. అందుకోసం  ప్రైవేటు ముఠాలను గ్రామాలకు పంపి నకిలీ సర్వేలు నిర్వహిస్తున్నారు. ఆ సర్వేల్లో మీరే పార్టీకి ఓటు వేస్తారని  ప్రజలను అడుగుతున్నారు. తెలుగుదేశం పార్టీకి ఓటు వేయరని   అనుమానం ఉన్న ఓటర్లను జాబితా నుండి తొలగించేస్తున్నారు.

కొద్ది రోజులుగా రాష్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో ఈ కార్యక్రమం నడుస్తోంది. దీనిపై  వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ నేతలు ఫిర్యాదు చేస్తే..  పోలీసులు నిందితులపై చర్యలు తీసుకోకపోగా..బాధితులైన విపక్ష నేతలపైనే కేసులు బనాయించి వేధిస్తున్నారు. ఎన్నికలు తరుముకు వస్తోన్ వేళ  విపక్ష ఓట్లను పెద్ద సంఖ్యలో తొలగిస్తేనే కానీ ఎన్నికల్లో నెగ్గుకు రాలేమని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. ఎందుకంటే ఇప్పటి వరకు వివిధ టీవీ చానెళ్లూ..జాతీయ సంస్థలూ నిర్వహించిన సర్వేలన్నీ కూడా వచ్చే ఎన్నికల్లో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమని తేల్చేశాయి. అందుకే  టిడిపి పెద్దలు ఈ అక్రమ మార్గాన్ని ఎంచుకున్నారు. ఇపుడీ  దుర్మార్గాన్ని పసిగట్టిన విపక్షం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ మార్గం కూడా మూసుకుపోయిందని టిడిపి నేతలు  ఆందోళన చెందుతున్నారు.

అంతే కాదు.. ఏపీ ప్రభుత్వం దగ్గర ఉండాల్సిన ప్రజల డేటా ని  ఐటీ గ్రిడ్ కంపెనీకి అందించిందెవరో కూడా పోలీసులు బయట పెడితే..టిడిపి పరువు మంటకలుస్తుంది. అక్రమాలకు పాల్పడిన ఐటీ గ్రిడ్ సిఇఓ తో లోకేష్ కున్న సంబంధాలపైనా దర్యాప్తు సాగుతుంది.ఈ భయమే చంద్రబాబులో కోపానికి కారణమైంది. తమ తప్పిదాలు బట్టబయలు చేసేస్తున్నారన్న  ఉక్రోషానికే..చంద్రబాబు నాయుడు విపక్షంపై విరుచుకు పడుతూ..తెలంగాణఆంధ్ర ప్రదేశ్ ల మధ్య  గొడవగా దీన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయినపుడు కూడా తెలంగాణఏపీల మధ్య గొడవగా ప్రచారం చేశారు. ఇప్పుడూ అదే చేస్తున్నారు‘ అని విక్రమార్కుడు ముగించాడు.
విక్రమార్కుడి సమాధానం సంతృప్తినివ్వడంతో బేతాళుడు మాయమై తిరిగి చెట్టుకొమ్మకు వేలాడాడు.
వీర పిశాచి 

 

Back to Top