గిరీశం-యామివాయ్ మై డియర్ గోపాత్రుడూ...నీ దగ్గర కాపర్స్ ఏమన్నా ఉంటే.. పోయి మాంచి హవానా సిగార్ ఒకటి పట్రావోయ్. గోపాత్రుడు-అలాగే గురూగోరూ. కానీ నాకు కాస్త ఇంగ్లీషుఅయినా నేర్పండి గురూగారు. చుట్టలు కాల్చడం తప్ప నాకు ఇంకేమీ నేర్పలేదు మీరు.గిరీశం-ఇదేనోయ్ నాకు ఒళ్లు మండేది. చుట్టలు కాల్చడం కూడా ఒక ఆర్టే . అది నేర్పిన కృతజ్ఞత కూడా లేదు నీకు కంట్రీ ఫెలో. గోపాత్రుడు-తిట్టకండి ఒక్క నిముషంలో చుట్ట తెచ్చుకొని వస్తా.గిరీశం-వార్తా పత్రికలు తిరగేస్తున్నాడు.గోపాత్రుడు-ఇదిగో గురూ గారూ చుట్ట. గిరీశం చేతికిచ్చి అగ్గి పెట్టి వెలిగించాడు గోపాత్రుడు.చుట్ట అంటించి మనస్ఫూర్తిగా పొగ పీల్చి వదిలి తన్మయత్వంలో మునిగిపోయాడు గిరీశం.గోపాత్రుడు-గురూ గారు.. మీరేమీ అననంటే.. మిమ్మల్ని పరిచయడం చేయడానికి మా అభిమాన నాయకుణ్ని తీసుకొచ్చాను లోపలకి పిలవమంటారా అని వినయంగా అడిగాడు.గిరీశం-చిద్విలాసంగా నవ్వి. ..ఎవరోయ్ వచ్చింది అని ఆరాతీశాడు.ఆ లోపునే గోపాత్రుడు చంద్రబాబు నాయుణ్ని తీసుకుని గిరీశం దగ్గరకు వచ్చాడు.గిరీశాన్ని చూడగానే చంద్రబాబు నాయుడు భక్తి శ్రద్ధలతో నమస్కారం చేశాడు.గిరీశం-ఎవరివోయ్ నువ్వు . నాలాంటి పెద్దాళ్లని గౌరవించావంటే మంచోడివే అయి ఉంటావు అన్నాడు.గోపాత్రుడు-గురూగారూ ఈయన సెందరబాబు నాయుడుగోరని మన ముఖ్యమంత్రండీ బాబూ. మిమ్మల్ని కలుస్తానంటే తీసుకొచ్చా అన్నాడు.చంద్రబాబు-గిరీశం కేసి అవునన్నట్లుగా చూసి నేను మీ శిష్యుణ్నండీ బాబూ. మీరు చెప్పిన సూత్రాలనే పాటిస్తూ రాజకీయాల్లో ఇంతటి వాడినయ్యా.నిన్నటికి నిన్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ మీరు చెప్పిందే ఫాలో అయి గెలిచాం అని గర్వంగా చెప్పాడు.గిరీశం-వార్నీ.. నాకు గుర్తున్నంతవరకు ఎమ్మెల్సీ ఎన్నికల గురించి నేనేమీ చెప్పలేదే.. అని ఆలోచనలో పడ్డాడు.చంద్రబాబు-మీరు గతంలో చెప్పిందే మాస్టారూ. మీరేమన్నారూ బెగ్ ..బారో.. ఆర్ స్టీల్ అన్నారు కదా.గిరీశం-అవును అన్నాను. దానికీ ఎమ్మెల్సీ ఎలక్షన్లకీ ఏటి సమ్మంధం?చంద్రబాబు-బెగ్ అంటే మాకుమర్యాదగా ఓటేయండర్రా అని అపోజిషన్ పార్టీ లీడర్లని బతిమాలాం. కొందరు వినలేదు. బారో.. అంటే ప్రాధేయ పడితే వినని వాళ్లకి డబ్బులు..పదవులు ఆశపెట్టాం.అందులోనూ కొందరు వినలేదు. స్టీల్. అలా వినని వాళ్లని మీపై కేసులు పెడతాం అని బెదిరించాం. మా పోలీసుల అడ్డు పెట్టుకుని కిడ్నాప్ చేశాం. మొత్తానికి ఆల్ అడ్డదారీస్ తొక్కి గెలిచాం.ఇందుకు మీకు రుణపడి ఉన్నాం అన్నాడు చంద్రబాబు .గిరీశం-నీ అసాధ్యం సంతకెళ్లా. భలే గడుసుగా ఉన్నావోయ్. అది సరే నేనామధ్య పేపర్లో చూశాను. ఎన్నికల్లో ప్రత్యేక హోదా వస్తేనే పరిశ్రమలు వస్తాయన్నావు కదా. ఇపుడేంటీ హోదాతో పరిశ్రమలు రావు ప్యాకేజీయే బెటరంటున్నావు?చంద్రబాబు-అది కూడా మీరు చెప్పిన పాఠమేనండీ బాబూ . ఒపీనియన్లు మార్చుకోని వాడు పొలిటీషియన్ కానేరడు అన్నారు కదా తవరు. అందుకే అవసరాన్ని బట్టి టోన్ మార్చాను గురూ గారూ అన్నాడు.చంద్రబాబు కేసి చూస్తూ ఉండిపోయాడు గిరీశం.అంతలో గోపాత్రుడి కేసి చూసి చంద్రబాబు చెప్పేయ్ అని సైగ చేశాడు.గోపాత్రుడు-గురూ గోరూ... ఎన్టీఆర్ ట్రస్ట్ లో పార్టీ లీడర్లకి పొలిటికల్ క్లాసెస్ తీసుకోడానికి ఓ ఆడిటోరియం కట్టారట. దాన్ని మీ చేత ప్రారంభించాలని బాబుగారు అనుకుంటున్నారు అని నసిగాడు.గిరీశం-మంచి నిర్ణయమే కానీ..నేనెందుకయ్యా అన్నాడు.చంద్రబాబు-అంత మాటనకండి ఆడిటోరియానికి గిరీశం ఆడిటోరియం అని పేరు కూడా పెట్టాం. మీరు రాక తప్పదు అన్నాడు.గిరీశం-అలాగే కానీ...పాపం మీ మావగారు ..ఎన్టీఆర్.. నా రోల్ ని అదరగొట్టేశాడయ్యా కన్యాశుల్కంలో. ఆయన నీకు పిల్లనిచ్చిన మామ కదా ఆయన్నెందుకయ్యా అన్యాయంగా పదవి నుంచి తప్పించేశావు అన్నాడు.చంద్రబాబు-అదేంటి గురూగోరూ.. పాలిటిక్స్ లో సెంటిమెంట్స్ ఉండకూడదని చెప్పారు. పైగా పాలిటిక్స్ లో కుట్రలను అవసరమైనప్పుడు వాటిని పన్నక పోతే వచ్చే జన్మలో కుక్కై పుడతాడని కూడా అన్నారు కదా మీరు అన్నాడు.గిరీశం ఆశ్చర్యంగా చూశాడు. పొగతాగని వాడు దున్నపోతై పుట్టున్ అన్నాను కానీ ..ఇదెప్పుడన్నానబ్బా అని ఆలోచిస్తున్నాడు.చంద్రబాబు లేచి నిలబడి గురూగారూ మరి నాకు అట్టే సమయం లేదు తమరు మాత్రం తప్పకుండా రావాలి అని బయలు దేరాడు.చంద్రబాబు ను గుమ్మం దాకా సాగనంపిన గోపాత్రుడు గిరీశం దగ్గరకు వచ్చి క్యూరియాసిటీగా చూశాడు.గురూ గోరూ సెందరబాబుగోరు చాలా గ్రేటండీ బాబూ. అన్నాడు భక్తితో.గిరీశం-అవునోయ్. నాలాంటి వంద మంది పెట్టు. మరో మారు తీసుకురామాకు. నేను పొట్టపోసుకోవడం కోసం పూటకూళ్లమ్మని చిన్నగా మోసం చేశాను. విడో మ్యారియేజెస్ ని ఎంకరేజ్ చేయడానికి బుచ్చమ్మలాంటి వాళ్లని మోసం చేశాను. కానీ ..మీ సెందరబాబు నాకన్నా చాలా డేంజరస్సోయ్. గురువులను ..రూల్స్ నూ కూడా మార్చిపారేస్తాడు అని నుదుటి చెమటను రుమాలుతో తుడుచుకుని గ్లాసుడు మంచినీళ్లు తాగాడు.గోపాత్రుడు చాలా ఆనందంగా గిరీశం వైపు చూస్తూ ఉండిపోయాడు.