పెట్టుబడులు-గిట్టుబడులు

బాబు గోరు ఎక్కడ అడుగు పెడితే అక్కడ పని అయిపోయనట్టే. అంటే ఆయనెళ్లిన పని అయిపోయినట్టే. చంద్రబాబు నిన్న ఆదరాబాదరా ఢిల్లీ వెళ్లారు. హోమ్ మంత్రి, ఆర్థికమంత్రులను కలిసారు. బిజెపి జాతీయ అధ్యక్షునితో కూడా ఫోన్ లో చర్చలు జరిపారు. ఇక ఉపరాష్ట్రపతితో కాసేపు భేటీ అయ్యారు. ఎందుకయ్యా అంటే ఇంకెందుకు విభజన సమయంలో జరిగిన హామీలను నెరవేర్చమని అడగడానికట. పాపం ఉన్నట్టుండి రాష్ట్ర భవిష్యత్ మీద చంద్రబాబుకు ఇంత జాలీ, దయా, కరుణ ఎలా ఉప్పొంగాయో ఎవ్వరికీ అర్థం కాక జుత్తు పీక్కుంటున్నారు. 

పనిలో పనిగా అక్కడదాకా వెళ్లినందుకు బాబుకు మరో విషయం కూడా గిట్టుబాటైంది. ఇజ్ఞాన భవన్ లో వల్డ్ ఫుడ్ ఇండియా 2017 సదస్సు జరుగుతోంది. సమ్మెట్ లు, మీటింగ్లు, సదస్సులు అంటే చంద్రబాబుకు ఎనలేనిప్రీతి కదా. ఇంకేముందీ అక్కడ ఎపి స్టాల్స్ కు రిబ్బన్ కత్తిరించేసి వివిధ ప్రతినిధులతో భేటీ అయిపోయారు బాబు. ఇంటిగ్రేటెడ్ ఫుడ్ పార్కు, మెగా ఫుడ్ పార్కుల ఏర్పాటు చేసే సంస్థలకు గ్రాంట్లు ఇస్తామని ప్రకటించారు. దాంతో ఉన్నపళంగా 17 సంస్థలతో ఒప్పందాలు జరిగాయిపోయాయి. 4వేల కోట్లు పెట్టుబడులు పెడతామంటూ జాతీయ అంతర్జాతీయ సంస్థలు ఒకదాన్నొకటి తోసుకుంటూ ముందుకొచ్చేసాయి.  

సేమ్ టు సేమ్ ఇంతకు ముందు కూడా విన్నట్టు అనిపిస్తోందే అనుకుంటున్నారు కదూ…
గుర్తు చేసుకోండి…మీకు గుర్తు రాకపోతే నేను గుర్తు చేస్తాను. ఒక్కసారి కాదు మిత్రమా చంద్రబాబు వందసార్లు పెట్టుబడుల ఒప్పొందాలు చేసుకున్నాడు. ఐమీన్ చేసుకున్నానని చెప్పాడు….
ఆ లిస్ట్ చెప్పమంటారా…లేటెస్ట్ తో మొదలెడదాం. 
మొన్నే కదా దుబాయ్ టు అమెరికా పర్యటన చేసొచ్చారు సిఎమ్ గారు.  దుబాయి లోని ఏవియేషన్ సంస్థలతో కలిసి అమరావతిలో ఎరో సిటీకి పెట్టుబడులు వచ్చేయని చెప్పారు. పనిలో పనిగా అటునుంచి అటు అమెరికా వెళ్లి ఎపిని నాలెడ్జ్ హబ్ గా చేసే పని పూర్తి చేసుకొచ్చానని చెప్పారు. అలాగే అమెరికాలోని అయోవా యూనివర్సిటీతో ఒప్పందం చేసుకుని కర్నూల్లో మెగా సీడ్ పార్క్  పెట్టబోతున్నామని చెప్పారు. ముందు చెప్పిన పార్కులకే దిక్కులేదు ఇవెప్పుడు రావాలని అనుకోకండి. 
ఈ ఏడాది మొదట్లో అంటే  జనవరిలో ఆయిల్ గ్యాస్ రంగంలో 1.43 లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు జరిగాయిట. ఇది మరింత పెరుగుతుందని చంద్రబాబు సెలవిచ్చారు. నిజమే కాబోలనుకున్న అది గ్యాస్ అని తేలడానికి కాస్త టైమ్ పడుతుంది కదా.

ఈ నిన్న మొన్న కథలు కంచికెళ్లేందుకు కాస్త టైమ్ ఇద్దాం. ఇంతకు ముందు బాబుగారి పెట్టుబడుల వరద గురించి చెప్పుకుందాం. 
అప్పుడెప్పుడో 2016లో విశాఖలో జరిగిన భాగస్వామ్య సదస్సులో లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేసాయి అని చెప్పారు చంద్రబాబు. ఇంకేముంది డబ్ల్యూటివో కేంద్రం అమరావతిలో కూడా పెట్టబోతున్నారని చెప్పేసారు. రెండు రోజుల్లో అక్షరాలా 4లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కూడా జరిగిపోయినాయి అన్నారు. అంతేనా లక్షలాది ఉద్యోగాలకు బాటలు అని చెప్పారు. విశాఖ యువత అంతా అవెప్పుడొస్తాయో అని కళ్లు కాయలు కాచేలా ఈరోజుదాకా ఎదురు చూస్తూనే ఉన్నారు.

2016లో చైనా పర్యటన చేసొచ్చిన బాబు గారు రాష్ట్రానికి 58వేల కోట్ల పెట్టుబడులు అదికూడా ప్రత్యక్షంగా వచ్చేస్తున్నాయని, తను విమానం దిగిన వెంటనే వెనకాలే పెట్టుబడిదారులు అమరావతిలో దిగేస్తారని చెప్పారు. ఆయన ఈలోపులో ఎన్నో విమానాలు ఎక్కిదిగారు గానీ చైనా గూడ్స్ తప్ప రూపాయి పెట్టుబడి ఆంధ్రాకి వచ్చింది లేదు.

అలాంటిదే మరోటి. దావోస్ పర్యటన. కేవలం పెట్టుబడుల ఆకర్షణ కోసం దావోస్ పర్యటిస్తున్నాని చెప్పారు బాబుగారు. ఆయనతోపాటు మంత్రులు, అధికార గణం కూడా బయలుదేరి వెళ్లింది. చెప్పలేనన్ని ఒప్పందాలు చేసుకుని, చిల్లర కూడా అమరావతికి తేకుండా వచ్చింది. దీనికోసం అయిన ఖర్చుతో ఖజానా కాస్తా గుల్ల గుల్ల అయ్యింది.

ఇక ఆ మధ్య జరిగిన విశాఖ పారిశ్రామిక సమ్మిట్ లో 328 ఒప్పందాలు జరిగాయట. 4.67లక్షల కోట్ల పెట్టుబడులకు కంపెనీలు సై అన్నాయట. 500 కంపెనీలతో ఎమ్ ఓ యూలు జరిగిపోయాయిట. తీరా ఆ ఎమ్ ఓ యు లు కుదుర్చుకున్న సూట్ కేసు కంపెనీలు ఏంటా అని ఆరా తీస్తే దిమ్మతిరిగి బొమ్మ కనబడింది రాష్ట్ర ప్రజలకు. ప్రైవేటు స్కూళ్లకు అడ్మిషన్లు చేయించే పి ఆర్ ఒ, పలాస లో జీడిపప్పు అమ్మే బ్రోకరు వీళ్లే ఆ సమ్మిట్ లో 10వేల కోట్ల ఎమ్ ఒ యులు కుదుర్చుకున్న మొనగాళ్లు. 

కొత్తగా ఐటీ శాఖకు అప్పనంగా మంత్రి అయిపోయిన పప్పు బాబు సైతం పెట్టుబడుల గురించి భీభత్సంగా ప్రకటనలిచ్చేస్తాన్నారు. కానీ అవి ఎక్కుడున్నాయో, ఎప్పుడొస్తాయో ఆయన బాబుగారికి కూడా తెలియని పరిస్థితి.

కాసులు మీద నడిచే కార్పొరేట్ రంగం చంద్రబాబు నాయకత్వం మీద నమ్మకంతో, భరోసాతో కోట్లు పెట్టుబడులు పెడుతోంది అని కోడై కూసింది ఎల్లో మీడియా. ఇక శివనాడార్ వంటి వారైతే స్టేచర్ ఉన్న నాయకుడు చంద్రబాబే అని, ఆయన ముద్దుల ముఖం  చూసే ఐటి రంగం పెట్టుబడుల వరద పొంగి పారిస్తోందని చెప్పారు. కాని ఇంతవరకూ రూపాయి పెట్టుబడి పెట్టిన పాపాన పోలేదు ఆ రంగం. 

ఫుడ్ ప్రాసెసింగ్ హబ్ గా ఆంధ్రాని ఎక్కడో నిలబెడతా అంటున్నారు చంద్రబాబు. అయితే 2014లోనే కేంద్రం రాష్ట్రానికి మెగా ఫుడ్ పార్క్ ని ఎలాట్ చేసింది. నూజివీడు దగ్గర మల్లవల్లిలో ఫుడ్ పార్క్ సాంక్షన్ అయ్యి ఏళ్లు గడిచినా కనీసం భూసేకరణ కూడా జరగలేదు. కేంద్రం సాంక్షన్ చేసిన కంపెనీలకే దిక్కులేకుండా ఉంటే బాబు కొత్తగా ఇంకేవో జురాసిక్ పార్కులు తెస్తానంటున్నాడు. 

ఇవన్నీ బాబు పెట్టుబడి కథల్లో అతి కొద్ది అంశాలు మాత్రమే. అన్నీ చెప్పుకోవాలంటే అమరావతి కథలా అంతు లేకుండా ఉంటుంది మరి…బాబుగారి చెప్పే పెట్టుబడులన్నీ అబద్ధాలకు గిట్టుబళ్లే అని, రాష్ట్రానికి అవి ఉట్టుబడులే అని అంటున్నారు ఆర్థిక నిపుణులు. 

Back to Top