అడగందే అమ్మయినా పెట్టదు..!

పట్టువదలని విక్రమార్కుడు   ప్రశాంతంగా  అడుగులో అడుగేసుకుంటూ  స్మశానంలో ముందుకు సాగుతున్నాడు. విక్రమార్కుడు రిలాక్స్‌డ్ గా కనిపిస్తున్నాడు. విక్రమార్కుని చూడగానే బేతాళుడు అందుకుని.." ఏం విక్రమార్కా..ఏంటి అంత ఫ్రెష్ గా ఉన్నావు. తలంటు పోసుకున్నావా ఏంటి? అని అడిగాడు.
దానికి విక్రమార్కుడు నవ్వేసి..
"అవును  బేతాళా. మొన్న  ఉద్ధండరాయపాలెం వెళ్లి వస్తోంటే..పైనుంచి తలపై మట్టి..నీళ్లు పడ్డాయి. ఏంట్రా ఆకాశంలోంచి వర్షాలు పడ్డం మానేసి ..మట్టి రాలుతోంది అని  పై కి చూశాను. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హెలికాప్టర్ లోంచి  మట్టిజల్లుతూ కనిపించారు. అమరావతి కోసం తెచ్చిన మట్టిలో  కొంత నా తలపై కూడా పడిందన్నమాట. అందుకే శుభ్రంగా షాంపూ పెట్టి తలస్నానం చేసి  తీరిగ్గా ఇప్పుడిలా వచ్చాను" అని ముగించాడు.
బేతాళుడు పగలబడి నవ్వాడు. "అంటే ప్రత్యేక మట్టి పడిందన్నమాట ..బాగుంది. సరే ఇక కధ మొదలు పెట్టమంటావా" అని అడిగాడు.

"ఇంకెందుకు ఆలస్యం త్వరగా చెప్పేస్తే నేనూ సమాధానాలు చెప్పేసి పోతాను ఇవాళ చాలా పనులున్నాయి" అన్నాడు.
బేతాళుడు కథ చెప్పడం మొదలు పెట్టాడు.
" విక్రమార్కా...ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన కోసం ఆకాశమంత పందిరి ..అమరావతి అంత పీట వేసి  చంద్రబాబు నాయుడు చాలా పెద్ద కార్యక్రమమే నిర్వహించారు. చుట్టాలు..పక్కాలు..చుట్టుపక్కల రాష్ట్రాల నేతలు...13 జిల్లాల నుంచి   పెద్ద సంఖ్యలో ప్రజలూ...అందరూ తరలి వచ్చారు.ప్రధాని నరేంద్ర మోదీయే సరాసరి ఢిల్లీ నుండి  అమరావతికి వచ్చేశారు. ఆయన చేతుల మీదుగా బ్రహ్మాండంగా శంకుస్థాపన కార్యక్రమం జరిగింది.  అంతసేపూ ఒళ్లంతా కళ్లు చేసుకుని.. ఉన్న జనమంతా  ప్రధాని నరేంద్రమోడీతో పాటు చంద్రబాబు నాయుడు...వెంకయ్యనాయుడు ...ఇతర మంత్రులు వేదిక నెక్కగానే ఒళ్లంతా చెవులు చేసేసుకున్నారు. ఎందుకంటే ఈ కార్యక్రమంలోనే ఆంధ్ర ప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇస్తారేమోనని అంతా కూడా ఆశలు పెట్టుకున్నారు. ఏ క్షణంలోనైనా మోడీ ప్రత్యేక హోదా ప్రకటన చేస్తారని చెవులు రిక్కించి వినసాగారు.అయితే ప్రధాని  ప్రత్యేక హోదా గురించి ఎలాంటి ప్రకటనా చేయలేదు. అంతకు మించి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే... కళ్లముందర ప్రధానిని పెట్టుకుని ...మా రాష్ట్రానికి విభజన వల్ల నష్టం జరిగింది కాబట్టి  విభజన సమయంలో మాకిస్తామన్న ప్రత్యేక హోదా మాకివ్వండి అని  చంద్రబాబు అడుగుతారేమోనని అందరూ చూశారు. అదేంటో కానీ చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా అడగలేదు. సరికదా ప్రత్యేక ప్యాకేజీ  ఇచ్చే మార్గం చూడండంటూ నసిగారు. కార్యక్రమం అయిపోగానే ప్రధాని విమానం ఎక్కి తుర్రుమన్నారు.  ఇపుడు చెప్పు  ప్రత్యేక హోదా సాధించుకోడానికి దక్కిన బంగారం లాంటి అవకాశాన్ని చంద్రబాబు నాయుడు ఎందుకు వాడుకోలేదు. ? ఎందుకు ఆయన ప్రత్యేక  హోదా కోసం పట్టుబట్టలేదు? పోనీ బిజెపికే చెందిన రాష్ట్ర మంత్రి వెంకయ్యనాయుడైనా ప్రత్యేక హోదా ఇవ్వాలని అడగచ్చుకదా. ఇద్దరు నాయుళ్లూ ఎందుకు  హోదా కోసం కేంద్రాన్ని  నిలదీయలేదు?  పోనీ ఈ ఇద్దరూ అడక్కపోయినా..ప్రధాని అయినా  ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సింది కదా. ఆయన ఎందుకు ఇవ్వలేదు?  వీటికి  సమాధానాలు తెలిసీ కూడా చెప్పకపోయావా నీ తల వెయ్యి చెక్కలైపోతుంది" అని బేతాళుడు ముగించాడు.
విక్రమార్కుడు  ఒక్క క్షణం ఆలోచించి స్థిమిత పడి చెప్పడం మొదలు పెట్టాడు.
"బేతాళా..నీకు గతంలో చాలా సార్లు చెప్పి ఉన్నాను. మా మనుషుల్లో రాజకీయాలున్నాయే..వాటంత ఛండాలంగా  ఇంకేమీ  ఉండవు. ప్రధాని ఎదురుగా కూర్చుని ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా గురించి అడిగేస్తే అయిదున్నర కోట్ల మంది ఆంధ్రుల మనసులు  హాయిగా  తేలికయ్యేవి.  ఏపీని అభివృద్ధి చేసుకోడానికి చంద్రబాబు నాయుడికి  సువర్ణావకాశం దక్కేది. వేలాది ప్రజల ముందు ప్రత్యేక హోదా అడిగితే మోడీ కూడా  స్పష్టమైన హామీ ఇచ్చేవారు. అంతా బానే ఉంది కానీ..అవేవీ చంద్రబాబు నాయుడికి ఇష్టం లేదు. ఎందుకంటే ప్రత్యేక హోదా సమస్య తేలిపోయిందనుకో
 ప్రత్యేక హోదా కోసం మొదటి నుంచీ పోరాడుతోన్న వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ పంతం కూడా నెగ్గినట్లవుతుంది.  అంటే అది ప్రతిపక్షానికి ఓ విజయంగా మారేది. అలా ఎన్నటికీ జరగడానికి వీల్లేదనే చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా  ఊసే ఎత్తలేదు. ప్రత్యేక ప్యాకేజీ అయితే   పట్టిసీమ ప్రాజెక్టులో  ఇష్టారాజ్యంగా అక్రమాలకు పాల్పడినట్లు వ్యవహారాలు నడిపించి కోట్లకు కోట్లు వెనకేయచ్చు. అందుకే ఆయన ప్యాకేజీ వైపు మొగ్గు చూపారు. ఇక వెంకయ్య నాయుడి గురించి అడిగావు. ఆయన చంద్రబాబు నాయుడికి ఇష్టం లేని పని ఏదీ చేయరు.  ప్రత్యేక హోదా కు చంద్రబాబు వ్యతిరేకం కాబట్టే వెంకయ్యనాయుడు కూడా  హోదాను వ్యతిరేకించడం మొదలు పెట్టారు. ప్రత్యేక హోదా సంజీవని కాదని చంద్రబాబు అన్న తర్వాతే..వెంకయ్యనాయుడు ప్రత్యేక హోదా జిందా తిలిస్మాత్ కాదన్నారు. ప్రత్యేక హోదా వల్ల ఒరిగేదేమీ ఉండదని చంద్రబాబు అన్నాకే..వెంకయ్య నాయుడు కూడా ప్రత్యేక హోదా వల్ల  ప్రయోజనాలేవీ ఉండవని అన్నారు. ఇలా ప్రతీ విషయంలోనూ చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగానే  వెంకయ్యనాయుడు నడుచుకుంటున్నారు.అందుకే ఆయన కూడా హోదా గురించి అడగలేదు.ఇక వీరిద్దరూ అడక్కపోయినా మోడీయే ప్రత్యేక హోదా ఇవ్వచ్చు కదా అని అడిగావు. మన ఇంట్లో అమ్మే అడగందే అన్నం పెట్టదు. అలాంటిది దేశానికి ప్రధాని అయిన నరేంద్రమోడీ ఎవరూ అడగందే ప్రత్యేక హోదా ఎందుకు ఇస్తారు? నీ పిచ్చిగానీ" అని చెప్పడం ముగించాడు.
విక్రమార్కుని సమాధానాలు విన్నంతనే సంతృప్తి చెందిన బేతాళుడు అమాంతం విక్రమార్కుని భుజాలపై నుండి మాయమై చెట్టు వైపు గాల్లో సాగిపోయాడు.
-------------------------
-వీర పిశాచి
Back to Top