‘సాక్షి’ మీడియా లక్ష్యంగా చంద్రబాబు కుట్ర 

మాజీ మంత్రి ఆర్‌కె రోజా ఫైర్‌

వ్యూహాత్మకంగానే సాక్షి కార్యాలయాలపై దాడులు 

అందులో భాగంగానే జర్నలిస్ట్‌ కొమ్మినేని అరెస్ట్‌ 

అబద్ధాలను పోగేసి, సాక్షిపై దాడులకు వ్యూహరచన 

ప్రణాళిక ప్రకారమే లోకేష్, చంద్రబాబు, పవన్‌ ట్వీట్లు

దాన్ని సమర్థించిన షర్మిల వ్యాఖ్యలూ కుట్రలో భాగమే 

అరాచకాలను ప్రశ్నించే గొంతు నొక్కడమే ప్రభుత్వ లక్ష్యం

మాజీ మంత్రి ఆర్‌కె రోజా ధ్వజం

చంద్రబాబు, టీడీపీ నాయకులకు మహిళలంటే చులకన 

అసలు చంద్రబాబు, బాలకృష్ణ, లోకేష్‌ మీదే కేసులు పెట్టాలి

స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు, ఎమ్మెల్యే బండారును అరెస్టు చేయాలి

వైయస్ఆర్‌సీపీపై బురద చల్లడమే టీడీపీ, ఎల్లో మీడియా పని

ఆ దిశలో వ్యక్తిత్వ హననం చేస్తూ రోజూ కుట్రలు, కుతంత్రాలు

అయినా వారి మీద కేసులు ఉండవు. అరెస్టులు చేయరు

మహిళలు, బాలికల రక్షణలో హోం మంత్రి దారుణ వైఫల్యం

హోం మంత్రి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలి

ప్రెస్‌మీట్‌లో తేల్చి చెప్పిన మాజీ మంత్రి ఆర్‌కె రోజా

చిత్తూరు జిల్లా నగరిలో మీడియాతో మాట్లాడిన వైయస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి, మాజీ మంత్రి ఆర్‌కె రోజా.

నగరి: సాక్షి మీడియా గొంతు నొక్కాలన్న లక్ష్యంతో సీఎం చంద్రబాబు కుట్ర చేస్తున్నారని వైయస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి, మాజీ మంత్రి ఆర్‌కె రోజా ఆక్షేపించారు. ఆ దిశలోనే వ్యూహాత్మకంగానే సాక్షి కార్యాలయాలపై దాడులు చేయడంతో పాటు, సీనియర్‌ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావుపై తప్పుడు కేసులు బనాయించి, అరెస్టు చేశారని చిత్తూరు జిల్లా నగరిలో మీడియాతో మాట్లాడిన ఆర్‌కె రోజా స్పష్టం చేశారు.
 
ఆర్‌కె రోజా ఏం మాట్లాడారంటే..:

రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదు:
    టీడీపీ కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. రెడ్‌ బుక్‌ రాజ్యాంగంతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు. మూడేళ్ల చిన్నారి నుంచి పండు ముదుసలి వరకు వదిలిపెట్టకుండా ఉన్మాదులు అత్యాచారాలు చేసి చంపేస్తున్న ఘటనలు అనేకం. వారికి రక్షణ కల్పించాల్సిన హోం మంత్రి, పోలీసులు కనీసం స్పందించడం లేదు. ఆ బాధ్యత నుంచి ఈ ప్రభుత్వం పారిపోయింది. 
    హోం మంత్రి మహిళ అయి ఉండి కూడా రాష్ట్రంలో మహిళలు, బాలికలకు రక్షణ కల్పించలేని దయనీయ స్థితిలో ప్రభుత్వం ఉంది. నగరి నియోజకవర్గంలో ఒక చిన్నారి మీద అత్యాచారం చేసి చంపేసి పూడ్చేస్తే ఎస్పీని, పోలీసు యంత్రాంగాన్ని పంపించి దాన్ని కనుమరుగు చేసేందుకు చేయని ప్రయత్నం లేదు. వైయస్ఆర్‌సీపీ సపోర్టుతో గ్రామస్తులు తిరగబడితే విధిలేని పరిస్థితుల్లో ఈ హోం మంత్రి అనిత బాధిత కుటుంబానికి డబ్బులిచ్చి చేతులు దులుపుకున్నారు.

డిప్యూటీ సీఎం, హోం మంత్రి రాజీనామా చేయాలి:
    అనంతపురంలో తన్మయి అనే ఇంటర్‌ విద్యార్థిని తప్పిపోయిందని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోకపోవడంతో ఆరు రోజుల తర్వాత బాలిక దారుణంగా చంపబడిన స్థితిలో మృతదేహం కనిపించింది. ఇదే అనంతపురం జిల్లాలో పరిటాల సునీత ప్రాతినిథ్యం వహించే రాప్తాడు నియోజకవర్గంలో ఒక 14 ఏళ్ల ఎస్సీ బాలిక మీద టీడీపీకి చెందిన 14 మంది యువకులు కొన్ని నెలలుగా సామూహిక అత్యాచారం చేస్తే న్యాయం చేయాల్సింది పోయి ఆ కుటుంబాన్ని ఊరి నుంచి పంపించి వేశారు. దానిపై సాక్షి స్పందించి వార్తలు రాస్తే కానీ ఈ ఘటన వెలుగులోకి రాలేదు.
    ఆడబిడ్డల మానప్రాణాలు గాల్లో కలిసిపోతుంటే నిందితులను శిక్షించాల్సింది పోయి.. అనుచితంగా.. నా చేతిలో లాఠీ ఉందా? నా భుజాన గన్‌ ఉందా? అని మాట్లాడటం సిగ్గు చేటు. చేత కానప్పుడు హోం మంత్రి అనిత తన పదవికి రాజీనామా చేసి తప్పుకోవాలి. ఇక మహిళలకు తాను అండగా ఉంటానని, తప్పు చేసిన వారిని శిక్షిస్తానని ఎన్నికలకు ముందు ప్రగల్భాలు పలికిన డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌.. ఈరోజు ఇన్ని ఘటనలు జరుగుతున్నా కనీసం నోరు మెదపడం లేదు. అందుకే డిప్యూటీ సీఎం కూడా తన పదవి నుంచి వైదొలగాలి.

డైవర్షన్‌ కోసమే కొమ్మినేని అక్రమ అరెస్టు:
    ప్రభుత్వ వైఫల్యాలు బయటపడిపోతాయనే భయంతోనే అక్రమ అరెస్టులతో డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారు. రెడ్‌ బుక్‌ పాలనతో మా పార్టీ నాయకులు, కార్యకర్తల మీద అక్రమ కేసులు నమోదు చేసి వారి జీవితాలను నాశనం చేస్తున్నారే తప్ప, ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఈ ప్రభుత్వం పని చేయడం లేదు. నిజాయితీపరుడైన సీనియర్‌ జర్నలిస్ట్‌ కొమ్మినేని శ్రీనివాసరావు మీద అక్రమ కేసులు నమోదు చేసి, దారుణంగా వేధిస్తున్నారు. కేవలం ప్రజల గొంతు వినిపించకుండా చేయడానికే ఒక ప్రణాళిక ప్రకారం ఆయన మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. 

పక్కా  ప్రణాళికతోనే సాక్షిపై దాడులు:
    అమరావతి ముసుగులో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్న అంశాన్ని వెలుగులోకి తెచ్చినందుకు నాడు కొమ్మినేనిని ఎన్టీవీ నుంచి బలవంతంగా తప్పుకునేలా చేశారు. ఆ కక్షతోనే చంద్రబాబు ఇప్పుడు కూడా అరెస్ట్‌ చేసి ప్రతీకారం తీర్చుకుంటున్నారు. జర్నలిస్ట్‌ కృష్ణంరాజు మాట్లాడిన మాటలను కొమ్మినేనికి, సాక్షి మీడియాకు, వైయస్ఆర్‌సీపీకి ఆపాదించే కుట్రలకు వ్యూహరచన చేశారు. ఆఖరుకి వైయస్‌ జగన్‌ కుటుంబం మీద కూడా సోషల్‌ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టించి, సాక్షి కార్యాలయాల మీద దాడులు చేయిస్తున్నారు. దీని కోసం చంద్రబాబు, లోకేష్, డీజీపీ, ఇంటిలిజెన్స్‌ చీఫ్‌ కలిసి కుట్రతో వ్యూహరచన చేశారు. తమ కుట్రకు మరింత పదును పెట్టేందుకు లోకేష్, చంద్రబాబు ట్వీట్‌లు చేయడమే కాకుండా, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌తో కూడా ట్వీట్‌ చేయించారు. ఇదంతా పక్కా ప్రణాళిక ప్రకారమే జరిగింది.
    ముందస్తుగా వేసుకున్న స్కెచ్‌ ప్రకారమే సోమవారం ఉదయం హైదరాబాద్‌లో కొమ్మినేనిని అరెస్ట్‌ చేశారు. ఆ వెంటనే రాష్ట్రంలో పలు చోట్ల సాక్షి మీడియా కార్యాలయాల మీద దాడులకి దిగారు. ఆ దాడుల్లో పాల్గొన్న వారంతా టీడీపీ ఎమ్మెల్యేల బంధువులు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లతో పాటు, పార్టీ కార్యకర్తలు.

మొదట క్షమాపణ చెప్పాల్సింది చంద్రబాబే:
    ఆడవారిని అవమానించినదానికి నిజంగా క్షమాపణలు చెప్పాల్సి వస్తే, ‘కోడలు మగబిడ్డను కంటానంటే అత్త వద్దంటుందా’? అని ఆడబిడ్డ పుట్టుకునే అవమానించిన సీఎం చంద్రబాబు మొదటగా క్షమాపణ చెప్పాలి. ‘ఆడపిల్ల కనిపిస్తే ముద్దయినా పెట్టాలి లేదా కడుపైనా చేయాలని’ పబ్లిక్‌గా మాట్లాడిన బాలకృష్ణ క్షమాపణ చెప్పాలి. జగనన్న తన కూతుళ్లను చూడటానికి లండన్‌ వెళితే దాని గురించి కూడా నీచంగా మాట్లాడిన లోకేష్‌ క్షమాపణలు చెప్పాలి. వైయస్‌ విజయమ్మ, భారతమ్మ గురించి నీచంగా మాట్లాడిన హోం మంత్రి అనిత క్షమాపణలు చెప్పాలి.
    నాపై దారుణంగా బూతులు మాట్లాడిన ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ, ఆయనతో మాట్లాడించిన చంద్రబాబు, లోకేష్‌ క్షమాపణలు చెప్పాలి. గతంలో హోం మంత్రిగా పని చేసిన మేకతోటి సుచరితను, నన్ను నీచంగా బూతులు తిట్టిన ఇప్పటి స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు క్షమాపణలు చెప్పాలి. టీడీపీ ఆఫీసు నుంచి సైకో చేబ్రోలు కిరణ్‌ చేత భారతమ్మని తిట్టించిన చంద్రబాబు, లోకేష్‌ క్షమాపణలు చెప్పాలి.

షర్మిల మాటలు సిగ్గుచేటు:
    గతంలో బాలకృష్ణ ఇంటి నుంచి సోషల్‌ మీడియా ఆఫీసు నడిపి వైయస్‌ షర్మిల మీద అసభ్యకరంగా పోస్టులు పెట్టించారు. ఆ మార్ఫింగ్‌ పోస్టుల మీద ఏడ్చి పోలీసులకు ఫిర్యాదు చేసిన వైయస్‌ షర్మిల, ఈరోజు వైయస్‌ జగన్, భారతి క్షమాపణలు చెప్పాలని కోరడం సిగ్గుచేటు. ఇది చంద్రబాబు కుట్రలో ఆమెను పావుగా వాడుకోవడమే. తప్పు చేయని కొమ్మినేనిని అరెస్ట్‌ చేసినా, సాక్షి ఆఫీసుల మీద దాడులు చేస్తుంటే వైయస్‌ షర్మిల ప్రశ్నించడం లేదు. మహిళ అయ్యుండి ఆడబిడ్డల మీద దాడులు, అత్యాచారాలు చేసి చంపేస్తుంటే దాని మీద ఈమె ప్రశ్నించదు. కానీ వైయస్‌ జగన్, భారతమ్మను విమర్శించడానికి ఏకంగా ఒంటి కాలుపై లేస్తుందని మాజీ మంత్రి ఆర్‌కె రోజా గుర్తు చేశారు.

Back to Top