విశాఖపట్నం: కేంద్ర ప్రభుత్వం మన హక్కులను కాలరాస్తుందని, వాటిని పరిరక్షించుకునేందుకు అందరం కలిసి పోరాటం చేయాలని నిర్ణయించుకున్నామని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ.. కార్మిక సంఘాలు, రాజకీయ పక్షాలు ఐకమత్యంతో కలిసి పోరాడాలని నిర్ణయించుకున్నామని, త్వరలో కార్యాచరణ కూడా ప్రకటిస్తామని చెప్పారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేయాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విశాఖపట్నంలో కార్మిక సంఘాల నేతలు, రాజకీయ పక్షాల నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను కలిసికట్టుగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. ప్లాంట్‌ను పరిరక్షించుకునేందుకు పోరాటం సాగించాలని నిర్ణయించుకున్నామన్నారు. ప్లాంట్‌లో కారణాలు విశ్లేషించుకుంటే చాలా విషయాలు బయటకు వచ్చాయన్నారు. స్టీల్ ఫ్యాక్టరీ మీద ఒడిశా రాష్ట్రానికి చెందిన నాయకులు, కేంద్ర ప్రభుత్వంలోని నాయకులు, బ్యూరోక్రసీలో అధికారుల పెత్తనం సాగుతుందని స్పష్టంగా తేలిందన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు సొంత గనులు లేకపోవడం వల్ల నష్టం వస్తున్నట్లుగా తెలిసిందన్నారు. వీటిని అరికట్టాలంటే క్యాపిటివ్ మైన్స్ తీసుకోవాలన్నారు. గతంలో తీసుకున్న ప్లాంట్ విస్తరణ రుణాన్ని ఈక్విటీ కింద కన్వర్ట్ చేసుకొని వడ్డీ భారాన్ని తగ్గించుకోవాలన్నారు. ఈ మూడు అంశాలు మాత్రమే కాకుండా ఇంకొన్ని విషయాలు కూడా చర్చించామని చెప్పారు. గతంలో విశాఖ కర్మాగరం నుంచి రూ.2 వేల కోట్లును రాయ్ బరిలో పెడుతున్న వీల్స్ ఫ్యాక్టరీ కోసం తరలించారని, అదే విధంగా పదేళ్ల క్రితం ఒడిశా మైనింగ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ గవర్నమెంట్ సంస్థ దగ్గర నుంచి మైన్స్ కోసం మొత్తంగా రూ.1,361 కోట్లు కేటాయించారని చెప్పారు. ఒడిశా నుంచి ముడిసరుకు రాలేదూ.. మైన్స్ కేటాయించలేదూ.. దీని వల్ల ఒక్క పైసా ఫ్యాక్టరీకి ఆదాయం రాలేదని విజయసాయిరెడ్డి చెప్పారు. గతంలో విశాఖ స్టీల్ ప్లాంట్‌కు ఎండీ కావాలనుకున్న టీకే చాంద్ అనే ఆఫీసర్ కుంభకోణానికి పాల్పడి సంస్థకు రూ.2 వేల కోట్ల నష్టాన్ని కలగజేశాడని ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పారు. ఈ కుంభకోణంలో టీకే చాంద్‌పై పెట్టిన సీబీఐ కేసు ఏమైంది..? అని ప్రశ్నించారు. రూ.2 వేల కోట్లు రికవరీ అయ్యిందా..? అని నిలదీశారు. అతని వల్ల విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టపోయింది కానీ, చట్ట ప్రకారం ఎవరికీ శిక్ష పడలేదన్నారు. రాయ్ బరిలో వీల్స్ ఫ్యాక్టరీ కోసం రూ.2 వేల కోట్లు, ఒడిశా మైనింగ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కి రూ.1361 కోట్లు, టీకే చాంద్ అవినీతి రూ.2 కోట్లు.. అంటే రూ.5,361 కోట్లు స్టీల్ ఫ్యాక్టరీ నుంచి తరలించారన్నారు. కేంద్రం నుంచి కూడా ప్లాంట్‌కు ఎలాంటి సహకారం అందలేదన్నారు. స్టీల్ ప్లాంట్‌లో ఒడిశాకు చెందిన వ్యక్తులు కీ పొజిషన్‌లో ఉన్నారని, వాళ్లే నిర్ణయాలు తీసుకుంటున్నారని, స్థానికులకు ఎవరికీ కీ పొజిషన్‌లో స్థానం లేదని తేలిందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నామని, ఆంధ్రప్రదేశ్ ఆస్తిని పరిరక్షించుకునేందుకు పోరాటం సాగించాలని నిర్ణయించామన్నారు. త్వరలో కార్యాచరణ కూడా ప్రకటిస్తామని ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పారు.