తిరుపతి: చిత్తూరు జిల్లా అభివృద్ధిపై చర్చకు నారా లోకేష్ సిద్ధమా..? అని వైయస్ఆర్ సీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి సవాల్ విసిరారు. దమ్ముంటే ఈనెల 12వ తేదీన లోకేష్ చర్చకు రావాలని ఛాలెంజ్ చేశారు. చిత్తూరు జిల్లా డీఎన్ఏ లోకేష్‌లో ఉంటే జిల్లాలో ఏదో ఒక చోట పోటీ చేయాలని సవాల్ చేశారు. చంద్రగిరి మండలం తొండవాడలో వైయస్ఆర్ సీపీ ఆత్మీయ సభ నిర్వహించారు. ఈ సభకు ఎంపీలు మిథున్‌రెడ్డి, రెడప్ప, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రగిరి నియోజకవర్గ అభివృద్ధిపై ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి శ్వేతపత్రం విడుదల చేశారు.
అనంతరం ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి మాట్లాడుతూ.. విద్యా దీవెన, వసతి దీవెన, అమ్మ ఒడి ఆపేస్తామని లోకేష్ మాట్లాడుతున్నాడని, ప్రజలు కష్టాలు తెలుసుకుని సంక్షేమ పథకాలు అందిస్తున్నామని చెప్పారు. విశాఖ సమ్మిట్‌లో లక్షలు కోట్లు పెట్టుబడులు వచ్చాయన్నారు. ఈ నాలుగేళ్లలో చంద్రగిరి ఎంత అభివృద్ధి జరిగిందో నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసన్నారు. కరోనా సమయంలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి నియోజకవర్గంలోని గడప గడపకు వచ్చి అండగా నిలిచారని ఎంపీ అని మిథున్‌రెడ్డి గుర్తుచేశారు.
2014లో డ్వాక్రా, రైతు రుణాలు మాఫీ చేస్తామని టీడీపీ మోసం చేసిందని, మోసపూరిత వాగ్ధానాలతో మళ్లీ టీడీపీ నేతలు వస్తున్నారన్నారు. టీడీపీ నేతల మోసపూరిత మాటలు నమ్మొద్దన్నారు. పార్టీ కోసం, నియోజకవర్గ ప్రజల కోసం ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అహర్నిశలు కృషిచేస్తున్నారని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో ఆయనపై తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టారన్నారు. పేదలకు సంక్షేమ పథకాలు ఇస్తుంటే.. టీడీపీ నేతలు ఏడుస్తున్నారన్నారు. మహిళల అభివృద్ధికి, చదువుకు, పేదల ఆరోగ్యం కోసం ఖర్చు చేస్తుంటే ఎందుకు వద్దంటున్నారని టీడీపీ నేతలను ఎంపీ మిథున్‌రెడ్డి ప్రశ్నించారు.