విజయవాడ: విద్యుత్ చార్జీలు పై తప్పుడు ప్రచారం చేయడం చంద్రబాబు మూర్ఖత్వానికి నిదర్శనమని వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వవిప్ సామినేని ఉదయభాను విమర్శించారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పాలనపై చంద్రబాబు అండ్ కో బృందం ఓర్వలేక తప్పుడు ప్రచారాలకు పాల్పడుతు ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు.ఇది వారి రాజకీయ దిగజారుడు తనానికి నిదర్శనమని ధ్వజమెత్తారు.
రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు పెంచక ముందే పెంచినట్టుగా ప్రజలను మభ్యపెడుతూ నిరసనలు తెలపడం ఏంటని ప్రశ్నించారు. సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి పాలనలో తప్పులేమి కనిపించని ప్రతిపక్ష నాయకులకు అసత్య ప్రచారాలను సత్యాలుగా చూపిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బషీరాబాగ్ వద్ద విద్యుత్ చార్జీలు తగ్గించాలని ఆందోళన చేపడితే ఆ ఉద్యమం చేస్తున్న ప్రజలపై నిరంకుశంగా ప్రవర్తించి మహిళలని చూడకుండా రోడ్లపై ఈడ్చుకుంటూ వెళ్లి, దారుణంగా దాడులు చేయించారని, కాల్పులు జరిపించి అమాయకుల ప్రాణాలు బలిగొన్నాడని గుర్తు చేశారు. ఈ సంగతి మరిచిపోయిన తెలుగుదేశం పార్టీ నేతలు గురిగింజ సామెత వలె ఉద్యమాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న వారికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని ఉదయభాను హెచ్చరించారు.