అచ్చెన్నాయుడుని తక్షణమే అరెస్టు చేయాలి

వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు

నిమ్మాడ దౌర్జన్యకాండను చంద్రబాబు ఎందుకు ఖండించలేదు

శ్రీకాకుళం, చిత్తూరు జిల్లాల్లో టీడీపీ దౌర్జన్యంపై చర్యలు తీసుకోవాలి

స్టేట్‌ ఎలక్షన్‌ కమిషన్‌కు వైయస్‌ఆర్‌ సీపీ ఫిర్యాదు

విజయవాడ: పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నేతలు దౌర్జన్యకాండకు దిగుతున్నారని, కత్తులు, తుపాకులు చూపుతూ వైయస్‌ఆర్‌ సీపీ శ్రేణులను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని, వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని స్టేట్‌ ఎలక్షన్‌ కమిషన్‌కు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి, కేంద్ర కార్యాలయ పర్యవేక్షకులు లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఇతర నాయకులు ఎస్‌ఈసీకి ఫిర్యాదు పత్రం అందించారు. నిమ్మాడ ఘటనలో అచ్చెన్నాయుడిని అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. 

ఈ మేరకు ఎమ్మెల్యే మల్లాది విష్ణు మీడియాతో మాట్లాడుతూ.. ‘చిత్తూరు జిల్లాలో టీడీపీ నాయకులు సంబంధంలేని నియోజకవర్గాల్లో రౌడీలు, గూండాలను వెంట పెట్టుకొని తుపాకులు వెంట తీసుకొని తిరుగుతూ.. వైయస్‌ఆర్‌ సీపీ శ్రేణులను భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. గత రెండ్రోజులుగా జరుగుతున్న ఈ దౌర్జన్యకాండను ఎస్‌ఈసీ దృష్టికి తీసుకెళ్లాం.  

ఏ రాజ్యాంగంలో ఇంత విచ్చలవిడిగా దౌర్జన్యాలకు పాల్పడుతున్నారో చంద్రబాబు సమాధానం చెప్పాలి. రాజారెడ్డి రాజ్యాంగం అని గొంతు చించుకునే చంద్రబాబు.. నీ పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నిమ్మాడలో చేసిన దౌర్జన్యకాండను ఎందుకు ఖండించలేదు చంద్రబాబూ..? స్టేట్‌ ఎలక్షన్‌ కమిషన్‌ వీరిపై చర్యలు చేపట్టాలి. ఎన్నికలు అయ్యేంత వరకు అచ్చెన్నాయుడిని అరెస్టు చేయాలి. చంద్రబాబే అరాచకాలు సృష్టిస్తూ.. ఎల్లో మీడియాలో దౌర్జన్యకాండ పెరిగిపోయిందని రాయించుకున్నాడు. పచ్చని పల్లెలు ప్రశాంతంగా ఉండాలని మా ప్రభుత్వం ఏకగ్రీవాలను ప్రోత్సహిస్తుంటే అందుకు భిన్నంగా చంద్రబాబు ప్రవర్తిస్తున్నాడు. మేనిఫెస్టోపై ఎస్‌ఈసీ ఎందుకు స్పందించలేదో సమాధానం చెప్పాలి’ అని ఎమ్మెల్యే మల్లాది విష్ణు డిమాండ్‌ చేశారు.  

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top