గవర్నర్‌తో పచ్చి అబద్ధాలు చెప్పించారు

కూట‌మి పాలన అద్భుతమంటూ చెప్పించ‌డం హేయం

పోలవరం, ప్రత్యేక హోదా, సూపర్‌ సిక్స్‌ హామీల ప్ర‌స్తావ‌న ఎక్క‌డ‌? 

నెల రోజుల్లో రూ.14,200 కోట్ల అప్పు ఏమైంది?, ఆ మొత్తం ఎవరెవరి జేబుల్లోకి వెళ్లింది?

అసలు పూర్తిస్థాయి బడ్జెట్‌ ఎందుకు లేదు?

రాజకీయాల్లో పూర్తిగా దిగజారి, చంద్రబాబు ‘వాయిస్‌’లా మారిన వైయస్‌ షర్మిల

టీడీపీకి తోక పార్టీలా వ్యవహరిస్తున్న కాంగ్రెస్‌

వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్‌ ఫైర్‌

తాడేపల్లి: రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్‌ ప్రసంగంలో పచ్చి అబద్ధాలు వల్లె వేసిందని, అసెంబ్లీ సాక్షిగా నయ వంచన చేసిందని యర్రగొండపాలెం వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌ ఆక్షేపించారు. చంద్రబాబు హయాంలో అద్భుతాలు చోటు చేసుకోగా, గత వైయస్సార్‌సీపీ ప్రభుత్వంలో విధ్వంసం జరిగిందంటూ అసత్యాలు పలికించారని ఆయన దుయ్యబట్టారు. రాష్ట్రంలో గత 45 రోజులుగా కొనసాగుతున్న హత్యలు, దాడులు, అరాచకాలు, దౌర్జన్యాలు, ఆస్తుల విధ్వంసం.. పూర్తిగా క్షీణించిన శాంతి భద్రతలను ప్రశ్నిస్తూ.. తామంతా మెడలో నల్ల కండువాలతో సభకు వస్తుంటే గేటు వద్ద అడ్డుకున్నారని, ఇది అనైతిక చర్య అని ఎమ్మెల్యే చంద్రశేఖర్‌ స్పష్టం చేశారు. తమ ప్లకార్డులు లాక్కుని, చించివేయడాన్ని తప్పుబట్టారు. తాము నిరసన వ్యక్తం చేయడం దారుణమా? అని ప్రశ్నించారు. తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాల‌యంలో ఎమ్మెల్యే చంద్ర‌శేఖ‌ర్ విలేక‌రుల స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. 

ప్రజా సమస్యల ఊసేదీ? 
గత ప్రభుత్వంపై నిందలు వేయడం, తమను తాము పొగుడుకోవడమే.. కూటమి ప్రభుత్వం, గవర్నర్‌ ప్రసంగం ద్వారా చేసిందని ఎమ్మెల్యే చంద్రశేఖర్‌ తెలిపారు. అసలు ప్రజా సమస్యల ఊసే లేకుండా.. అధికారంలోకి వచ్చిన తాము, ప్రజలకు ఏమేం చేస్తామనేది చెప్పకుండా.. తమపై దూషణలే ధ్యేయంగా.. గవర్నర్‌ ప్రసంగాన్ని రూపొందించారని ఆక్షేపించారు.
    
వాటి ప్రస్తావన ఏది?
పోలవరాన్ని ఎప్పటికి పూర్తి చేస్తారు?. అసలు నిర్మిస్తారా లేదా?. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధనలో మీ వైఖరి విధానం ఏమిటి?. రాజధాని అమరావతిని ఎప్పటిలోగా, ఎలా నిర్మిస్తారు?. ఎన్నికల ముందు మీరు గొప్పగా ప్రచారం చేసుకున్న సూపర్‌ సిక్స్‌ హామీలను ఎలా, ఎప్పుడు అమలు చేస్తారు?.. అన్న విషయాలు ఏవీ కూడా గవర్నర్‌ ప్రసంగంలో ప్రస్తావించలేదని ఎమ్మెల్యే చంద్రశేఖర్‌ గుర్తు చేశారు.

చెప్పకనే చెప్పారు
ఎన్నికల ముందు గొప్పగా ప్రకటించిన పథకాల అమలు అసాధ్యమని, ఈ ప్రభుత్వం చెప్పకనే చెప్పిందని, వైయస్సార్‌సీపీ ఎమ్మెల్యే వెల్లడించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడమే అందుకు కారణమన్నట్లు.. గవర్నర్‌ ప్రసంగంలో.. 39వ పాయింట్‌ వద్ద పేర్కొన్నారని ఆయన గుర్తు చేశారు. మరి ఒక్క నెలలో తీసుకొచ్చిన రూ.14,200 కోట్ల రుణాలు ఏం చేశారని సూటిగా ప్రశ్నించిన ఆయన, ఆ మొత్తం ఎవరెవరి జేబుల్లోకి వెళ్లిందో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

ఖజానాలో రూ.7 వేల కోట్లు
2019లో టీడీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి రాష్ట్ర ఖజానాలో కేవలం రూ.100 కోట్లు మాత్రమే ఉన్నాయని గుర్తు చేసిన ఎమ్మెల్యే తాటిపర్తి.. అదే తమ ప్రభుత్వం దిగిపోయే నాటికి అదే ఖజానాలో ఏకంగా రూ.7 వేల కోట్లు ఉన్నాయని వెల్లడించారు. అయినా, ఈ ప్రభుత్వం అతి తక్కువ వ్యవధిలో అత్యధిక అప్పు చేసిందని ఆక్షేపించారు. అలా రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రాగా మార్చారని దుయ్యబట్టారు.

యథేచ్ఛగా ఇసుక దోపిడి
తమ కూటమి అధికారంలోకి వస్తుంది అని తెలిసిన రోజు (ఎన్నికల ఫలితాల రోజు) నుంచే, రాష్ట్రంలో ఇసుక దోపిడి మొదలు పెట్టారని ఎమ్మెల్యే చంద్రశేఖర్‌ తెలిపారు. వర్షాకాల సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని, తమ ప్రభుత్వం ఇసుక రీచ్‌ల్లో 75 లక్షల టన్నుల ఇసుక స్టాక్‌ చేస్తే.. ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే.. టీడీపీ, జనసేన నాయకులు వాటిపై గద్దల్లా వాలిపోయారని, ఏకంగా 35 లక్షల టన్నుల ఇసుక దోచుకున్నారని చెప్పారు.

అందుకేగా? ఓట్‌ ఆన్‌ అకౌంట్‌?
ఎన్నికల ముందు అలవి కాని హామీలిచ్చిన చంద్రబాబు, ఇప్పుడు వాటిని అమలు చేయలేక మల్లగుల్లాలు పడుతున్నారని వైయస్సార్‌సీపీ ఎమ్మెల్యే పేర్కొన్నారు. పూర్తిస్థాయి బడ్జెట్‌ ప్రవేశపెడితే, పథకాలకు కేటాయింపులు ఉండవని, వాటిని చూపలేరని.. అందుకే ఓట్‌ ఆన్‌ అకౌంట్‌కు వెళ్తున్నారని ఆక్షేపించారు. దేశంలో ఏ ప్రభుత్వం కూడా ఏడు నెలల కాలాన్ని ఓట్‌ ఆన్‌ ఎక్కౌంట్‌తో వెళ్లదీయదని తేల్చి చెప్పారు.

చంద్రబాబు ‘వాయిస్‌’లా షర్మిల
రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా ఉన్న వైయస్‌ షర్మిల.. అచ్చం చంద్రబాబు వాయిస్‌లా పని చేస్తున్నారని ఎమ్మెల్యే తాటిపర్తి ధ్వజమెత్తారు. చంద్రబాబుకు, ఆయన పార్టీకి.. ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి ఏ కష్టం వచ్చినా, షర్మిల బయటకు వచ్చి మాట్లాడుతున్నారని ఆయన గుర్తు చేశారు. టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని ఏ విషయంలోనూ ప్రశ్నించని షర్మిల, అదే పనిగా తమ పార్టీపైనా, తమ గత ప్రభుత్వంపైనా పిచ్చి విమర్శలు చేస్తోందని ఆక్షేపించారు. షర్మిల నీతులు చెబుతుంటే, దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని వ్యాఖ్యానించారు. చివరకు వినుకొండలో జరిగిన దారణహత్యకు రాజకీయాలు కారణం కాదని షర్మిల అన్నారని.. ఇది అత్యంత దారుణమని వైయస్సార్‌సీపీ ఎమ్మెల్యే స్పష్టం చేశారు. రాష్ట్రంలో గత 45 రోజులుగా రెడ్‌ బ్లడ్‌బుక్‌ రాజ్యాంగం నడుస్తున్నా.. ఏనాడూ ప్రశ్నించని, ప్రభుత్వాన్ని తప్పు పట్టని షర్మిల.. చివరకు మహానేత వైయస్సార్‌ విగ్రహాలను ధ్వంసం చేస్తున్నా.. నోరు మెదపని షర్మిల.. తమని నిందించడం అత్యంత హేయమని అన్నారు. ఇదంతా చూస్తుంటే.. రాష్ట్రంలో రెడ్‌బుక్‌ రాజ్యాంగమే అమలు కావాలని ఆమె కోరుకుంటున్నట్లు అనిపిస్తోందని, టీడీపీకి తోకపార్టీలా కాంగ్రెస్‌ పని చేస్తోందని అభిప్రాయపడ్డారు.

ఇవన్నీ ఆమెకు కనిపించడం లేదా?
‘ఈ నెలన్నర రోజుల్లో రాష్ట్రంలో 36 మంది హత్యకు గురి కాగా, 300 మందిపై హత్యాయత్నం జరిగింది. టీడీపీ వాళ్ల వేధింపులు భరించ లేక 35 మంది ఆత్మహత్య చేసుకున్నారు. 560 చోట్ల ప్రైవేటు ఆస్తులను, 490 చోట్ల ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు. వీళ్ల అరాచకాలు భరించలేక దాదాపు 2,700 కుటుంబాలు గ్రామాలు విడిచి వెళ్లిపోయాయి. ఇవన్నీ కాక, 1,050కి పైగా దౌర్జన్యాలు, దాడులు జరిగాయి’. మరి ఇవన్నీ షర్మిలకు కనిపించడం లేదా? ఎందుకు వాటిపై స్పందించడం లేదు? టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించడం లేదు? వారిని ఎందుకు తప్పు పట్టడం లేదు? అని ఎమ్మెల్యే తాటిపర్తి నిలదీశారు.

వివేకా హత్యతో ముడి పెట్టడమా?
రాష్ట్రంలో జరుగుతున్న హత్యా రాజకీయాలను, గతంలో జరిగిన వివేకానందరెడ్డి హత్యను ముడిపెడుతూ మాట్లాడటం షర్మిల దిగజారుడుతనానికి పరాకాష్ట అని ఎమ్మెల్యే చంద్రశేఖర్‌ అన్నారు. 

అందుకే వాకౌట్‌
రాష్ట్రంలో నెలన్నర రోజులుగా కొనసాగుతున్న అరాచక పాలన, పూర్తిగా క్షీణించిన శాంతి భద్రతలు, రాష్ట్రం అప్పుల కుప్పగా మారుతున్న విధానం మీద గవర్నర్‌కి నివేదించిన విషయాని గుర్తు చేసిన ఆయన, ఈరోజు కూడా సభలో, మరోసారి గవర్నర్‌కు తమ ఆవేదన చెప్పుకునే ప్రయత్నం చేశామని తెలిపారు. కానీ, గవర్నర్‌ స్పందించక పోవడంతో, సభ నుంచి వాకౌట్‌ చేశామని చెప్పారు.

ప్రతిపక్షం లేకుండా కుట్ర
ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని ఏకైక ప్రతిపక్ష పార్టీగా, ప్రతిపక్ష నాయకుడిగా వైయ‌స్‌ జగన్‌కి అవకాశం ఇస్తే వారి తప్పుల్ని ఎత్తి చూపుతాం కాబట్టి, దుర్మార్గాలను ప్రశ్నిస్తాం కాబట్టి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వని పరిస్థితి ఉందని ఎమ్మెల్యే తాటిపర్తి అన్నారు. ఢిల్లీలో 70 సీట్లకు గానూ 3 సీట్లు వచ్చిన పార్టీకి ప్రతిపక్ష హోదా ఇస్తే, 40 శాతం ఓటింగ్‌ సాధించిన వైయస్సార్‌సీపీకి ఆ హోదా ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. ప్రతిపక్ష పార్టీ ఉంటే, ప్రతిపక్ష నాయకుడు ఉంటాడని, ప్రతిపక్ష నాయకుడు ఉంటే ప్రశ్నించే గొంతుక ఉంటుందని.. అందుకే సభలో అసలు ప్రతిపక్షం లేకుండా కుట్ర చేస్తున్నారని వైయస్సార్‌సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌ ఆక్షేపించారు.

Back to Top