మచిలీపట్నం: తాడిచెట్టు ఎందుకెక్కావ్ అంటే దూడ గడ్డికోసం అన్నట్టుగా పవన్ కల్యాణ్ మాటలు ఉన్నాయని, చంద్రబాబు కోసమే పనిచేస్తానని దమ్ముంటే షమ్‌షేర్‌గా చెప్పొచ్చు కదా అని పవన్‌ను వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. వారాహి యాత్ర పేరుతో నోటికొచ్చినట్లు ఏదో ఒకటి మాట్లాడటం, ప్రజలను రెచ్చగొట్టడం, సీఎం వైయస్ జగన్ మీద బురదజల్లడం, చంద్రబాబుకు మేలు జరగాలని చూడటం పవన్‌కు బాగా అలవాటైపోయిందన్నారు. రాజకీయాల్లో ఇంతకన్నా దిగజారుడుతనం ఉంటుందా..? అని నిలదీశారు. మచిలీపట్నంలో పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ ఏమన్నారంటే.. 2000లో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలోనే జై తెలంగాణ నినాదం మొదలయ్యింది. 2001లో టీఆర్ఎస్ ఆవిర్భవించింది. కేసీఆర్ పార్టీ పెట్టి జై తెలంగాణ నినాదంతో ఉద్యమాన్ని మొదలుపెట్టాడు. వైయస్ రాజశేఖరరెడ్డి 2004లో ముఖ్యమంత్రి అయితే.. దానికీ వైయస్ జగన్‌కి ఏమిటి సంబంధం..? జనం నవ్వుకుంటున్నారన్న కనీస ఆలోచన కూడా లేకుండా పచ్చి అబద్ధాలు పవన్ మాట్లాడుతున్నాడు. పైగా 2004 ఎన్నికల్లో కాంగ్రెస్‌తో జత కలిసే టీఆర్ఎస్ ఎన్నికల్లో పోటీ చేసింది. మిగతా పార్టీలు కలిసి పోటీ చేశాయి. 2004 ఎన్నికల్లో టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పోటీచేసింది పవన్, ఆయన అన్నయ్య చిరంజీవి కాదా..? రాష్ట్ర విభజన గురించి పవన్ తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడు. వైయస్ రాజశేఖరరెడ్డి వల్లే విభజన జరిగినట్టు మాట్లాడటం విడ్డూరం. 1962-63లో కూడా తెలంగాణ ఉద్యమం జరిగింది.. మరి, ఆ ఉద్యమం రావడానికి అప్పుడెవరు బాధ్యులు పవన్ కల్యాణ్..? పవన్ కళ్యాణ్ కు కనీసం ఈ మాత్రం విచక్షణ కూడా లేదు. పవన్ కూడా తెలంగాణలో బోలెడన్ని ఆస్తులు కొంటున్నాడు కదా.. అతనూ కూడా కారణమే కదా..? ఆవుతో.. ఎద్దుతో.. మామిడి చెట్టుతో.. పుస్తకం తలకిందులుగా పెట్టి ఫొటోలు దిగుతాడు కదా.. ఆ ఫొటోలన్నీ తానేదో పెద్ద పెద్ద పుస్తకాలు చదివినట్టు మీడియాలో ప్రచారం చేసుకుంటాడు కదా.. పవన్‌కు ఈ ఆస్తులన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి..? మరి, తెలంగాణ వాళ్లు దీనికోసం కాదా ఉద్యమం చేసింది. అప్పట్లో పవన్ గురించి కేసీఆర్ ఏం మాట్లాడారు.. మరి, మీ షూటింగ్ లు తెలంగాణలో ఎందుకు ఆపారు.. రిలీజ్ లు ఎందుకు ఆపారు.. మీరే కదా కారణం. చంద్రబాబు వద్ద పవన్ కల్యాణ్ కిరాయి ఒప్పుకున్నాడు.. కూలి తీసుకుంటున్నాడు. కూలి తగ్గట్టుగా పనిచేయడమే పవన్‌కు తెలుసు తప్ప వాస్తవాలు, విచక్షణతో అతనికి పని లేదు. వైయస్ఆర్ సీపీ ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి వైయస్ జగన్ మీద ఉద్ధేశపూర్వకంగా విషం చిమ్మడం, అసత్యాలు మాట్లాడటం తప్ప, ఆయన మాటల్లో వాస్తవాలు లేవు, పవన్ మాట్లాడే మాటలకు అర్థమేమైనా ఉందా? సీఎం వైయస్ జగన్ మీద పవన్‌కు విపరీతమైన ద్వేషం, కక్ష ఉంది. చంద్రబాబు దగ్గర ఒప్పుకున్న ప్యాకేజీ కోసం తప్పితే.. పవన్ మాటలకు విలువ ఎక్కడిది..? ఇకనైనా, విషం చిమ్మే కార్యక్రమాలు కట్టిపెట్టు. చంద్రబాబు కోసమే పనిచేస్తానని దమ్ముంటే షమ్‌షేర్‌గా చెప్పొచ్చు కదా పవన్ కల్యాణ్. తాడిచెట్టు ఎందుకెక్కావ్ అంటే దూడ గడ్డికోసం అన్నట్టుగా పవన్ కల్యాణ్ మాటలు ఉన్నాయి. కొద్దిసేపు నేనే ముఖ్యమంత్రి అవుతానంటావ్.. మరి కొద్దిసేపు నేను ముఖ్యమంత్రిని ఎలా అవుతానని అంటావ్.. ఎన్ని సీట్లలో పోటీ చేస్తావ్..? అంటే అది మాత్రం నాకు తెలియదంటావు. ఇప్పటికైనా, ప్రజలకు నిజాయితీతో నిజాలు చెప్పు.. బీజేపీ, టీడీపీతో కలిసి పోటీ చేస్తామని క్లియర్‌గా చెప్పు. తణుకులో నీ పార్టీ అభ్యర్థిని ప్రకటించావ్.. తెనాలిలో నాదెండ్ల మనోహర్ ను ప్రకటించావు. మరి మిగతా చోట్ల ఎందుకు ప్రకటించవు.. 175 సీట్లలో పోటీ చేస్తున్నావా.. లేదా..? మీరు ఎంతమంది వచ్చినా మాకు లెక్కలేదు. కానీ, మేము అంతా ఒక్కటే అని చెప్పటానికి ఎందుకు భయపడుతున్నారు..? ఎందుకు ముసుగు వేసుకుంటున్నారు..? 30 చోట్ల చంద్రబాబు నియోజకవర్గాలకు ఇన్‌చార్జ్‌లను పెట్టడు. పవనేమో అక్కడ అభ్యర్థులను ప్రకటిస్తాడు. ఆ నియోజకవర్గాలకు వెళ్లి, ప్రభుత్వంపైన, ముఖ్యమంత్రి, మంత్రులపై విషం చిమ్ముతాడు.. ఇదే వారి స్కీమ్. పవన్ 25-30 సీట్ల కంటే ఎక్కువ చోట్ల పోటీచేయడని అందరికీ తెలుసు. - ఒక పార్లమెంటు సీటుకు పోటీ చేసి ముఖ్యమంత్రివి అవుతావా..? పెందుర్తిలో మహిళ హత్య జరిగితే.. ఆ హత్య చేసిన వ్యక్తి గతంలో పూర్వం వలంటీర్. ఆ హత్యకు వలంటీర్ వ్యవస్థకు ఏమిటి సంబంధం..? అలా అంటే, జనసేన, టీడీపీకి సంబంధించిన వాళ్లు ఎన్ని హత్యలు, ఎన్ని గంజాయి కేసులు, ఎన్ని రేప్ కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నారు. వాటన్నింటికీ పవనే కారణమా..? అప్పుడెందుకు పవన్ బాధ్యత తీసుకోలేదు..? వలంటీర్లపై రోజుకొక మాట.. పూటకొక మాట చెబుతున్నాడు. పవన్ కల్యాణ్‌కు సవాల్ విసురుతున్నా.. నిజాయితీ ఉంటే.. 2014 -19 మధ్య నువ్వు , చంద్రబాబు కలిసి చేసిన పాలనలో మీరు ఏం చేశారో.. మళ్లీ అదే పరిపాలనను తెస్తాం అని చెప్పే దమ్ముందా..? మీకు దమ్ముంటే.. ఆ మాట చెప్పండి. ఆ మాట చెప్పి జనం దగ్గరకు వెళ్ళండి. అమరావతి రైతుల దగ్గరకు వచ్చి ఏం చేశావు.. ఎక్కడికి వెళితే అక్కడ ప్రజల్ని మోసం చేసే మాటలు. సినిమా గ్లామర్ తో ప్రజలను అమ్మేసే మాటలు.. పవన్ మాటలు పచ్చిదగాకోరు మాటలు. సామాజికవర్గం ఓట్లను పొట్లం కట్టి బాబుకు అమ్మేయడమే పవన్ స్కీమ్. సీఎం వైయస్ జగన్ గురించి లేనివి ఉన్నట్టుగా చెప్పడానికి ప్రధాని మోడీ, అమిత్ షా దగ్గరికి వెళ్తావ్. ఒక్కరోజు అయినా మోడీని కలిసి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించవద్దని, ప్రత్యేకహోదా ఇవ్వాలని అడిగావా..? వాళ్ళ దగ్గర నీకు సత్తా ఉందని చెబుతున్నావు కదా.. సీఎంని ఆట ఆడించే సత్తా ఉంది అని విర్రవీగుతున్నావు కదా.. అంత సత్తా ఉంటే స్టీల్ ప్లాంట్ గురించి, ప్రత్యేక హోదా గురించి మాట్లాడే ధైర్యం లేదా..? సొల్లు కబుర్లతో ఒక సామాజికవర్గాన్ని రెచ్చగొట్టి వారందర్నీ పొట్లం కట్టి చంద్రబాబుకు అమ్మేయడానికే పవన్ డ్రామాలు, కుట్రలు. పవన్ కుట్రను సామాజికవర్గంతోపాటు రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకున్నారు గనుకే.. నిన్ను అక్కడా, ఇక్కడా ఓడించారు. ఇంకా సిగ్గు అనేది లేకుండా మళ్ళీ బయలుదేరాడు. గతంలో కూడా ఓటేయండి.. ప్రశ్నిస్తానన్న పవన్.. చంద్రబాబును ఏం ప్రశ్నించావ్.. ఎవరికి మేలు చేశావ్..? మీ అన్న చిరంజీవిని చూసి అయినా రాజకీయాలు నేర్చుకో పవన్. రాజకీయాలు తనకు సరిపడవన్నాడు.. చక్కగా సినిమాలు చేసుకుంటున్నాడు. నీవేమో.. ఇతర పార్టీల నుంచి మనుషులను తీసుకోను అని ప్రకటనలు ఇచ్చావు. ఈరోజు ఏ పార్టీ నుంచి ఎవరు వస్తారని.. టాటా మ్యాజిక్ వాహనాలు పెట్టినట్టు రండి.. రండి అని పిలుస్తున్నావ్. నీ ఆలోచనకు, మాటలకు నిలకడలేనప్పుడు ఎందుకు మోసపు మాటలు చెప్పడం. నిలకడలేని పనులు ఎందుకు పవన్..? ఏం ఉద్దరిద్దామని..? ఇకనైనా మోసపు పనులు కట్టిపెట్టు. తప్పుడు మాటలు, అసత్యాలు ఇకనైనా కట్టిపెట్టాలని పవన్‌ను పేర్ని నాని హెచ్చరించారు.