పరిషత్‌ ఎన్నికల్లో వైయ‌స్ఆర్‌ సీపీ చరిత్రాత్మక విజయం 

 పంచాయతీ, మునిసిపల్‌ను మించి జైత్రయాత్ర
 
తిరుగులేని ఆధిక్యంతో 13 జిల్లా పరిషత్‌లు కైవసం 

అఖండ మెజార్టీతో 99.95 శాతం మండల పరిషత్‌లలో విజయదుందుభి 

ఇంతటి ఘన విజయం దేశంలో ఇదే తొలిసారి 

వైయ‌స్ఆర్‌ సీపీ ప్రభంజనంలో కొట్టుకుపోయిన టీడీపీ

జనసేన, బీజేపీ, వామపక్షాల అడ్రస్‌ గల్లంతు 

శ్రీకాకుళం, విజయనగరం, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లోని జెడ్పీటీసీల్లో  వైయ‌స్ఆర్‌ సీపీ క్లీన్‌ స్వీప్‌ 

ఐదు జిల్లాల్లో ఒక్కొక్కటి, కృష్ణాలో 2 జెడ్పీటీసీలకు టీడీపీ పరిమితం

సరిగ్గా రెండున్నరేళ్ల కిందట ఆరంభమైందీ జైత్రయాత్ర. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో 86 శాతం సీట్లు... అంటే ఏకంగా 151 స్థానాలు గెలిచి దీన్ని ఆరంభించారు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. ఆ చరిత్రాత్మక విజయాన్ని తక్కువ చేయటానికి నానా వక్రభాష్యాలూ చెప్పారు చంద్రబాబు, ఆయన తెలుగుదేశం!. ఈ ఏడాది ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికల్లోనూ అదే పునరావృతం. 80 శాతానికిపైగా స్థానాలు వైఎస్సార్‌సీపీవే. అవి పార్టీ రహిత ఎన్నికలు కావటంతో... వైఎస్సార్‌సీపీ సీట్లూ తమ ఖాతాలో వేసేసుకుని బుకాయింపులకు దిగింది టీడీపీ. అంతలో మున్సిపాలిటీ, కార్పొరేషన్‌ ఎన్నికలొచ్చాయి. 98.6 శాతం మున్సిపాలిటీలు... 
 

100 శాతం కార్పొరేషన్లు వైసీపీ పరమయ్యాయి. తరవాత జరిగిన మండల, జిల్లా పరిషత్‌ ఎన్నికల్లోనూ అంతే.. టీడీపీ ఎన్ని డ్రామాలాడినా... అదే ఫలితం వెల్లడయింది. తిరుగులేని ఆధిక్యంతో 13 జిల్లా పరిషత్‌లు, 99.95% మండల పరిషత్‌లలో వైఎస్సార్‌సీపీ విజయదుందుభి మోగించింది. ఈ సారి చంద్రబాబుకు తగిలిన దెబ్బ ఎలాంటిదంటే... సొంత నియోజకవర్గం కుప్పం కాదుకదా... సొంత ఊరు నారావారి పల్లెలోనూ పరాజయం తప్పలేదు. ఆయన భార్య దత్తత తీసుకున్న నిమ్మకూరులోనూ పరాభవమే. దీనికి చంద్రబాబు భాష్యమేంటో తెలుసా..? 

అభ్యర్థులను ఎంపిక చేసి.. బీ–ఫారాలిచ్చి... డబ్బులిచ్చి... ప్రచారం చేసి కూడా.. తాము ఎన్నికల్లో పోటీ చేయలేదని, బాయ్‌కాట్‌ చేశామని చెబుతున్నారు. మరి బాయ్‌కాట్‌ చేస్తే 7 జెడ్పీటీసీ స్థానాలు ఎలా గెలుస్తారు? దాదాపు 923 మంది టీడీపీ అభ్యర్థులు ఎంపీటీసీలుగా ఎలా గెలుస్తారు? అసలు పోటీ చేయకుంటే జనం వీళ్లకెందుకు ఓట్లేస్తారు? ప్రతి పరాజయానికీ చంద్రబాబు అండ్‌ కో ఎన్ని సాకులు చెబుతున్నా ఒక్కటి మాత్రం నిజం. ప్రజల్లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి తిరుగులేని ఆదరణ ఉంది. ఈ జగన్నాథ రథాన్ని జనమే నడిపిస్తూ అపూర్వ విజయాల్ని కట్టబెడుతుండడమే ఇందుకు నిదర్శనం.  

దేశంలో మండల, జిల్లా పరిషత్‌ ఎన్నికల చరిత్రలో ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్సార్‌సీపీ నూతన అధ్యాయాన్ని లిఖించింది. ఇదివరకెన్నడూ లేని రీతిలో.. ఏ రాష్ట్రంలోనూ కనీ వినీ ఎరుగని రీతిలో అన్ని జిల్లా పరిషత్‌లను, 99 శాతానికిపైగా మండల పరిషత్‌ (ఇతర రాష్ట్రాల్లో బ్లాక్‌లు)లను కైవసం చేసుకుంది. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వ సంక్షేమాభివృద్ధికి ప్రజలు మరోమారు పట్టం కట్టారు. ఎవరెన్ని కుట్రలు చేసినా, నిశ్శబ్దంగా బ్యాలెట్‌ ద్వారా బుద్ధి చెప్పారు. కష్టకాలంలో ఆదుకున్న జననేత వెంటే అడుగులో అడుగు వేశారు. జగన్నాథ రథాన్ని ముందుకు నడిపిస్తున్నారు.   

  ఆంధ్రప్రదేశ్‌లో మండల, జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో ప్రజలు వైయ‌స్ఆర్‌ సీపీకి బ్రహ్మరథం పట్టారు. రెండేళ్లుగా సంక్షేమ, అభివృద్ధి పథకాలతో సుపరిపాలన అందిస్తున్న సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డిని మనస్ఫూర్తిగా ప్రజలు ఆశీర్వదించారు. తూర్పున శ్రీకాకుళం నుంచి పశ్చిమాన అనంతపురం వరకూ అన్ని జిల్లాల్లోనూ చారిత్రక విజయాన్ని అందించారు. రాష్ట్రంలో 13 జిల్లా పరిషత్‌లను కైవసం చేసుకోవడం ద్వారా వైయ‌స్ఆర్‌ సీపీ క్లీన్‌ స్వీప్‌ చేసింది. 99.95 శాతం మండల పరిషత్‌లను చేజిక్కించుకోవడం ద్వారా రికార్డు సృష్టించింది.

దేశంలో మండల, జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో ఏ రాష్ట్రంలోనూ ఒకే పార్టీ అన్ని జిల్లా పరిషత్‌లను దక్కించుకోవడం, 99.95 శాతం మండల పరిషత్‌లను కైవసం చేసుకోవడం ఇదే ప్రథమం. రాష్ట్రంలో 660 జడ్పీటీసీ స్థానాలకుగానూ 126 జడ్పీటీసీ స్థానాలను వైఎస్సార్‌సీపీ ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది. మరో 19 స్థానాలకు వివిధ కారణాల వల్ల ఎన్నికలు జరగలేదు. 515 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. 10,047 ఎంపీటీసీ స్థానాలకుగానూ 2,233 స్థానాల్లో వైఎస్సార్‌సీపీ, 95 స్థానాల్లో టీడీపీ, 43 స్థానాల్లో ఇతరులు వెరసి 2,371 స్థానాల్లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వివిధ కారణాల వల్ల 457 స్థానాలకు ఎన్నికలు జరగలేదు. 7,219 స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పోలైన ఓట్లను ఎన్నికల అధికారులు ఆదివారం లెక్కించి, ఫలితాలు ప్రకటించారు.

13 జిల్లా పరిషత్‌లూ వైయ‌స్ఆర్‌ సీపీ కైవసం 
ఆదివారం ప్రకటించిన ఫలితాలు, ఏకగ్రీవంగా ఎన్నికైన జెడ్పీటీసీ స్థానాలతో కలిపి చూస్తే.. 13 జిల్లా పరిషత్తుల్లోనూ వైయ‌స్ఆర్‌ సీపీ తిరుగులేని ఆధిక్యం సాధించి.. క్లీన్‌ స్వీప్‌ చేసింది. 13 జిల్లా పరిషత్‌ అధ్యక్షులుగా వైయ‌స్ఆర్‌ సీపీ అభ్యర్థులే ఎన్నిక కావడానికి మార్గం సుగమమైంది. జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలను చూస్తే.. కర్నూలు, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, విజయనగరం, శ్రీకాకుళం, గుంటూరు జిల్లాల్లో వైయ‌స్ఆర్‌ సీపీ క్లీన్‌ స్వీప్‌ చేసింది. కృష్ణాజిల్లాలో 2, మిగతా ఐదు జిల్లాల్లో ఒక్కో జెడ్పీటీసీ స్థానానికే టీడీపీ పరిమితమైంది.  

మండల పరిషత్‌ల్లోనూ అఖండ విజయం 
ఎంపీటీసీ ఎన్నికల్లో ఆదివారం ప్రకటించిన ఫలితాలు, ఏకగ్రీవంగా ఎన్నికైన స్థానాలతో కలిపి చూస్తే. మండల పరిషత్‌లోనూ వైయ‌స్ఆర్‌ సీపీ అఖండ విజయాన్ని సాధించింది. 99.95 శాతం మండల పరిషత్‌లలో తిరుగులేని ఆధిక్యాన్ని సాధించింది. ఆ మండల పరిషత్‌ ప్రెసిడెంట్లుగా వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఎన్నిక కావడానికి లైన్‌ క్లియర్‌ అయ్యింది. తెలుగు రాష్ట్రాల్లో పేర్కొనే మండలాలనే కర్ణాటక, పశ్చిమబెంగాల్, గుజరాత్‌ తదితర రాష్ట్రాల్లో బ్లాక్‌లుగా పేర్కొంటారు. దేశంలో ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలో ఒకే పార్టీ 99.95 శాతం మండల పరిషత్‌ లేదా బ్లాక్‌లను చేజిక్కించుకున్న దాఖలాలు లేకపోవడం గమనార్హం.

ప్రభుత్వ సంక్షేమాభివృద్ధికి పట్టం
ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అధికారం చేపట్టాక తొలి ఏడాదిలోనే 95 శాతానికిపైగా అమలు చేయడం ద్వారా సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజల మన్ననలు అందుకున్నారు. సీఎం వైయ‌స్‌ జగన్‌ రెండేళ్లుగా అందిస్తున్న సుపరి పాలన.. అమలు చేస్తున్న నవరత్నాలు, సంక్షేమాభివృద్ధి పథకాలకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. రాష్ట్రంలో 2019లో జరిగిన ఎన్నికల్లో 50 శాతం ఓట్లు సాధించిన వైయ‌స్ఆర్‌ సీపీ.. 86.28 శాతం శాసనసభ స్థానాలు(151), 88 శాతం లోక్‌సభ స్థానాలను కైవసం చేసుకుని విజయభేరి మోగించింది.

టీడీపీ కోటలను వైయ‌స్ఆర్‌ సీపీ బద్ధలు కొట్టడంతో ఆపార్టీ శ్రేణులు చెల్లాచెదురయ్యాయి. అధికారం చేపట్టిన తర్వాత సుపరిపాలన.. సంక్షేమాభివృద్ధి పథకాలతోపాటూ కరోనా కష్ట కాలంలో వెన్నుదన్నుగా నిలవడం ద్వారా సీఎం వైఎస్‌ జగన్‌ ప్రజలకు మరింత చేరువయ్యారు. దాంతో 2019 ఎన్నికలతో పోల్చితే వైయ‌స్ఆర్‌ సీపీకి ప్రజల్లో ఆదరణ మరింతగా పెరిగిందే తప్ప ఏమాత్రం తగ్గలేదు. పంచాయతీ ఎన్నికల్లో 80.47 శాతం గ్రామ పంచాయతీలను వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు దక్కించుకున్నారు. ఎన్నికలు జరిగిన 75 మున్సిపాల్టీల్లో 74 వైయ‌స్ఆర్‌ సీపీ ఆఖండ విజయం సాధించింది. 12 నగర పాలక సంస్థలను చేజిక్కించుకోవడం ద్వారా క్లీన్‌ స్వీప్‌ చేసింది. 

టీడీపీ ఉనికి పాట్లు
నానాటికీ వైయ‌స్ఆర్‌ సీపీపై ప్రజల్లో ఆదరణ పెరిగపోతుండటంతో మండల, జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో పోటీచేసేందుకు ప్రతిపక్షం టీడీపీకి అభ్యర్థులే కరవయ్యారు. ఐదేళ్లలో అడ్డగోలుగా దోపిడీ చేసి.. దాచుకున్న కరెన్సీ నోట్ల కట్టలను వెదజల్లి ఎలాగోలా మండల, జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అభ్యర్థులను బరిలోకి దించారు. ఆదిలోనే ఘోర పరాజయం తప్పదని గ్రహించి.. అదే జరిగితే టీడీపీ ఉనికే ప్రశ్నార్థకమవుతుందని ఆందోళన చెందారు. ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు పైకి ప్రకటించి.. లోలోన బరిలోకి దించిన అభ్యర్థులకు భారీ ఎత్తున ఇం‘ధనం’ అందించారు.

టీడీపీ ఉనికిని కాపాడుకోవడానికి మండల, జిల్లా పరిషత్‌ ఎన్నికలు జరగనివ్వకుండా నాటి ఎస్‌ఈసీ నిమ్మగడ్డతో కలిసి కుట్రలు చేశారు. ఈ ఎన్నికల్లో సీఎం వైఎస్‌ జగన్‌ ఒక్క మాట మాట్లాడలేదు.. ఓటు వేయండని అడిగింది లేదు. సుపరిపాలన.. సంక్షేమాభివృద్ధి పథకాలు.. కష్టకాలంలో అండదండగా నిలుస్తూ సీఎం అంటే ఇలా ఉండాలి అని విమర్శకులు కూడా ప్రశంసించే రీతిలో పనిచేస్తూ వస్తున్నారు. రెండేళ్లలోనే ఇంత చేసిన సీఎం వైఎస్‌ జగన్‌కు అవకాశం ఇస్తే మరింత చేస్తారని జనం నమ్మారు. ఓట్ల రూపంలో వైఎస్సార్‌సీపీకి పట్టం కట్టారు. మూడు రాజధానుల ప్రాంతాల్లోనూ వైయ‌స్ఆర్‌ సీపీకి అఖండ విజయాన్ని కట్టబెట్టడం ద్వారా వికేంద్రీకరణతోనే రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధ్యమని చాటిచెప్పారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా కుట్రలు చేసిన టీడీపీకి, ఇతర ప్రతిపక్షాలకు కర్రుకాల్చి వాత పెట్టారు.


2014లో అలా.. నేడు ఇలా..
2014లో ఉమ్మడి రాష్ట్రంలోనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరిగాయి. విభజన తర్వాత ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఈ ఎన్నికల్లో టీడీపీతో పోటాపోటీగా వైయ‌స్ఆర్‌ సీపీ తలపడింది. అప్పట్లో జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో టీడీపీ 5,208 స్థానాల్లో గెలిస్తే.. వైయ‌స్ఆర్‌ సీపీ 4,207 స్థానాల్లో గెలుపొందింది. జెడ్పీటీసీ ఎన్నికల్లో 373 టీడీపీ గెలిస్తే, వైయ‌స్ఆర్‌ సీపీ 275 స్థానాల్లో గెలిచింది. అప్పట్లో వైయ‌స్సార్, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం జిల్లా పరిషత్‌ స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యాన్ని కనబర్చి సత్తా చాటుకుంది. ప్రస్తుతం జరిగిన జెడ్పీటీసీ ఎన్నికల్లో ఆదివారం అర్ధరాత్రి వరకు 616 స్థానాలు వైయ‌స్ఆర్‌ సీపీ చేజిక్కించుకుంటే, కేవలం టీడీపీ 7 స్థానాలకే పరిమితం కావడం గమనార్హం. ఇప్పుడు జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో 8,200 స్థానాల్లో వైఎస్సార్‌సీపీ ఆఖండ విజయం సాధిస్తే, టీడీపీ 923 స్థానాలకు దిగజారింది.  

దివాలా తీసిన టీడీపీ 
ప్రజలు వైయ‌స్ఆర్‌ సీపీని డిస్టింక్షన్‌ మార్కులతో పాస్‌ చేసి మా బాధ్యతను మరింత పెంచారు. ప్రస్తుత ఫలితాలతో దివాలా తీసి, ఐపీ పెట్టిన దశలో టీడీపీ ఉంది. 
–ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి  

ఈ ఫలితాలే నిదర్శనం 
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఫలితాలు సీఎం జగన్‌ రెండేళ్ల పరిపాలనకు నిదర్శనం. పల్లె నుంచి పట్నం వర కు ప్రతి ఎన్నికల్లోనూ వైఎస్సార్‌సీపీకి బ్రహ్మరథం పట్టారు. దమ్ముంటే 19 మంది టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఎన్నికలకు సిద్ధం కావాలి. 
– నీటి పారుదల శాఖ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ 

కుప్పం అసెంబ్లీ స్థానంలో గెలుస్తాం 
టీడీపీ కంచుకోట అని చెప్పుకుంటున్న కుప్పంలోనూ పరిషత్‌ ఎన్నికల్లో ప్రజలు వైయ‌స్ఆర్‌ సీపీకే పట్టం కట్టారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కుప్పంలో ఘనవిజయం సాధిస్తాం.    
– పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top