మహిళా సాధికారత

మహిళల స్థితిగతులు బాగుపడనిదే

సమాజం అభివృద్ధి చెందదు.

ఏ పక్షి అయినా ఒక రెక్కతో ఎగురలేదు.

వై.యస్.ఆర్. ఆసరా
 'మహిళల సాధికారత, స్వయం ప్రతిపత్తి, మరియు వారి రాజకీయ, సామాజిక, ఆర్ధిక, ఆరోగ్య స్థితిగతుల మెరుగుదల' అనేవి సుస్థిరమైన సమగ్ర పాలనలో అంతర్భాగంగా ఉంటాయి. సురక్షితమైన జీవనోపాధి మరియు ఆర్థిక భాగస్వామ్య కల్పనల ద్వారా మహిళల ప్రాధాన్యతను మెరుగుపరచడానికి ప్రభుత్వం అనేక చర్యలు ప్రారంభించడమే గాక, అమలు చేసింది. మహిళల స్థితిని మెరుగుపరచడానికి ఒకే సమయంలో అన్ని చర్యలు తీసుకున్నప్పుడే అభివృద్ధి కార్యక్రమాలు సఫలీకృతమవుతాయి. మహిళలకు ఆర్థిక స్వాతంత్ర్యం కలగజేయటం, రుణవిషవలయం నుంచి బయటకు తీసుకురావటం ప్రభుత్వం ప్రథమ కర్తవ్యం. 2019 ఏప్రిల్ 11 నాటికి ఉన్న 27,168 కోట్ల రూపాయల స్వయం సహాయక సంఘాల యొక్క బ్యాంకు బకాయిలను నాలుగు విడతలుగా తిరిగి చెల్లిస్తామని గౌరవ ముఖ్యమంత్రిగారు వాగ్దానం చేశారన్న విషయం మీ అందరికీ తెలిసినదే. ఈ వాగ్దానాన్ని నెరవేర్చడానికి, మన ప్రభుత్వం 2020 సెప్టెంబర్ 11న వై.యస్.ఆర్. ఆసరా పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం అమలులో భాగంగా వివిధ సంక్షేమ సంస్థల ద్వారా మొదటి విడతగా రూ.6,337 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాలలోని 8,71 లక్షల స్వయం సహాయక సంఘాల ప్రయోజనాల కోసం 2021 22 సం||లో వై.యస్.ఆర్. ఆసరా పథకం రెండవ విడత క్రింద 6,337 కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతున్నాము.

వై.యస్.ఆర్. సున్నా వడ్డీ
మన ప్రభుత్వం 2020 ఏప్రిల్ 24న వై.యస్.ఆర్. సున్నా వడ్డీ పథకమును ప్రారంభించింది. ఈ పథకం అమలులో భాగంగా 2019-20 సం॥నకు చెందిన రుణాలపై వడ్డీకి సంబంధించి రూ.1400 కోట్లను బదిలీ చేయడం జరిగింది. తద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాలలోని 8 లక్షల 78 వేల 874 స్వయం సహాయక సంఘాలకు చెందిన 90 లక్షల 37 వేల 254 మంది మహిళలు లబ్ది పొందారు. ఏప్రిల్ 2021 లో ఈ పథకానికి 1,112 కోట్ల రూపాయలను విడుదల చేయడం జరిగింది. 2021 22 సంవత్సరంలో 1,112 కోట్ల రూపాయలు కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను.

వై.యస్.ఆర్. చేయూత
"మహిళలను అభివృద్ధి చేయవలసిన అవసరం లేదు. నిజం చెప్పాలంటే అభివృద్ధికే మహిళల సహకారం అవసరం" అన్నారు
- ఐక్యరాజ్య సమితి మాజీ సెక్రెటరీ జనరల్ కోఫీ అన్న‌న్ గారు.

ఆర్థిక స్వాతంత్య్రం, అధికారం పొందిన మహిళలు, వారి కుటుంబాలు, సమాజం మరియు జాతీయ, ఆర్థిక వ్యవస్థలకు ఎక్కువ సహకరిస్తారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు 2030ని సాధించటానికి మహిళాసాధికారత తోడ్పడుతుంది.

2020 ఆగస్టు 12 వై.యస్.ఆర్. చేయూత కార్యక్రమాన్ని ప్రారంభించడం ద్వారా మన ప్రభుత్వం తన మరో వాగ్దానాన్ని నెరవేర్చడం జరిగింది. సామాజిక, ఆర్థిక సాధికారత వైపు నడిపించడానికి 45-60 సంవత్సరాల మధ్య వయస్సు గల షెడ్యూల్డ్ కులాల, షెడ్యూల్డ్ తెగల, వెనుకబడిన తరగతుల మరియు అల్ప సంఖ్యాక వర్గాలకు చెందిన 23 లక్షల 76 వేల మంది మహిళా లబ్దిదారులకు 4,455 కోట్ల రూపాయలు సహాయాన్ని అందించాము. రెండవ విడత ఆర్థిక సహాయం కూడా త్వరలో విడుదల చేయడానికి ప్రతిపాదిస్తున్నాను. వెనుకబడిన తరగతులు మహిళలకు కూడా ఇదే విధమైన ఆర్థిక సహాయాన్ని అందించుటకు ప్రభుత్వం నిర్ణయించింది.

'దిశ' అమలులో భాగంగా, మహిళల భద్రత, రక్షణ మరియు సాధికారత దిశగా ప్రభుత్వం మహిళా రక్షకభట నిలయాలను 'దిశ రక్షకభట నిలయాలుగా మార్పు చేయడం, 'దిశ మొబైల్ యాప్'ను ఏర్పాటుచేయడం, ఫోరెన్సిక్ సైన్స్ ప్రయోగశాలలను బలోపేతం చేయడం వంటి అనేక చర్యలు తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 700 మహిళా సహాయక డెస్క్లు ఏర్పాటు చేయబడ్డాయి.

5వ సుస్థిర అభివృద్ధి లక్ష్యమైన 'లింగ సమానత్వం' మరియు 8వ సుస్థిర అభివృద్ధి లక్ష్యమైన 'నిరంతర, సమగ్ర మరియు స్థిరమైన ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడం, పూర్తి ఉత్పాదకతతో కూడిన ఉపాధిని కల్పించడంలో భాగంగా ఎంతో ముఖ్యమైన విషయం ఏమిటంటే మహిళలు మరియు పిల్లల ఆరోగ్యం, పోషణ మరియు సంక్షేమం కోసం వనరులను కేటాయించడం ప్రభుత్వ కర్తవ్యం. 2021-22 మొత్తం బడ్జెట్ వ్యయంలో, పిల్లల అభివృద్ధికి 16,748 కోట్ల 47 లక్షల రూపాయలు మరియు మహిళల అభివృద్ధికి 47,283 కోట్ల 21 లక్ష రూపాయలు ఖర్చు అవుతుందని గౌరవ సభకు తెలియజేస్తున్నాను.

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top