తాడేపల్లి: రాష్ట్రంలో హిందూధర్మాన్ని ధ్వంసం చేయడమే ధ్యేయంగా పెట్టుకుని కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి అంకంరెడ్డి నాగ నారాయణమూర్తి మండిపడ్డారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో హిందూ ఆలయాలకు కూటమి ప్రభుత్వంలో రక్షణ లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా కూర్మ గ్రామంలో రాధాకృష్ణ మందిరాన్ని దగ్ధం చేయడం, తిరుపతి జిల్లాలో వారాహి అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేయడం వంటి వరుస ఘటనలు జరుగుతుంటే, సనాతన ధర్మాన్ని పరిరక్షించడానికే ఉన్నట్లు చెప్పుకునే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఇంకా ఆయనేమన్నారంటే... కూటమి పాలనలో మనుషులకే కాదు, ఆలయాలకు, దేవతా మూర్తులకు కూడా రక్షణ లేకుండా పోతోంది. ఎన్నికలకు ముందు ఆలయాలను పరిరక్షిస్తామని చెప్పుకుని, అధికారంలోకి వచ్చాక వరుసపెట్టి ఆలయాలను కూల్చేస్తున్నారు. ఏడాది కాలంగా ప్రధాన ఆలయాల్లోనే వరుసగా అపచారాలు జరుగుతున్నాయి. 2014-19 మధ్య గుడులు కూల్చివేతలతో అరాచకం సృష్టించిన చంద్రబాబు, తాజాగా కూటమి ప్రభుత్వంలోనూ ఇదే పంథాలో పయనిస్తున్నారు. హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారు గడిచిన నాలుగు రోజులుగా రెండు ఆలయాలను కూల్చివేసి, ఒక ఆలయానికి నిప్పుపెట్టి హిందువుల మనోభావాలతో ఆడుకుంటున్నారు. శ్రీకాకుళం జిల్లాలో కూర్మ అనే గ్రామంలో రాధాకృష్ణ మందిరాన్ని దుండగులు రాత్రికి రాత్రే తగలబెట్టేశారు. తిరుపతి రూరల్ మండలంలో వారాహి మందిరాన్ని కూల్చేసి వారాహి అమ్మవారి విగ్రహాన్ని స్వర్ణముఖి నదిలో పడేశారు. చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే, పులివర్తి నాని అనుచరుడు, తిరుచానూరు మండల టీడీపీ అధ్యక్షుడైన కిశోర్ రెడ్డి ప్రోద్భలంతోనే అర్థరాత్రి జేసీబీలతో ఆలయాన్ని నేలమట్టం చేశారు. వారాహి అమ్మవారిని పూజిస్తూ తన వాహనానికి వారాహి పేరు పెట్టుకుని ప్రదర్శనలు ఇచ్చిన పవన్ కళ్యాణ్, సనాతన ధర్మానికి తానే రక్షకుడిని అన్నట్టు ప్రచారం చేసుకుంటాడు. కానీ ఈ ఘటనపై ఇంతవరకు నోరుతెరిచి మాట్లాడింది లేదు. సనాతన ధర్మానికి అపచారం జరిగిందని దుర్గమ్మ గుడిలో మెట్లు కడిగి షో చేసిన పవన్ కళ్యాణ్, కూటమి పాలనలో వారాహి అమ్మవారి ఆలయాన్ని కూల్చివేస్తే ఎక్కడున్నాడు? తిరుపతి రూరల్ మండలం దామినేడులో టీడీపీ నేత కృష్ణమూర్తి నాయుడు నాగాలమ్మ ఆలయాన్ని నేలమట్టం చేశాడు. గుడి కూల్చివేతను అడ్డుకున్న స్థానికులపై కృష్ణమూర్తి వర్గం దాడికి దిగింది. ఆలయాలకు రక్షణ కల్పిస్తామని, హిందూ ధర్మాన్ని కాపాడతామని నమ్మబలికిన కూటమి నాయకులు వరుసబెట్టి ఆలయాలను రాత్రికి రాత్రే నేలమట్టం చేస్తున్నారు. అయినా పోలీసులు పట్టించుకోకుండా నామమాత్రపు కేసులు నమోదు చేసి చేతులు దులిపేసుకుంటున్నారు. హిందూ ధర్మం మీద జరుగుతున్న ఈ వరుస దాడులను వైయస్ఆర్‌సీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం తీరుమార్చుకోకపోతే భక్తుల నుంచి తీవ్ర పరిణామాలు చూడాల్సి ఉంటుంది.