తాడేపల్లి: యేసు క్రీస్తు మార్గం అందరికీ అనుసరణీయమని శాసనమండలి సభ్యులు, వైయస్ఆర్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి అన్నారు. తాడేపల్లిలోని వైయస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బాపట్ల ఎంపీ నందిగం సురేష్, గుంటూరు నగర మేయర్ కావటి శివ నాగ మనోహర్‌నాయుడు, క్రైస్తవ మత పెద్దలు, పార్టీ ముఖ్య నేతలతో కలిసి లేళ్ల అప్పిరెడ్డి క్రిస్మస్ కేక్ కట్ చేసి లాంఛనంగా వేడుకలకు శ్రీకారం చుట్టారు.ఈ సందర్భంగా అప్పిరెడ్డి మాట్లాడుతూ..మానవుడిగా ప్రజల మధ్యనే నడయాడి సమాజానికి శాంతి సందేశం అందించిన దయామయుడు యేసుక్రీస్తు అని కొనియాడారు. సెమీ క్రిస్మస్ వేడుకలను కూడా తన స్వార్ధ రాజకీయాలతో ముడిపెడుతూ అసమానతలు లేని అందమైన సమాజ స్థాపనకు నిరంతరం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్ గారిపై అవాకులు చెవాకులు పేలుతున్న చంద్రబాబు విద్వేషపూరిత వైఖరిపై అప్పిరెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రతి దాన్నీ రాజకీయం చేస్తూ.. కులాలు, మతాల మధ్య విద్వేషాలు సృష్టిస్తున్న చంద్రబాబుకు మంచి బుద్ధిని ప్రసాదించాలని ఆ భగవంతుడిని కోరారు. అదే సమయంలో విలువలు, విశ్వసనీయతతో, అణగారిన వర్గాల శ్రేయస్సే లక్ష్యంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్ గారికి దేవుని ఆశీస్సులు, ప్రజల దీవెనలు ఉండాలని ప్రార్థించారు. ఎంపీ నందిగం సురేష్ మాట్లాడుతూ.. ప్రభుత్వంపై అనునిత్యం కుట్రలు, కుతంత్రాలు పన్నుతున్న ప్రతిపక్షం, దానికి వంత పాడుతున్న ఎల్లో మీడియా దుష్ట శక్తుల నుంచి రాష్ట్రాన్ని కాపాడాలని కోరారు. ఆ దేవుడ్ని నమ్ముకున్న అందరికీ న్యాయం జరుగుతుందన్నారు. సాటి మనిషితో సత్సంబంధాలు ఉన్న ప్రతి మనిషికీ దేవుడి దీవెనలు ఎళ్ళవేళలా మెండుగా అందుతూనే ఉంటాయని తెలిపారు.