పోసాని కృష్ణమురళికి అన్ని కేసుల్లో బెయిల్స్‌

అన్ని కేసుల్లో బెయిల్స్‌ ఇచ్చిన సంబంధిత న్యాయస్థానాలు

రేపు విడుద‌ల అయ్యే అవ‌కాశం

తాడేప‌ల్లి:  కూటమి ప్రభుత్వం అక్రమంగా పెట్టిన కేసుల్లో ప్రముఖ నటుడు, ప్రముఖ రచయిత పోసాని కృష్ణమురళి కి అన్ని కేసుల్లో బెయిల్స్ ల‌భించాయి. రేపు(బుధవారం) విడుదలయ్యే అవకాశం ఉంది. పోసానిపై పెట్టిన అన్ని కేసుల్లోనూ బెయిల్ లభించడంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యేందుకు మార్గం సుగమం అయ్యింది. ఈరోజు(మంగళవారం), ఆదోని, విజయవాడ కోర్టుల్లో పోసానికి బెయిల్ లభించగా,  నిన్న(సోమవారం) నర్సారావుపేట కోర్టు బెయిల్ ఇచ్చింది. అంతకుముందు రాజంపేట కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

అయితే పోసానిపై పెట్టిన మొత్తం 17 కేసుల్లో మిగత వాటిల్లో బీఎన్ఎస్ చట్టం 35(3) కింద నోటీసులు ఇవ్వాలని ఇప్పటికే హైకోర్టు ఆదేశించింది. దాంతో పోసానికి బిగ్ రిలీఫ్ లభించింది. కాగా, మహాశివరాత్రి రోజు, ఫిబ్రవరి 26న హైదరాబాద్‌లో పోసానిని అరెస్టు చేశారు అన్నమయ్య జిల్లా సంబేపల్లి పోలీసులు. 

ఏపీ ప్రభుత్వం కుట్రలు..
ఏళ్ల కిందట ప్రెస్ మీట్ లో మాట్లాడిన అంశాలకు ఇప్పడు కేసులు పెట్టారు. పోసానికి న్యాయపరమైన ఊరట లభించకుండా ప్రభుత్వం పన్నాగం పన్నింది. అన్నమయ్య పోలీసుల అరెస్టు తర్వాత రాష్ట్రవ్యాప్తంగా పోసానిపై కేసులు నమోదు చేశారు. ఎక్కడెక్కడ కేసులు పెట్టింది కూడా బయటకు రానీయకుండా పోలీసులతో సర్కారు కుట్రలు చేసింది. తద్వారా బెయిల్స్ పిటిషన్లు వేయకుండా ప్రయత్నాలు చేసింది. 

వందల కిలోమీటర్లు తిప్పారు..
ఒక్కో కేసులో పీటీ వారెంట్‌ కోరుతూ పోసానిని వందలకొద్దీ కిలోమీటర్లు తిప్పారు పోలీసులు.హైదరాబాద్‌ నుంచి విజయవాడ మీదుగా రాజంపేటకు..తర్వాత అక్కడ నుంచి నర్సరావుపేటకు, తర్వత గుంటూరుకు, అక్కడ నుంచి కర్నూలు జిల్లా ఆదోనికి, అదోని నుంచి మళ్లీ విజయవాడలోని సూర్యారావుపేటకు తిప్పారు. అపై అక్కడ నుంచి మళ్లీ కర్నూలు జైలుకు తరలించారు.  అయితే 67 ఏళ్ల వయసులో, హృద్రోగ సమస్యలతో బాధ పడుతున్న పోసానిని  అనారోగ్య సమస్యలున్నా  వేధించింది ప్రభుత్వం.  ఈ కుట్రను వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ హైకోర్టుకు నివేదించి సమర్థవంతంగా వాదనలు వినిపించింది.   పోసానిపై నమోదైన కేసులో 35(3)నోటీసు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది. విశాఖపట్నం ఒన్‌టౌన్లో నమోదైన కేసులో పూర్తిగా విచారణను నిలిపేయాలని ఆదేశాలిచ్చింది.

పోసానికి అండగా  వైయ‌స్ఆర్‌సీపీ
హైకోర్టు ఆదేశాల తర్వాత చురుగ్గా దిగువ కోర్టుల్లో న్యాయ స్థానాలను వైయ‌స్ఆర్‌సీపీ లీగల్‌ సెల్‌ ఆశ్రయించింది.  పోసానికి పూర్తిగా అండగా ఉంది వైయ‌స్ఆర్‌సీపీ. దాంతో అన్ని కేసుల్లోనూ పోసాని బెయిల్ పొందడంతో రేపు విడుదలయ్యే అవకాశం కనబడుతోంది. 
 

Back to Top