హైదరాబాద్: వైయస్ వివేకానందరెడ్డి హత్యలో తనకు ఎలాంటి సంబంధించి లేదు వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైయస్ అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ కేసులో ముందస్తు బెయిల్‌పై తెలంగాణ హైకోర్టులో వైయస్‌ఆర్ సీపీ ఎంపీ వైయస్ అవినాష్‌రెడ్డి లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌లో ఎంపీ వైయస్ అవినాష్‌రెడ్డి కీలక అంశాలు ప్రస్తావించారు.
తనకు 160 సీఆర్పీసీ కింద నోటీసు ఇచ్చారని, 161 సీఆర్పీసీ కింద సీబీఐ అధికారులు తన స్టేట్‌మెంట్ రికార్డ్ చేశారన్నారు. స్థానిక ఎమ్మెల్సీ ద్వారా వివేకానందరెడ్డి కుమార్తె సునీత, చంద్రబాబు, సీబీఐ ఆఫీసర్ కుమ్మక్కయ్యారన్నారు. ఈ కేసులో తనను కుట్ర పన్ని ఇరికిస్తున్నారన్నారు. తనకు ముందుస్తు బెయిల్ మంజూరు చేయాలని ఎంపీ వైయస్ అవినాష్‌రెడ్డి కోరారు.
గూగుల్ టేకౌట్ ఆధారంగానే తనను నిందితుడిగా చేర్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు. దస్తగిరిని ఢిల్లీకి పిలిచి చాలా రోజులు సీబీఐ వద్ద ఉంచుకొని.. అక్కడే దస్తగిరిని అప్రూవర్‌గా మార్చారన్నారు. ఈ కేసులో తనపై ఎలాంటి ఆధారాలు లేవని, దస్తగిరి స్టేట్‌మెంట్ ఒక్కటే ప్రాముఖ్యంగా సీబీఐ తీసుకుందన్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు తాను నిందితుడిగా లేను అని, 2021 సీబీఐ చార్జ్‌షీట్‌లో తనను అనుమానితుడిగా చేర్చారన్నారు. తనపై నేరం రుజువు చేయడానికి సీబీఐ వద్ద ఎలాంటి ఆధారాలు లేవని ఎంపీ వైయస్ అవినాష్‌రెడ్డి పిటిషన్‌లో పేర్కొన్నారు.
వైయస్ వివేకానందరెడ్డి తన రెండో భార్యతో ఆర్థిక లావాదేవీలు జరుగుతుండటంతో ఆయన కుమార్తె సునీత కక్ష గట్టిందని, వివేకా కుమార్తె, సీబీఐ, స్థానిక ఎమ్మెల్సీ ద్వారా ప్రతిపక్ష నేతో కుట్ర పన్ని తనను, తన కుటుంబాన్ని దెబ్బతీయడానికి ప్లాన్ చేశారన్నారు.
సునీత, వివేకా రెండో భార్యకు మధ్య విభేదాలున్నాయని, రెండో భార్య కుమారుడికి హైదరబాద్ పబ్లిక్ స్కూల్‌లో సీటు ఇప్పిస్తానని వివేకా హామీ ఇచ్చారన్నారు. స్కూల్ పక్కనే విల్లా కొనుగోలు చేసేందుకు వివేకా ప్లాన్ చేశారని చెప్పారు. వివేకా రెండో భార్య కుటుంబానికి డబ్బును ఫిక్డ్స్ డిపాజిట్ చేసే ప్లాన్ తెలిసి వివేకాతో సునీత గొడవ పడ్డారన్నారు. వైయస్ వివేకా హత్యలో తనకు ఎలాంటి సంబంధించి లేదు అని పిటిషన్‌లో అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు.