న్యూఢిల్లీ : పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)కు చట్టబద్ధత కల్పించే విషయంలో సంబంధిత భాగస్వామ్యులతో చర్చలు జరపడానికి సంయుక్త పార్లమెంటరీ సంఘాన్ని (జేపీసీ)ని ఏర్పాటు చేయాలని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి కేంద్రప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాజ్యసభలో బుధవారం జీరో అవర్‌లో ఎంపీ విజయసాయిరెడ్డి ఎంఎస్‌పీ అంశంపై మాట్లాడారు. ప్రభుత్వం మూడు సాగు చట్టాలను రద్దు చేయడాన్ని అందరూ స్వాగతించినప్పటికీ రైతుల ప్రయోజనాల పరిరక్షణకు ఎలాంటి తీసుకోవాలన్న అంశంపై దేశంలో పెద్ద ఎత్తున చర్చ ప్రారంభమైందన్నారు. ఎంఎస్‌పీకి చట్టబద్ధత కల్పించాల్సిన అవసరం పదేపదే చర్చకు వస్తోందన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్‌రెడ్డి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులు పండించే పంటలకు కనీస మద్దతు ధర కల్పించే అంశాన్ని మాటల్లోనే కాకుండా చేతల్లో ఆచరించి చూపిందన్నారు. కేంద్రం 23 వ్యవసాయ ఉత్పత్తులను కనీస మద్దతు ధర ప్రకటిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదనంగా మరో 24 వ్యవసాయ ఉత్పాదనలకు ఎంఎస్‌పీ ప్రకటించిందని చెప్పారు. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్‌లో 47 పంటలు ప్రస్తుతం కనీస మద్దతు ధర పరిధిలోకి వచ్చాయన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలకంటే అత్యధిక పంటలకు ఎంఎస్‌పీ ప్రకటించిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమే అని ఎంపీ విజయసాయి రెడ్డి చెప్పారు. జాతీయ స్థాయిలో కూడా అన్ని పంటలకు కనీస మద్దతు ధర ఉండేలా చట్టబద్ధమైన హామీ కల్పించాల్సిన అవసరం ఉందని ఎంపీ విజయసాయిరెడ్డి ప్రస్తావించారు. ఎంఎస్‌పీ విషయంలో క్షేత్ర స్థాయిలో ఎదురయ్యే సవాళ్లపై స్పష్టత రావాలంటే రైతులు, రైతు సంఘాలతో విస్తృతంగా సంప్రదింపులు జరపాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఎంఎస్‌పీకి చట్టబద్ధత కల్పించడంలో ఆటంకంగా నిలిచే అంశాలు సామరస్యంగా పరిష్కారం కావాలంటే భాగస్వామ్య పక్షాలతో చర్చలు, సంప్రదింపులే ఏకైక మార్గం. రైతుల అవసరాలకు అనుగుణంగా పార్లమెంట్‌లో చట్టం చేయడానికి ఈ సంప్రదింపులు ఎంతగానో దోహద పడతాయని ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. రైతులు, రైతు సంఘాలతో చర్చలు, సంప్రదింపులకు తగిన వేదిక కల్పించడం శాసనకర్తలుగా మన విధి, బాధ్యత కూడా. కాబట్టి కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)తో ముడిపడిన వివిధ సమస్యలపై సంబంధింత భాగస్వాములతో సంప్రదింపులు జరిపి వారి అభిప్రాయాలను తెలుసుకునేందుకు సంయుక్త పార్లమెంటరీ సంఘం (జేపీసీ)ని ఏర్పాటు చేయవలసిందిగా ఎంపీ విజయసాయి రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.