కార్పొరేషన్ల ఏర్పాటు ఓ గొప్ప నిర్ణయం

టీడీపీ హయాంలో బీసీలకు సముచిత స్థానం దక్కలేదు

సమస్యలపై అవగాహన చేసుకొని పరిష్కరించాలి 

కుల వృత్తులను ఆదుకోవాల్సిన బాధ్యత చైర్మన్లు, డైరెక్టర్లపైనే ఉంది

రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌

 విజయవాడ: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి రాష్ట్రంలో బీసీలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం ఓ గొప్ప నిర్ణయమని రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ అన్నారు. వెనుకబడిన కులాలకు విశ్వాసం కలిగించారని చెప్పారు. విజయవాడలో నిర్వహించిన బీసీ సంక్రాంతి కార్యక్రమంలో ఎంపీ మాట్లాడారు. బీసీలు ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రాల్లో కూడా ఇంత పెద్ద ఎత్తున బీసీలకు మేలు చేసింది లేదన్నారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ రచించిన రాజ్యాంగంలో ఆయన ఆశించిన ఫలాలు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో బీసీలకు, బడుగు, బలహీన వర్గాలకు అందుతున్నాయని చెప్పారు. రాష్ట్రంలో గొప్ప సామాజిక మార్పును వైయస్‌ జగన్‌ తీసుకువస్తున్నారని తెలిపారు. వెనుకబడిన తరగతులను రాజ్యాధికారం వైపు నడిపిస్తూ, నాయకత్వ లక్షణాలు పెంచేందుకు వారికే బాధ్యతలు ఇస్తూ..వారి సమస్యలు వారే పరిష్కరించుకోవాలని వైయస్‌ జగన్‌ ఆలోచన చేస్తున్నారని తెలిపారు. ఏం చేస్తే ఇది సాధ్యమని గ్రహించి అందరికి ఉన్నత విద్యను అందించడం, మరోవైపు రాజ్యాధికారంతో సామాజిక మార్పు సాధ్యమవుతుందన్నారు. అందుకే అమ్మ ఒడి కార్యక్రమం, కార్పొరేషన్ల ఏర్పాటు అన్ని కూడా మన స్థాయిని పెంచాలని సీఎం వైయస్‌ జగన్‌ కృషి చేస్తున్నారన్నారు. 53 శాతం ఉన్న వెనుకబడిన కులాలకు సరైన రిజర్వేషన్లు లేకపోయినా చట్ట సభల్లో కూడా వెనుకబడిన వర్గాలకు స్థానం కల్పించాలని సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశాల మేరకు రాజ్యసభలో ఎంపీ విజయసాయిరెడ్డి బీసీ రిజర్వేషన్లపై చట్టం చేయాలని కోరారని గుర్తు చేశారు. ఏదో ఒక రోజు సాధిస్తామని, ఇందులో అనుమానం లేదన్నారు. ఆ మొక్క ఏపీలో నాటారని, ఇతర రాష్ట్రాలు కూడా నిర్ణయం తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. బీసీల సామాజిక స్థాయిని అంబేద్కర్‌ ఆశించిన ఫలాలు ఇక్కడ వచ్చాయని, ఇతర రాష్ట్రాల్లో కూడా ఒత్తిడి చేయాల్సిన అవసరం ఉందన్నారు. చట్ట సభల్లో బీసీలకు ప్రాధాన్యత కల్పించాలన్న ఉద్యమం ఇతర రాష్ట్రాలకు వ్యాపించాలన్నారు. ఏపీలో ఇంత పెద్ద ఎత్తున బీసీలకు 56 కార్పొరేషన్లు ఇచ్చి సభ్య సమాజంలో వారి స్థాయిని పెంచేలా చేసిన వైయస్‌ జగన్‌ బాటలో ఇతర రాష్ట్రాలు పయనించాలన్నారు. ఇంతవరకు మనం బోయిలుగా ఉన్నామే తప్ప..రాజ్యాధికారం ఇచ్చేందుకు ఏ పార్టీ కృషి చేయలేదన్నారు. టీడీపీ, చంద్రబాబు బీసీలే మాకు పట్టు కొమ్మలంటారు.. ఆ పార్టీ బీసీల వల్లే అధికారంలోకి రావడం వాస్తవమే అన్నారు. కానీ బీసీలకు సముచితమైన స్థానం కల్పించలేదని విమర్శించారు. సీఎం వైయస్‌ జగన్‌ బీసీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. రాజ్యసభలో నాలుగు స్థానాలు వైయస్‌ఆర్‌సీపీకి వస్తే..అందులో ఇద్దరు బీసీలను పెద్దల సభకు పంపించారని గుర్తు చేశారు. ఆ రకమైన ఆలోచన చేసిన నాయకుడు ఎవరు లేరన్నారు. అన్ని కులాలకు వైయస్‌ జగన్‌ సముచిత స్థానం కల్పించారని పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ తెలిపారు. కుల వృత్తులు అంతరించిపోతున్న ఈ రోజుల్లో వాటిని ఆదుకోవాల్సిన ప్రధాన బాధ్యత కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లపై ఉందని, అందరి సమస్యలపై అవగాహన పెంచుకొని, వాటిని పరిష్కరించాలన్నారు. వెనుకబడిన కులాలకు ఇవాళ సంక్రాంతి ముందుగానే వచ్చిందని చెప్పారు. ఇందుకు కారకులైన సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి బీసీలందరి తరఫున ఎంపీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. 

 

Back to Top