విజయవాడ: మీరు అధికారంలోకి వచ్చినప్పుడు వాలంటీర్ వ్యవస్థని రద్దు చేస్తామని ప్రకటించగలరా? అని పవన్ కళ్యాణ్‌కు వైయస్ఆర్‌సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి ఛాలెంజ్ చేశారు. వాలంటీర్ వ్యవస్థపై ఆరోపణలు చేసిన పవన్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండు చేశారు. సోమవారం మిథున్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఇంతకీ ఉభయగోదావరి జిల్లాల్లో మీ అభ్యర్థులెవరు? అని ప్రశ్నించారు. చంద్రబాబు నేతృత్వంలో పవన్ కళ్యాణ్ పని చేస్తున్నారని వ్యాఖ్యానించారు. చంద్రబాబుని ముఖ్యమంత్రి చేయాలన్న లక్ష్యంతోనే పవన్ పావులు కదుపుతున్నారని అభిప్రాయపడ్డారు. రాబోయే ఎన్నికల్లో జనసేన 34 సీట్లలో పోటీ చేయనున్నట్టు వార్తలొస్తున్నాయని.. అసలు ఆ సీట్లలో ఎన్నింటిలో పోటీ చేస్తుందో కూడా తెలియదని ఎద్దేవా చేశారు. ముందస్తు ఎన్నికలు వస్తాయని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. తమతమ పార్టీల పరిపుష్టం కోసమే.. టీడీపీ, జనసేన ముందస్తు ఎన్నికలు వస్తాయని ప్రచారం చేస్తున్నాయని దుయ్యబట్టారు. గడిచిన నాలుగేళ్లలో రాష్ట్రంలో మిస్సింగ్ కేసులు గణనీయంగా తగ్గాయని అన్నారు. దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ రాష్ట్రంగా ఏపీ అవతరించిందని చెప్పారు. టాప్-10 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ చేరిందని వివరించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం ఎంపీలందరూ కేంద్రంపై పోరాడుతున్నారని తెలిపారు. ప్రత్యేక హోదాపై కూడా పోరాడుతున్నామన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంలో వైయస్ఆర్ సీపీ కలుస్తుందనే వార్తలు కేవలం ఊహాజనితం మాత్రమేనని క్లారిటీ ఇచ్చారు. ఒక్క రోజు కూడా ముందస్తు ఎన్నికలు ఉండవని, పార్లమెంట్‌తో పాటే అసెంబ్లీ ఎన్నికలు ఉంటాయని మిథున్ రెడ్డి వెల్లడించారు.