తాడేపల్లి: దౌర్జన్యంగా భూములు లాక్కోవడమే కాకుండా ప్రశ్నించిన దళిత ప్రజా ప్రతినిధులపై చంద్రబాబు దాడులు చేయిస్తున్నాడని వైయస్‌ఆర్ సీపీ ఎమ్మెల్యే మేరుగ నాగార్జున ధ్వజమెత్తారు. రాజధాని ముసుగులో చంద్రబాబు పెయిడ్ ఉద్యమం చేయిస్తున్నాడన్నారు. తాడేపల్లిలో వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే మేరుగ నాగార్జున విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓటుకు నోటు కేసుకు భయపడి చంద్రబాబు హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చి అమరావతిలో తలదాచుకున్నాడని, రాజధాని పేరుతో అమరావతి ప్రాంతంలోని రైతుల వద్ద నుంచి వేల ఎకరాలను లీజుకు తీసుకొని ఐదేళ్లలో రాజధాని ఎందుకు నిర్మించలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారని, రాజధానిపై చేసిన దొంగ సర్వేలను ప్రజలు ఎవరూ నమ్మొద్దన్నారు. దొంగ సర్వేలు చేయించుకొని ప్రజలను మభ్యపెట్టడం చంద్రబాబుకు అలవాటన్నారు. వైయస్‌ఆర్ సీపీ అధికారంలోకి వచ్చిన ఏడు నెలల కాలంలో దళితుల కోసం సీఎం వైయస్ జగన్ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారన్నారు. దళిత జాతి యావత్తు ముఖ్యమంత్రి వైయస్ జగన్‌ను దేవుడిలా ఆరాధిస్తుందన్నారు. బడుగు, బలహీన వర్గాలకు నామినేటెడ్ పదవుల్లో 50శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత వైయస్ జగన్‌దేనన్నారు.