కర్నూలు: పేదలకు ఇళ్ల స్థలాలు దక్కకూడదనే ఉద్దేశంతో ప్రతిపక్షాలు ఎన్ని అడ్డకుంలు సృష్టించిన చివరికి న్యాయం గెలిచింది. 20 ఏళ్లుగా ఇళ్ల సమస్యపై నెలకొన్న అడ్డంకులు ఎట్టకేలకు తొలగిపోయాయి. పేదలకు పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ ప్రత్యేక చొరవతో ఇంటి పట్టాలు అందుకోవడంతో లబ్ధిదారులు ఎమ్మెల్యే కు ధన్యవాదాలు తెలిపారు.
మండల కేంద్రమైన మద్దికెరలోని కొండమ్మ భావి వద్ద ఉన్న ప్రభుత్వ స్థలంలో అర్హులైన 504 మంది లబ్ధిదారులకు స్థానిక తహశిల్దార్ నాగరాజు తో కలిసి పత్తికొండ శాసనసభ్యురాలు కంగాటి శ్రీదేవమ్మ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీదేవమ్మ మాట్లాడుతూ.. 2009 సంవత్సరంలో 8 ఎకరాల 63 సెంట్ల భూమిని పేదల ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వం కొనుగోలు చేసిందన్నారు. అయితే పదిమంది లబ్ధిదారులు సదరు స్థలంలో తమకు రెవెన్యూ అధికారులు ఇంటి పట్టాలు మంజూరు చేయాలని కోరుకుంటూ 2005 సంవత్సరంలో నకిలీ పట్టాలతో కోర్టుకు వెళ్లడంతో ఇళ్ల పట్టాల పంపిణీ నిలిచిపోయిందన్నారు. ఎట్టకేలకు ఈ సమస్యకు పరిష్కారం లభించడంతో లబ్ధిదారులు ఆనందంగా ఉన్నారని చెప్పారు. ప్రతి ఒక్కరికి సొంతింటి కల నిజం చేయడమే వైయస్ జగన్ మోహన్ రెడ్డి లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు.