బీజేపీని ప్రశ్నించు కన్నా.. ?

 కన్నా లక్ష్మీనారాయణ లైన్‌ బీజేపీదా? టీడీపీదా?

కాణిపాకంలో ప్రమాణం చేసేందుకు ఆలస్యం ఎందుకు కన్నా?

నిరాధార ఆరోపణలు చేసిన లక్ష్మీ నారాయణ క్షమాపణలు చెప్పాలి

కరోనా టెస్టింగ్స్‌లో దేశంలోనే ఏపీ రెండో స్థానంలో ఉంది

చంద్రబాబుకు రాజకీయాలే ముఖ్యం

వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి గుడివాడ అమర్‌నాథ్‌

విశాఖ: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ ఏ పార్టీ తరఫున మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ పేర్కొన్నారు. రూ.730 చొప్పున దక్షిణ కొరియా దేశం నుంచి ఏపీ ప్రభుత్వం లక్ష రాపిడ్‌ కిట్లు కొనుగోలు చేసిందని, అంతకంటే ఎక్కువ ధరకు అనగా రూ.790 చొప్పున ఐదు లక్షల కిట్లు కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసిందన్నారు. ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న కన్నా లక్ష్మీనారాయణ ముందుగా సొంత పార్టీ బీజేపీని ప్రశ్నించాలని అమర్నాథ్‌ సూచించారు. విశాఖలో మంగళవారం గుడివాడ అమర్‌నాథ్‌ మీడియాతో మాట్లాడారు.

టీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ
కన్నా లక్ష్మీ నారాయణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కాదని, తెలుగు దేశం జనతా పార్టీ అధ్యక్షుడని అమర్‌నాథ్‌ అభివర్ణించారు. చంద్రబాబుకు రూ.20 కోట్లకు అమ్ముడపోయరని ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నామని అన్నారు. కన్నా ఈ సవాల్‌ను స్వీకరించి కాణిపాకం వచ్చి ప్రమాణం చేయాలన్నారు. కరోనా ఉందని ఆలస్యం చేయడం ఎందుకని ప్రశ్నించారు. అసలు కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడేది బీజేపీ లైనా? చంద్రబాబు ఇచ్చే లైనా అని ప్రశ్నించారు. రాపిడ్‌ కిట్ల కొనుగోలులో అక్రమాలు జరిగాయని కన్నా ఆరోపిస్తున్నారని, ఆయన ప్రశ్నించేది వైయస్‌ఆర్‌ సీపీ ప్రభుత్వాన్నా..? బీజేపీనా అని ప్రశ్నించారు. 

బాబు హైదరాబాద్‌లో కూర్చొని ఆరోపణలు
కరోనా నియంత్రణకు ఏపీ ప్రభుత్వం సీఎం వైయస్‌ జగన్‌ నేతృత్వంలో చిత్తశుద్ధితో పని చేస్తుందని గుడివాడ అమర్‌నాథ్‌ పేర్కొన్నారు. దేశంలోనే ఏపీలో కరోనా టెస్టులు చేయడంలో రెండో స్థానంలో ఉందన్నారు. జాతీయ మీడియా సీఎం వైయస్‌ జగన్‌ చేస్తున్న కృషిని ప్రశంసిస్తుంటే..చంద్రబాబు పక్క రాష్ట్రమైన తెలంగాణలోని హైదరాబాద్‌లో కూర్చొని ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. అది చాలదన్నట్లుగా కన్నా లక్ష్మీ నారాయణను కలుపుకొని ఇలాంటి నిరాధార ఆరోపణలు చేయడం సిగ్గు చేటు అన్నారు.  చంద్రబాబుకు నాలుగు స్తంభాలుగా ఉన్న సుజనా చౌదరి, సీఎం రమేష్‌ వంటి వ్యక్తులను బీజేపీలోకి పంపించారని, అ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడితో బేరం కుదిరించుకొని ఆరోపణలు చేయిస్తున్నారని ధ్వజమెత్తారు. నిరాధార ఆరోపణలు చేసిన కన్నా లక్ష్మీనారాయణ  వెంటనే క్షమాపణ చెప్పాలని అమర్‌నాథ్‌ డిమాండు చేశారు. 
 

Back to Top