ఏపీ ఎన్నికల్లోనూ ఈవీఎంల మాయాజాలం! 

పోలింగ్‌ ముగిసే సమయానికి 68.12 శాతం ఓట్లు నమోదు 

తుది పోలింగ్‌ శాతం మాత్రం 81.86 శాతం నమోదైనట్లు ఈసీ వెల్లడి 

‘ఎక్స్‌’లో రిటైర్డు ఐఏఎస్‌ పీవీఎస్‌ శర్మ 

అధికంగా పోలైన ఓట్లన్నీ టీడీపీకే ఎలా పడతాయి?: ‘ఎక్స్‌’లో మాజీ ఎమ్మెల్యే గడికోట

తాడేప‌ల్లి: రాష్ట్రంలో 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంల మాయాజాలం చోటుచేసుకుందనే చర్చ మరోసారి ఊపందుకుంది. మహారాష్ట్రలో ఈవీఎంల మాయాజాలంవల్లే బీజేపీ గెలిచిందని.. వచ్చే ఎన్నికల్లో బిహార్‌లోనూ అదే రీతిలో గెలిచేందుకు బీజేపీ ఎత్తులు వేస్తోందని కాంగ్రెస్‌ నేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత, రాహుల్‌గాంధీ ఓ ఆంగ్ల పత్రికలో రాసిన వ్యాసంలో ఆరోపించారు. ఈ వ్యాసాన్ని ఉటంకిస్తూ మహారాష్ట్ర తరహాలోనే ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లోనూ ఈవీఎంల మాయాజాలంతో కూటమి గెలిచిందంటూ ‘ఎక్స్‌’ వేదికగా రిటైర్డు ఐఏఎస్‌ పీవీఎస్‌ శర్మ ఉద్ఘాటించారు. 

‘ఆంధ్రప్రదేశ్‌లో 2024, మేలో జరిగిన ఎన్నికల్లో సాయంత్రం 6 గంటలకు 68.12 శాతం ఓట్లు పోలైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆ తర్వాత 81.86 శాతం ఓట్లు పోలైనట్లు తుది పోలింగ్‌ శాతాన్ని ఎన్నికల సంఘం (ఈసీ) ప్రకటించింది. అంటే.. తొలుత ప్రకటించిన దానికి.. చివరిసారిగా ప్రకటించిన శాతానికి, పోలింగ్‌ 13.74 శాతం ఎక్కువగా ఉంది. దీనివల్ల 46 లక్షల ఓట్లు అధికంగా పోలయ్యాయి. అంటే.. సగటున ఒక్కో నియోజకవర్గానికి 26 వేల ఓట్లు అధికంగా పోలయ్యాయి. చివర్లో పెరిగిన పోలింగ్‌ శాతమే అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేసింది’ అంటూ తన ‘ఎక్స్‌’ ఖాతాలో పీవీఎస్‌ శర్మ ఆదివారం కుండబద్దలు కొట్టారు.

రాయచోటిలో అధికంగా పోలైన ఓట్లన్నీ ఒకే పార్టికా!? : గడికోట
వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తంచేస్తూ ‘ఎక్స్‌’లో పోస్టుచేశారు. ‘నేను ప్రాతినిధ్యం వహించి పోటీచేసిన రాయచోటి నియోజకవర్గంలో ఎన్నికలు జరిగిన తీరు, పోలింగ్‌ సరళి తదితర అంశాలను, గణాంకాలను పరిశీలిస్తే.. కొన్ని అనుమానాలు తలెత్తుతున్నాయి. 2012 ఉప ఎన్నిక, 2014, 2019, 2024లో జరిగిన రాయచోటి అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికలను పరిశీలిస్తే.. 2012, 2014, 2019 ఎన్నికల్లో 62 వేల నుంచి 66 వేల ఓట్లు టీడీపీకి వచ్చాయి. వైఎస్సార్‌సీపీకి 92 వేల నుంచి 98 వేల మధ్య ఓట్లు వచ్చాయి.

2014తో పోలిస్తే 2019లో పోలైన ఓట్ల పెరుగుదల కేవలం 200 మాత్రమే. 2019తో పోల్చితే 2024లో 30 వేల ఓట్లు అధికంగా పోలయ్యాయి. గతంలో ఇంత పెరుగుదల ఎప్పుడూలేదు. కానీ, 2024లో వైఎస్సార్‌సీపీకి 95 వేల ఓట్లు వచ్చాయి. గత ఎన్నికల ఫలితాలతో చూస్తే.. వైఎస్సార్‌సీపీ ఓట్లు అలానే ఉన్నాయి. కానీ, టీడీపీకి మాత్రం 96 వేల ఓట్లు వచ్చాయి. అంటే.. 2019తో పోలిస్తే 2024లో అధికంగా పోలైన 30 వేల ఓట్లు కూడా టీడీపీకే పడ్డాయని అర్థమవుతోంది. అధికంగా పోలైన ఈ 30 వేల ఓట్లు ఒకే పార్టికి ఎలా పడతాయి? ఇది సాధ్యమేనా? ఇది నమ్మశక్యమేనా?’ అంటూ గడికోట శ్రీకాంత్‌రెడ్డి ‘ఎక్స్‌’లో ప్రశ్నించారు.  

Back to Top