స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి ఇది సరైన సమయం కాదు 

వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎమ్మెల్యే ధర్మాన ప్రసాద రావు 
 

శ్రీ‌కాకుళం: స‌్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు నిర్వ‌హించ‌డానికి ఇది స‌రైన స‌మ‌యం కాద‌ని వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎమ్మెల్యే ధ‌ర్మాన ప్రసాద‌రావు పేర్కొన్నారు. ఎన్నిక‌ల షెడ్యుల్ విడుద‌ల చేయ‌డాన్ని ఆయ‌న తీవ్రంగా ఖండించారు. శ‌నివారం ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు మీడియాతో మాట్లాడారు. క‌రోనా పేరుతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ మొదట ఎన్నికలను వాయిదా వేశార‌న్నారు. దేశంలోని, రాష్ట్రంలోని పరిస్థితులను అలాగే సుప్రీం కోర్టు ఇచ్చిన జడ్జిమెంటును కోట్ చేస్తూ ఎన్నికలు వాయిదా వేశార‌ని గుర్తు చేశారు. అయితే, ఇప్పుడు కూడా అవే పరిస్థితులు ఉన్నాయి తప్ప భిన్నమైన పరిస్థితులు లేవ‌న్నారు. కరోనా సమయంలో కేంద్ర ప్రభుత్వంలోని విపత్తు నిర్వహణ సంస్థ వారు దేశ పౌరులు ఎలా ఉండాలని ఆదేశాలు, సూచనలు జారీ చేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో రాజ్యాంగపరమైన సంస్థ అయిన ఎన్నికల కమిషన్ ఈ ఆదేశాలను అధిగమించడం ఆశ్చర్యంగా ఉంద‌న్నారు.  నూతన సంవత్సర సమయంలో ప్రతిఏడాది దాదాపుగా 10 వేల మంది బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషులు, పార్టీ కార్యకర్తలను కలిసే తాను.. ఈ సంవత్సరం వాటన్నిటికీ దూరంగా ఉండాలని చెప్పి వేరే ప్రాంతానికి వెళ్ళాన‌ని చెప్పారు.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాక్సినేషన్ కోసం పనిచేస్తుంటే, పౌరులు వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తున్న సమయంలో ఈ ఎన్నికలు ఎందుకు నిర్వహించాలని అనుకుంటున్నారో అర్థం కావడం లేదు. వాయిదా వేసే సమయంలో ఇప్పుడున్న పరిస్థితులు మెరుగయ్యేంతవరకు ఎన్నికలు నిర్వహించరాదని కమిషన్ వారు తమ నోటిఫికేషన్ లో చెప్పారు. మరి ఇప్పుడు ఆ పరిస్థితులు మెరుగయ్యాయా, లేదు కదా ? మరోవైపు సెకండ్ వేవ్ వస్తుందని ప్రజలు ఆందోళన చెందుతున్న సమయంలో, కొన్ని దేశాలు ముందస్తు లాక్ డౌన్ విధిస్తుంటే మనం ఎన్నికలు జరుపుదామా.. విచిత్రంగా అనిపిస్తుంది. ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయం ప్రజల ప్రయోజనాలకు సంబంధించిలేదు. పంచాయతీరాజ్, హెల్త్ డిపార్టుమెంటు, సామజిక కార్యకర్తలు వాక్సినేషన్ కోసం ప్రయత్నిస్తున్న సమయంలో ఎలక్షన్ గందరగోళం ఏంటి అనేది అర్థవంతంగా లేదన్నది  అభిప్రాయప‌డ్డారు.

Back to Top