తాడేపల్లి: అమరావతిని సర్వజన అమరావతిగా ప్రకటించి సుమారు 55 వేల కుటుంబాలకు ఇళ్ల పట్టాల పంపిణీ కోసం 1251 ఎకరాలు కేటాయించిన ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డికి వైయస్‌ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి మనిషి సొంతిల్లు ఉండాలని కనే కలను సీఎం నిజం చేస్తున్నారన్నారు. సీఆర్‌డీఏ చట్టం ప్రకారం సుమారు 2600 ఎకరాలు 5 శాతం ఆర్థికంగా వెనుకబడి పేదల కోసం కేటాయించాలని ఉందని, చట్టానికి లోబడి సీఎం వైయస్ జగన్ పేదల కోసం 1251 ఎకరాలు కేటాయించారన్నారు. వాచీ, ఉంగరం లేదని బీరాలు పలికే చంద్రబాబు అమరావతిలో ఇంటి స్థలం కోసం దరఖాస్తు చేసుకోవాలని, వలంటీర్ ఇంటికి వచ్చి మీ తండ్రీకొడుకులు అర్హులో కాదో.. తేల్చుతారని, ఒక సెంట్ స్థలం వస్తుందన్నారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే ఆర్కే విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
అమరావతిలోకి రాజధానిలోకి పేదలు, దళితులు, ముస్లింలు, బీసీలు ఎవరూ కాలు పెట్టేందుకు వీల్లేదు అన్నట్లుగా చంద్రబాబు ప్రవర్తిస్తున్నాడని ఆర్కే మండిపడ్డారు. నిన్నటి రోజున ముఖ్యమంత్రి వైయస్ జగన్ ప్రభుత్వం విడుదల చేసిన జీఓ నంబర్ 107పై చంద్రబాబు కేసు వేయించినట్లుగా తెలిసిందన్నారు. సుమారు 1250 నుంచి 1300 పేజీల అఫిడవిట్ ఫైల్ అయిందని మిత్రుడి ద్వారా సమాచారం వచ్చిందని ఆర్కే చెప్పారు. అమరావతిలోని భూములను పెద్ద కంపెనీలకు అమ్ముకొని డబ్బులు సంపాదించుకుందామనే చంద్రబాబు ఆలోచనకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ అడ్డుకట్ట వేశారన్నారు. రాజధానిలో గొప్ప వారు మాత్రమే ఉండాలా..? పేదవాడు ఉండకూడదా..? చంద్రబాబూ అని ప్రశ్నించారు. పేదవాడు కూడా రాజధాని ప్రాంతంలో నివసిస్తున్నానని గర్వంగా చెప్పుకోవాలని సీఎం వైయస్ జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. నిరుపేద ఇల్లు కోసం ఒక సెంట్ స్థలం ఇచ్చేందుకు చంద్రబాబుకు ఇన్నేళ్లయినా మనసు రాలేదన్నారు. రైతుల నుంచి సేకరించిన భూములతో రియలెస్టేట్ వ్యాపారం చేయాలని కుట్ర పన్నాడన్నారు. బెంగళూరు, చెన్నై, ముంబాయి, హైదరాబాద్ లాంటి రాష్ట్రాల్లో అన్ని వర్గాల ప్రజలు నివసిస్తున్నారన్నారు.
2020 సంవత్సరం వచ్చాక కూడా ఇల్లు లేని కుటుంబం ఉండకూడదని, పేదల సొంతింటి కలను నిజం చేసేందుకు సీఎం వైయస్ జగన్ ముందడుగులు వేస్తున్నారన్నారు. ఉగాది నాటికి సుమారు 25 లక్షల ఇంటి పట్టాల పంపిణీ చేసేందుకు సన్నద్ధం అవుతున్నారన్నారు. రాజధానిలోకి పేదలు ఎవరూ రాకూడదని ఎన్నో అఫిడవిట్‌లు వేయించేందుకు చంద్రబాబు సిద్ధంగా ఉన్నాడన్నారు. అమరావతిలో 100 అడుగుల అంబేడ్కర్ విగ్రహం పెడతానని మాట తప్పాడన్నారు. పేదలకు ఇళ్ల నిర్మాణం పూర్తయ్యేలోపు 100 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సీఎం వైయస్ జగన్‌ను విజ్ఞప్తి చేస్తానని ఆర్కే చెప్పారు.
సీఎం వైయస్ జగన్ మంచి నిర్ణయాలు తీసుకుంటుంటే అది ఓర్వలేని చంద్రబాబు తన ఎల్లో మీడియా ద్వారా ప్రజలను మభ్యపెట్టాలని కుట్ర చేస్తున్నాడని ఆర్కే మండిపడ్డారు. చంద్రబాబుకు లోబడి ఈనాడు పత్రిక దారుణంగా, దరిద్రంగా తయారైందన్నారు. రాజధాని పరిధిలో ఎంతో ఈనాడుకు తెలియదా..? రాజధాని 8600 పైచిలుకు చదరపు కిలోమీటర్లు ఉన్న ప్రాంతం, కృష్ణా, గుంటూరు జిల్లాలో 57 మండలాలు ఉన్నాయన్నారు. తాడేపల్లి మండలం, మంగళగిరి ప్రాంత వాసులు రాజధాని ప్రాంతంలో ఇళ్లకు అర్హత పొందేందుకు వీల్లేదు అన్నట్లుగా ఈనాడులో చంద్రబాబు వార్త రాయించాడని మండిపడ్డారు. నియోజకవర్గ పరిధులు, సీఆర్‌డీఏ పరిధి ఎక్కడ వరకు ఉందని తెలిసినా కూడా కావాలని ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు చంద్రబాబు కుట్ర చేస్తున్నాడు. సుమారు 10 నుంచి 15 కిలోమీటర్ల వ్యవధిలో ఉన్న వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వడం తప్పా..? సిగ్గులేకుండా చంద్రబాబు నివసించే ఇళ్లు ఎక్కడుందో చెప్పండి అని ఎల్లోమీడియాను ప్రశ్నించారు. అక్రమ నివాసంలో ఉంటూ రూపాయి కూడా అద్దె కట్టకుండా చంద్రబాబు, లోకేష్ ఇద్దరూ ప్రభుత్వం నుంచి హెచ్‌ఆర్‌ఏలు తీసుకుంటున్నారని ధ్వజమెత్తారు.
పేదవాడికి సెంట్ స్థలం ఇస్తుంటే ఇష్టం వచ్చినట్లుగా ఎల్లో మీడియాలో, సోషల్ మీడియాల్లో విషప్రచారం చేయిస్తున్నాడని మండిపడ్డారు. బయట ఎక్కడైనా సరే ఇళ్ల స్థలాల పంపిణీ కోసం భూ సేకరణ చేయాల్సి వస్తే మార్కెట్ కంటే రూపాయి ఎక్కువ ఇవ్వండి అని కలెక్టర్‌లకు పెద్దమనస్సుతో సీఎం ఆదేశాలు ఇచ్చారన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సొంతింటి కలను నిజం చేయడానికి సీఎం వైయస్ జగన్ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రవర్తించొద్దని చంద్రబాబుకు సూచించారు.
ఇళ్లు లేని నిరుపేదలకు ఇళ్లు ఇవ్వాలనేది కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతాల్లో ప్రధానమైందని, సీపీఐ పార్టీ అంటే గర్వంగా చెప్పుకునేవారు చాలా మంది ఉన్నారన్నారు. కానీ సీపీఐ రామకృష్ణ రాజధాని విషయంలో చంద్రబాబు చెబుతున్నట్లుగా ప్రవర్తిస్తున్నాడన్నారు. సీఎం వైయస్ జగన్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ తక్షణమే ప్రకటన చేయాలని కోరారు. నిజమైన కార్యకర్తలు మన్నించాలని కోరుకుంటూ.. సీఎం నిర్ణయాన్ని రామకృష్ణ వ్యతిరేకిస్తే.. కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా కాదు.. చంద్రబాబు పార్టీ ఆఫ్ ఇండియా లీడర్‌గా రామకృష్ణను గుర్తిస్తారన్నారు. ప్రశ్నించడానికే పుట్టానని చెప్పుకునే గొప్ప నాయకుడు గత ఐదు సంవత్సరాల్లో టీడీపీ అరాచకాలపై ఏనాడూ స్పందించలేదు. పవన్ కల్యాణ్‌కు ప్యాకేజీలు ఐదేళ్లలో బ్రహ్మాండంగా అందాయన్నారు. ఈ మధ్యకాలంలో కూడా బూటకపు పర్యటనలను చంద్రబాబు డైరెక్షన్‌లోనే చేశారన్నారు. గుర్తుకువచ్చినప్పుడు పేదల గురించి మాట్లాడే పవన్ కల్యాణ్.. ప్రభుత్వం తీసుకున్న ఇంటి స్థలం పంపిణీ నిర్ణయాన్ని హర్షిస్తూ ప్రకటన విడుదల చేయాలని కోరారు. జీఓ నంబర్ 107ను సమర్థిస్తూ సీఎం వైయస్ జగన్‌కు ఆర్కే ధన్యవాదాలు తెలిపారు.