విజయవాడ: నిషేధిత జాబితా 22ఏ లో ఉన్న భూముల అంశానికి సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి పరిష్కారం చూపారని మంత్రి జోగి రమేష్ తెలిపారు. రాష్ట్రంలో రైతుల కోసం ప్రభుత్వం అనేక పథకాలు తీసుకువచ్చింది. రైతు పక్షపాత ప్రభుత్వం తమదని చెప్పుకునే వైయస్ జగన్ ఎన్నో ఏళ్ళ సమస్యకు పరిష్కారం చూపారని చెప్పారు. నిషేధిత జాబితా 22ఏ లో ఉన్న భూముల అంశానికి పరిష్కారం లభించిందన్నారు. 2016 నుంచి 22ఏ కింద ఉన్న వేలాది ఎకరాల భూములు పరిష్కారానికి నోచుకోనున్నాయి. అవనిగడ్డ, నాగాయలంక ప్రాంతాల్లో సుమారు 16 వేల ఎకరాలు ఈ జాబితాలో వున్నాయి. నిషేధిత జాబితాలో ఉండటంతో క్రయ, విక్రయాలకు, బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవటానికి సైతం అవకాశం లేని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ భూములన్నీ నిషేధిత జాబితా నుంచి ముఖ్యమంత్రి వైయస్ జగన్ తొలగించడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 25 వేల ఎకరాల భూమి నిషేధిత జాబితాలో ఉందని మంత్రి జోగి రమేష్ తెలిపారు. చంద్రబాబు హయాంలో వేలాది ఎకరాలను ఇలా నిషేధిత జాబితాలో ఉంచారన్నారు. రైతుల గోడు విని పరిష్కారం కోసం ముఖ్యమంత్రి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారని అన్నారు. ఇవాళ్టితో రైతులకు తమ భూముల పై సర్వ హక్కులు రానున్నాయని, రైతులకు మంచి రోజులు వస్తాయని మంత్రి వ్యాఖ్యానించారు.