తూర్పు గోదావరి జిల్లా: టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్‌కు మహిళలంటే గౌరవం లేదని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని మండిపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని పర్యటించారు. రాజమండ్రిలో జరుగుతున్న వైద్య కళాశాల నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి రజని మీడియాతో మాట్లాడారు. చింతమనేనికి మహిళల పట్ల గౌరవంలేదు. తాహశీల్దార్ వనజాక్షి పట్ల ఏవిధంగా వ్యవహరించారో అంతా చూశాం.. మహిళల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంతా మంచిది. మేకప్ వేసుకుని తిరుగుతున్న నేను హాస్పటళ్లను పట్టించుకోవడం లేదని విమర్శించడం టిడిపి నేతలకు తగదని హెచ్చరించారు. ప్రభుత్వాసుపత్రులను అభివృద్ధి చేసి వైద్య సేవలు మెరుగుపర్చిన ఘనత జగనన్న ప్రభుత్వానిదే అని మంత్రి స్పష్టం చేశారు. మే ఒకటి నుండి ప్రైవేట్ హాస్పటల్స్ లో ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేయకుండా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ఇప్పటికే ఆరోగ్యశ్రీ బకాయిల చెల్లింపులకు కొంత మేరకు నిధులు విడుదల చేశామని వెల్లడించారు. త్వరలోనే మిగిలిన బకాయిలు చెల్లిస్తామన్నారు. ఆరోగ్య శ్రీ సేవలపై ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. రాజమండ్రిలో మెడికల్ కాలేజ్ కలను సీఎం వైయస్ జగన్ సాకారం చేస్తున్నారని మంత్రి రజని తెలిపారు. సీఎం వైయస్ జగన్ ఏం చేసినా పర్మినెంట్ గా చేస్తారని చెప్పారు. చంద్రబాబు పనులన్నీ టెంపరరీ. తమ హయాంలో ఆరోగ్యశాఖకు ఏం చేశారో టిడిపి చెప్పాలని మంత్రి రజని ప్రశ్నించారు.