బాబూ హుద్‌హుద్ కథ‌లు ఆపు

రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ, వాణిజ్య శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ 

గోదావరి జిల్లాల ప్రజలకు విశాఖ నష్టం తెలియదన్న నమ్మకమా?

అందుకేనా ఇన్ని పచ్చి అబద్ధాలు!

ఆనాడు రూ.4 వేలు ఇవ్వకపోయినా ఇచ్చినట్లు అసత్యాలు?

సూటిగా ప్రశ్నించిన మంత్రి  గుడివాడ అమర్‌నాథ్‌

గోదావరి వరద బాధితులకు తక్షణమే రూ.2 వేలు ఇచ్చాం

లక్ష కుటుంబాలకు రూ.2 వేల చొప్పున సాయం చేశాం 

శిబిరాల్లో తలదాచుకున్న వారికి బియ్యం, సరుకులు ఇచ్చాం

జిల్లా కలెక్టర్‌ మొదలు సచివాలయాల సిబ్బంది వరకు..

మంత్రులు మొదలు, సర్పంచ్‌ల వరకు అందరూ పని చేశారు

ఎన్నడూ లేని విధంగా ఆస్తి, ప్రాణనష్టం లేకుండా చూశాం

మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ స్పష్టీకరణ

మాది చేతల ప్రభుత్వం. మీలా మాటల ప్రభుత్వం కాదు

వరద బాధితులను ఆదుకుంటాం. సాయం చేస్తాం

వరద నష్టంపై అంచనాలు వేగంగా కొనసాగుతున్నాయి

ఈ సీజన్‌ ముగిసే లోగానే వరద బాధితులకు సహాయం

పూరిపాకలకు ఇచ్చే పరిహారం 10 వేలకు పెంచాం

ప్రెస్‌మీట్‌లో మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ ప్రకటన

విశాఖపట్నం:  ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు అబ‌ద్ధాలు చెబుతూ ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెడుతున్నాడ‌ని రాష్ట్ర ప‌రిశ్రమలు, ఐటీ, వాణిజ్య శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ మండిప‌డ్డారు. హుద్‌హుద్ స‌మ‌యంలో ఎలాంటి సాయం చేయ‌కుండా ఇప్పుడు కాక‌మ్మ క‌థ‌లు చెబుతున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు. విశాఖ‌లోని వైయ‌స్ఆర్‌సీపీ కార్యాల‌యంలో శుక్ర‌వారం మంత్రి మీడియాతో మాట్లాడారు.

 గుడివాడ అమర్‌నాథ్‌ ఏం మాట్లాడారంటే..:

లక్ష కుటుంబాలు:
    ఈనెల 9వ తేదీ నుంచి దాదాపు 21వ తేదీ వరకు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో వరద పరిస్థితి మనమంతా చూశాం. గోదావరి చరిత్రలో గతంలో ఏనాడూ లేని విధంగా జూలై నెలలో భారీ  వరదలు వచ్చాయి. 1986 తర్వాత ఆ స్థాయిలో దాదాపు 71 అడుగుల స్థాయిలో గోదావరికి వరదలు వచ్చాయి. అయినా ప్రభుత్వం సమర్థంగా పని చేసింది. దాదాపు లక్ష కుటుంబాలను ఆదుకోవడం జరిగింది.
    
తక్షణమే రూ.2 వేల చొప్పున ఇచ్చాం:
    ప్రతి కుటుంబానికి నిత్యావసరాలతో పాటు, తక్షణ సహాయంగా రూ.2 వేలు వెంటనే ఇచ్చాం. అలా గతంలో ఎక్కడా అలా ఇవ్వలేదు.
ఇటీవల సీఎంగారు పర్యటించి, అన్నీ స్వయంగా వివరాలు ఆరా తీశారు. ఎక్కడా, ఎవరూ తమకు సహాయం అందలేదని చెప్పలేదు. 
    దాదాపు లక్ష కుటుంబాలు.. పశ్చిమ గోదావరిలో 10 వేల కుటుంబాలు, ఏలూరు జిల్లాలో 21,500 కుటుంబాలు, కోనసీమ జిల్లాలో 35 వేల కుటుంబాలు, అల్లూరి సీతారామరాజు జిల్లాలో దాదాపు 42 వేల కుటుంబాలు.. ఇంకా తూర్పు గోదావరి జిల్లా నుంచి దాదాపు 1500 కుటుంబాలకు.. అలా మొత్తం లక్ష కుటుంబాలకు తక్షణ సహాయంగా రూ.2 వేలతో పాటు, 25 కేజీల బియ్యం, నూనె, పప్పు, ఉల్లిపాయలు, బంగాళదుంపలు ఇవ్వడం జరిగింది.

నాడు ఆర్భాట ప్రచారం:
    హుద్‌హుద్‌ తుపాన్‌ సమయంలో బాధితులకు వెంటనే తాను రూ.4 వేలు ఇచ్చానని చంద్రబాబు చెబుతున్నాడు. 10 రోజులు అక్కడే ఉండి ఆదుకున్నానని అంటున్నాడు. కానీ నిజానికి చంద్రబాబు ఒక దరిద్రం. ఆయన కాలు పెట్టగానే అక్కడ తుపాన్‌ వచ్చింది. ఏ పని చేయకపోయినా విపరీతమైన ప్రచారం. అదే చంద్రబాబు ౖనైజం. రాజకీయం.
    చెట్లు ఎక్కి కొమ్మలు కోయడం. కరెంటు తీగలు తెగితే బిగించడం. సిరిపురం పెట్రోల్‌ పంప్‌లో ఒక వాహనదారుడికి పెట్రోల్‌ పోస్తున్నట్లు ఫోజులు. ఇవేనా ఒక సీఎం చేయాల్సిన పనులు?.
    నిజానికి హుద్‌హుద్‌ తుపాన్‌ సమయలలో జగన్‌గారు, ఇక్కడ స్వయంగా 10 రోజులు పర్యటించారు. బాధితులను ఓదార్చారు. అదే చంద్రబాబు సీఎంగా ఉండి, వరద బాధితులకు చేసిందేమీ లేదు. పాచిపోయిన పులిహోర ప్యాకెట్ల విసిరేయడం తప్ప. వెంటనే రూ.4 వేలు ఇచ్చానని పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. నిజానికి ఆయన ఆనాడు హుద్‌హుద్‌ బాధితులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు.
    హుద్‌హుద్‌ తుపాన్‌ వల్ల రూ.60 వేల కోట్ల నుంచి రూ.70 వేల కోట్ల వరకు నష్టం జరిగితే, కేంద్రం ఇచ్చిన రూ.500 కోట్లు మినహా, చంద్రబాబు కనీసం ఒక్క రూపాయి కూడా బాధితులకు ఇవ్వలేదు. 

ప్రాణనష్టం లేదు:
    ఉభయ గోదావరి, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కోనసీమ,  5 జిల్లాలలో గోదావరి వరదల ప్రభావం చాలా ఉంది. అయితే ప్రభుత్వం పూర్తి అప్రమత్తంగా వ్యవహరించి, పెద్ద ఎత్తున ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది. 3వ ప్రమాద హెచ్చరిక దాదాపు వారం రోజులు కొనసాగింది. అయినా ప్రభుత్వం సమర్థంగా వ్యవహరించడం వల్ల ఎక్కడ ప్రాణనష్టం జరగలేదు.
    జిల్లాల పునర్విభజనతో ఆరుగురు కలెక్టర్లు, 6గురు ఎస్పీలు, 6గురు జేసీలు.. అలా పెద్ద సంఖ్యలో అధికారులు రంగంలోకి దిగారు. మరోవైపు సచివాలయాల ఉద్యోగులు, వలంటీర్లు కూడా పూర్తిగా సహాయ పనుల్లో నిమగ్నమై పని చేశారు. ప్రజలను ఆదుకున్నారు. వరద బాధితులను సహాయ శిబిరాలకు తరలించారు. అక్కడ ఏ లోటూ లేకుండా చూసుకున్నారు.

‘రాబందు’ పర్యటన:
    మేము ఇన్ని చేస్తుంటే, నిన్న ఇవాళ రాబందు పర్యటిస్తోంది. ఎప్పుడు తుపాన్లు వస్తాయి. ఎంత మంచి చనిపోతారు అని చూసే, చంద్రబాబు వరద ప్రాంతాల్లో వాలిపోయారు. ఎప్పటిలాగే రాజకీయాలు చేస్తున్నారు.
    సీఎం శ్రీ వైయస్‌ జగన్‌గారు అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లో విస్తృతంగా పర్యటించారు. ఎక్కడా ఆయన సమయాన్ని చూసుకోలేదు. చాలా మంది బాధితులను కలుసుకున్నారు. వారి యోగక్షేమాలు విచారించారు. ప్రతి ఒక్కరిలో భరోసా కల్పించారు. దీంతో వెంటనే పోలవరం ముంపు మండలాల్లో వాలిపోయిన చంద్రబాబు సిగ్గు లేకుండా బురద రాజకీయాలు చేస్తున్నారు.
    నిన్న వేలూరుపాడులో మాట్లాడుతూ, చేతిలో ఒక పేపర్‌ పట్టుకుని, తాను అన్నీ ఇచ్చినట్లు, పెద్ద జాబితా చదివారు. అవన్నీ వరద నష్టంపై అంచనాలు వేసిన తర్వాత ఇచ్చినవే తప్ప, వెంటనే ఇచ్చింది కాదు.

ఈ సీజన్‌లోనే సహాయం:
    వరద నష్టానికి ఈ సీజన్‌లోనే సహాయం చేస్తామని స్వయంగా సీఎంగారు చెప్పారు. 15 రోజుల్లో ఆ అంచనాలు పూర్తి చేసి, వాటన్నింటినీ సచివాలయాల్లో ప్రదర్శిస్తామని, ఎక్కడైనా అభ్యంతరాలు వ్యక్తమైతే సవరిస్తామని తెలిపారు. ఆ విధంగా ప్రతిదీ పూర్తి పారదర్శకంగా చేస్తామని, ఈ సీజన్‌ ముగిసేలోగానే వరద బాధితులకు సహాయం చేస్తామని సీఎంగారు వెల్లడించారు.
    చంద్రబాబు మాదిరిగా మనసులేని వ్యక్తి కాదు జగన్‌గారు. చంద్రబాబు ఎప్పుడు, ఎక్కడ వీలైతే సహాయాన్ని తగ్గించాలని చూసే వారు. వరదల్లో పూరిపాకలకు నష్టం కలిగితే, ఇప్పటి వరకు కేవలం రూ.4 వేలు మాత్రమే ఇస్తుండగా, వాటికి రూ.10 వేలు ఇస్తామని జగన్‌గారు ప్రకటించారు.

హామీలు అమలు చేశావా?:
    చంద్రబాబు ఏదీ చేసే వ్యక్తి కాదు. కేవలం పేపర్లలో చూపి, ప్రచారం చేసుకోవడం ఆయన అలవాటు. ఆయన ఏనాడూ వరదల్లో పేదలను ఆదుకోలేదు. ఆయన చెప్పినట్లుగా రూ.4 వేలు వెంటనే ఇవ్వలేదు. చివరకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు కూడా ఆయన నిలబెట్టుకోలేదు. రైతు రుణాలు, డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేస్తానని మాట తప్పాడు. నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. ఇంటికో ఉద్యోగం ఇస్తానని ఆ పని కూడా చేయలేదు.
కానీ పచ్చి అబద్ధాలు చెబుతున్నాడు. నిన్న భద్రాచలంలో అక్కడి వంతెన తాను కట్టానని చెబుతున్నాడు. 1986లో ఆయన కనీసం ఎమ్మెల్యేగా కూడా లేడు. అయినా అబద్దాలు చెబుతున్నాడు.

విశాఖపై కుట్రలు. కుతంత్రాలు:
    ఏమన్నా అంటే హుద్‌హుద్‌ తర్వాత విశాఖ నగరం చూడమంటాడు. కానీ ఆయన నగరానికి చేసిందేమీ లేదు.
    నిజానికి సీఎం శ్రీ వైయస్‌ జగన్, విశాఖకు మేలు చేయాలని భావించి, ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయిస్తే, చంద్రబాబు ఏ స్థాయిలో దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారో ఎవరూ  మర్చిపోలేదు. చివరకు విశాఖలో రైల్వే జోన్‌ ఏర్పాటును కూడా వ్యతిరేకిస్తూ, స్వయంగా పార్టీ ఎంపీలతో కేంద్రానికి లేఖ కూడా రాయించాడు. ఇంకా దిగజారి మరో 50 ఏళ్లలో విశాఖ నగరం మునిగిపోతుందని తన అనుకూల పత్రికల్లో రాయించాడు.

నిన్ను మించిన రాక్షసుడు ఎవరు?:
    ఇన్ని అరాచకాలు చేసిన చంద్రబాబు, మా ప్రభుత్వాన్ని రాక్షస ప్రభుత్వం అంటున్నాడు. నిజానికి చంద్రబాబును మించిన రాక్షసుడు ఎవరైనా ఉంటాడా? ఎన్టీ రామారావు నుంచి పదవి లాక్కుని, పార్టీని లాక్కుని, చివరకు ఆయన మరణానికి కూడా కారణమయ్యావు. నీ కంటే రాక్షసుడు ఎవరైనా ఉంటారా?. నీ స్వార్థ రాజకీయాల కోసం చివరకు నీ భార్యను కూడా లాగావు. దొంగ ఏడుపులు ఏడ్చావు. నీ కంటే రాక్షసుడు రాజకీయాల్లో ఎవరైనా ఉంటారా?.
    కరువు కాటకాలు, ప్రకృతి వైపరీత్యాలకు నీవు బ్రాండ్‌ అంబాసిడర్‌. అలాంటి నీకు వాటి గురించి మాట్లాడే హక్కు లేదు. ప్రతిదీ ప్రచారానికి వాడుకోవడం నీకు అలవాటు. చివరకు గోదావరి పుష్కరాల్లో నీ ఫోటో షూటింగ్‌ కోసం చేసిన హడావిడి, హంగామా వల్ల 29 మంది చనిపోయారు.
    మొన్నటికి మొన్న నీ పర్యటనలో పడవ బోల్తా అంటూ డ్రామా. నీ పర్యటనలో ఒక బోటు నిండా కెమెరామెన్లు. ఫోటోగ్రాఫర్లు. మరో పడవలో నీ పార్టీ నాయకులు. ఒడ్డుకు వస్తూ, అది ఒరిగితే, దాన్ని కూడా ప్రచారానికి వాడుకున్నావు. నీ నటన చూస్తే, ఒకప్పుడు నీ పార్టీలో ఉన్న జయప్రద కూడా ఆశ్చర్యపోతుంది.

జనం నుంచి జగన్‌గారు:
    అలాంటి డ్రామాలు చేసే నీవు, జగన్‌గారి గురించి మాట్లాడుతున్నావు. జగన్‌గారితో ఎవరైనా సెల్ఫీ దిగితే చూడలేవు. ప్రజలతో మాట్లాడితే ఓర్చుకోలేవు.నిన్ను చూసి అందరూ భయపడతారు. నీవు ఎవరినీ దగ్గరకు తీసుకోవు. అదే జగన్‌గారు జనం నుంచి వచ్చిన నాయకుడు. అందుకే ఆయన దగ్గరకు ప్రజలు వెళ్తారు. ప్రజల కష్టాలు తెలిసిన నాయకుడు జగన్‌గారు. అందుకే వారు ఆయనను తమ మనిషిగా భావిస్తారు.
    మొన్న ఒక బాబుకు జగన్‌గారు తన పెన్‌ ఇచ్చారు. ఎవరికైనా ఆయన అలా గిఫ్ట్‌ ఇస్తారు. చివరకు నీకు కూడా రిటర్న్‌ గిఫ్ట్‌ ఇచ్చారు. 2014 నుంచి 2019 వరకు మా పార్టీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలను తీసుకుపోతే, 2019లో రిటర్న్‌ గిఫ్ట్‌ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో మీకు వచ్చింది సరిగ్గా 23 ఎమ్మెల్యే, 3 ఎంపీ సీట్లు మాత్రమే.

ప్రతి ఒక్కరికీ సాయం చేస్తాం:
    మేము ఈ వరదల్లో అందరినీ ఆదుకున్నాం. రేపు వరద నష్టం అంచనాలు రాగానే నష్టపోయిన ప్రతి ఒక్కరిని ఆదుకుంటాం. సహాయం చేస్తాం. ప్రజల కష్టం తన కష్టంగా జగన్‌గారు భావిస్తారు. అందుకే ఎవరికీ ఏ మాత్రం నష్టం చేయరు. కచ్చితంగా వరద బాధిత ప్రాంతాల్లో ప్రతి ఒక కుటుంబానికి అండగా నిలబడతాం. ప్రతి ఒక్కరినీ ఆదుకుంటాం.

Back to Top