శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా అంటే చంద్రబాబుకు చిన్న చూపు అని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు మండిపడ్డారు. చల్లపేటలోని పద్మావతి ఫంక్షన్ హాల్లో కార్యకర్తల ఆత్మీయ సమావేశాన్నినిర్వహించారు. జలుమూరు, సారవకోట మండలాలకు చెందిన వైయస్ఆర్‌సీపీ శ్రేణులతో ఈ సమావేశ ప్రాంగణం కళకళలాడింది. సమావేశానికి రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..చంద్రబాబుకు మన శ్రీకాకుళం జిల్లా అంటే ఎప్పుడూ చిన్నచూపే. ఆయన ఇంత కాలం అనుకూల మీడియాతో పబ్బం గడుపుకున్నారు. ఆ రోజు విభజనలో భాగంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ కు పరిహారంగా 23 సంస్థలు కేంద్రం కేటాయిస్తే,ఒక్కటంటే ఒక్కటి కూడా ఇక్కడ శ్రీకాకుళంలో చంద్రబాబు నెలకొల్పలేదు. శ్రీకాకుళం పౌరుల కోసం ఒక్క ప్రాజెక్ట్ కూడా పూర్తి చేయలేదు. కానీ యువ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఇందుకు భిన్నంగా ఉన్నారు. మన ప్రాంతంపై ప్రేమతో ఉన్నారు. మన ప్రాంత ప్రజల సమస్యలను సానుకూలంగా అర్థం చేసుకుని మానవతా దృక్పథంతో పరిష్కరించారు. ఐదేళ్లలో 800 కోట్ల రూపాయలతో ఉద్దానానికి శుద్ధ జలాలు ( ఉపరితల జలాలు, గొట్టా బ్యారేజీ నుంచి గ్రావిటీ ద్వారా వంశధార జలాలు) అందించి ఆ ప్రాంతానికి ఊపిరి పోశారు. కిడ్నీ బాధితుల కోసం పలాసలో రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేశారు. అంతే కాకుండా వ్యాధితో బాధపడుతున్నవారికి నెలకు 10 వేల రూపాయల చొప్పున పెన్షన్ అందించారు. ఇక అభివృద్ధి పనుల విషయానికే వస్తే 4 వేల కోట్ల రూపాయలతో మూలపేట పోర్టు శరవేగంగా పనులు జరుగుతున్నాయి. బుడగట్లపాలెం లో 400 కోట్ల రూపాయలతో ఫిష్ లాండింగ్ సెంటర్ ను ఏర్పాటు చేస్తున్నాం. రిమ్స్ లో 900 బెడ్స్ అందుబాటులోకి వచ్చాయి. ఇవన్నీ జగన్ ఒక్కరే చేశారు. కేవలం ఐదేళ్ల కాల వ్యవధిలో ఈ ప్రభుత్వ హయాంలో జరిగాయి, ఇదంతా మీరు ఓటు వేసి అధికారం ఇచ్చిన కారణంగానే సాధ్యం అయ్యాయి. ఆ రోజు నాకు కరోనా వచ్చినప్పుడు రిమ్స్ లోనే ట్రీట్మెంట్ తీసుకున్నాను. ప్రభుత్వ వైద్యంపై నమ్మకం,భరోసా పెంచేందుకు నేను ఆ రోజు ప్రయివేటు ఆస్పత్రులకు పోకుండా రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందాను. స్వాతంత్ర్యం అనంతరం పెద్దఎత్తున వైద్యారోగ్య శాఖలో నియామకాలు చేపట్టాం. ఆ రోజు టీడీపీ ప్రభుత్వ హయాంలో జన్మభూమి కమిటీల సభ్యులు ఇష్టారాజ్యంగా వ్యవహరించేవారు. వాళ్లేమయినా స్వాతంత్ర్య సమరయోధులా ? కాదు కదా..కానీ ఆ విధంగానే చెలామనీ అయ్యేవాళ్లు. పథకాల అమలులో తమ మాటే నెగ్గించుకునేవాళ్లు. దాంతో అర్హత ఉన్నా కూడా చాలా మంది నిరుపేదలకు పథకాలు అందేవి కావు. కానీ ఇవాళ అలా కాదు. అలాంటి బ్రోకర్లు లేరు. మధ్యవర్తుల ప్రమేయం అన్నది లేకుండా పథకాలను వర్తింపజేసేందుకు వైయస్ఆర్ కాంగ్రెస్ నేతృత్వాన నడుస్తున్న ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. ఆ రోజు బ్రోకర్లకు (జన్మభూమి కమిటీ సభ్యులను ఉద్దేశిస్తూ) డబ్బులిస్తేనే కానీ పనులు అయ్యేవే కావు. ఆ బ్రోకర్లకు ముడుపులు ఇస్తేనే ప్రభుత్వం అందించే సంక్షేమం అందేది. ఆ కారణంగా చంద్రబాబు పాలన వాళ్లకే గొప్పగా ఉండేది. పథకాల అమలులో ప్రజలను పికుకు తినేవాళ్లు. పారదర్శకతకు ఆస్కారం అనేది ఉండేదే కాదు. కానీ ఇవాళ ఇందుకు భిన్నంగా మా ప్రభుత్వంలో ఏ పథకానికి ఎంత ఖర్చు చేశామో చెప్పగలం. సంబంధిత ఖర్చును వివరాలను ఆన్లైన్ లో వెబ్సైట్ రూపంలో ఉంచిన ఏకైక ప్రభుత్వం ఇది. అలానే పాలనను మరింత స్థానికం చేస్తూ ఒక్క ఆరోపణ కూడా లేకుండా గ్రామ,వార్డు సచివాలయాలలో ఉద్యోగాలకు సంబంధించిన నియామకాలు చేపట్టాం. దేశంలో ఇతర రాష్ట్రాలకు సైతం మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విధానాలు ఆదర్శంగా ఉన్నాయి. 2.6 లక్షల కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా..ఒక్క మధ్య వర్తి లేకుండా అందించగలిగాం. ఎన్నికల భయంతో చంద్రబాబు,సినిమా యాక్టర్ పవన్ కళ్యాణ్ వాలంటీర్స్ వారి మీద దూషణలు చేస్తూ వచ్చారు. మొన్నటికి మొన్న ఎలక్షన్ కమిషన్ కు తమ బినామీ సంస్థతో ఫిర్యాదు చేయించారు. తరువాత ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని తెలుసుకొని ఇప్పుడు మళ్లీ వలంటీర్ ఉంటారు అని అంటున్నారు. వలంటీరు వ్యవస్థ ఉంటుందని వారి విషయమై సానుకూలత వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎన్నికల సమీపిస్తున్నందున మాట మారుస్తూ.. అనుకూల మీడియా సాయంతో అవకాశవాద రాజకీయం నడిపిస్తున్నారు. 40 ఏళ్లు రాజకీయ రంగంలో ఉన్నా కూడా ఒక్క స్థిరమైన ఆలోచన చంద్రబాబుకు లేదు. వైయస్ జగన్ ప్రభుత్వం మీద గడిచిన 5 ఏళ్లలో 4 సార్లు మాటలు మార్చారు చంద్రబాబు. సంక్షేమ పథకాల అమలు విషయమై ఇప్పటికీ నాలుగు సార్లు నాలుగు మాటలు చెప్పారు. మార్చారు. ఇప్పుడేమో అమలు బాగుండడంతో ప్రజల నుంచి మంచి స్పందన వస్తుండడంతో మా కన్నా మేం ఎక్కువ ఇస్తాం అని పొంతన లేని ప్రకటనలు జారీ చేస్తూ ఉన్నారు. చంద్రబాబుకు ఒక్క విషయమై కూడా స్పష్టత లేదు. మన ప్రభుత్వం సాధించిన విజయాలను చూసి ఓర్వలేక ఆ రోజు ఏవేవో మాట్లాడారు. ఇంకెన్నాళ్లు సంక్షేమ పథకాలను అమలు చేయగలరు.. ఇంకెన్నాళ్లు ప్రభుత్వాన్ని లాక్కొస్తారు అని అన్నారు. తరువాత కొంత కాలానికి రాష్ట్రం శ్రీలంక అవుతుందని భయాందోళలను సృష్టించేందుకు ప్రయత్నించి విఫలం అయ్యారు. ఆఖరికి మొన్నటికి మొన్న రాజమండ్రి సభలో జగన్ కంటే ఎక్కువ మొత్తాలు సంక్షేమ పథకాల రూపంలో ఇస్తాను అని అంటున్నారు. అప్పటి వరకూ ప్రజాధనాన్ని జగన్ దుబారా చేస్తున్నారు అని అన్నవాళ్లంతా ఉన్నట్టుండి మాట మార్చి.,సంక్షేమ రాగం అందుకుంటున్నారు. ఆ రోజు జగన్ పథకాల అమలు చేసి ప్రజాధనం దుబారా చేస్తున్నారు అని వ్యాఖ్యానించిన వారు., పెదవి విరిచిన వారు ఇవాళ చెబుతున్నదేంటో ? ఒక్కసారి ఆలోచించుకోవాలి. పునరాలోచన చేసుకోవాలి. ప్రజలు మీ మాటలను మా చేతలను అన్నింటినీ గమనిస్తున్నారు. మీకు ప్రజాక్షేత్రంలో తప్పక బుద్ధి చెబుతారు. మీ మాటలను మీ సానుకూల మాధ్యమాల మాటలను ఇవాళ నమ్మే స్థితిలో ప్రజలు లేరని విన్నవిస్తూ ఉన్నాను. లోకేశ్ మనిషి పెరిగారు కానీ ఆయనకు అవగాహన అన్నది లేదు. పూర్తి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారాయన. మీరు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి పాలన సంబంధం అయిన సంస్కరణలు గమనించండి. అభివృద్ధికి, సంక్షేమ రంగానికీ ఇచ్చిన ప్రాధాన్యం వాటి వెనుక ఉన్న ఉద్దేశాలనూ,దృక్పథాలనూ గుర్తించండి. మీకు మంచి చేసే మేలు చేసే ప్రభుత్వాన్ని మరోసారి ఎన్నుకోండి. మరోసారి వైయస్ఆర్‌సీపీకి అధికారం ఇవ్వండి. నరసన్నపేట శాసన సభ నియోజకవర్గం నుంచి వైయస్ఆర్‌సీపీ తరఫున పోటీ చేస్తున్న ధర్మాన కృష్ణదాసును, శ్రీకాకుళం పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తున్న పేరాడ తిలక్ ను గెలిపించండి.. అని కోరుతూ.. ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాలని విన్నవిస్తున్నాను అని మంత్రి ధర్మాన తెలిపారు. ఈ నెల 24న ధర్మాన నామినేషన్ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లేందుకు క్షేత్ర స్థాయిలో కార్యకర్తలు మరింత బాగా పనిచేయాలని, అలానే డివిజన్ ఇంఛార్జులు తమ పరిధిలో ఉన్న ప్రతి ఇంటికీ వెళ్లి, ప్రచారం సాగించాలని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు పిలుపు ఇచ్చారు. ఇవాళ ఆయన ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు. కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ నెల 24న రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు నామినేషన్ వేయనున్నారు. వైయస్ఆర్‌సీపీ కార్యాలయంలో ఉగాది వేడుకలలో భాగంగా ఈ విషయం వెల్లడించారు. రానున్న ఎన్నికల్లో మంచి మెజార్టీతో శ్రీకాకుళం నియోజకవర్గంలో గెలవబోతున్నాం అని ధీమా వ్యక్తం చేశారు. టౌన్ హాల్, వైయస్ఆర్‌సీపీ కార్యాలయంలో ఉగాది వేళ పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని నిర్వహించారు. బ్రహ్మశ్రీ ధర్మపురి గౌరీ శంకర శాస్త్రి పంచాంగ పఠనం చేశారు. రాశి,నక్షత్ర ఫలాలు ఏ విధంగా ఈ ఏడాది ఉండనున్నాయో వివరించారు. ఈ సందర్భంగా మంత్రి ధర్మాన మాట్లాడుతూ..అందరికీ క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు. పంచాంగంలో విశేషాలు వినిపించి చైతన్య పరిచిన వైదిక పండితులు గౌరీ శంకర శర్మకు కృతజ్ఞతలు. మానవాళి సజావుగా నడిచేందుకు,వారిని ఎప్పటికప్పుడు చైతన్యపరిచేందుకు పంచాంగం (తిథి,వారం,నక్షత్రం,కరణం,యోగంతో కూడిన) ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. రాజకీయ పార్టీలో ఉన్నవాళ్లందరూ సోషల్ వర్కర్స్. ఎన్నికలు మరో నెల రోజుల్లో రానున్నాయి. మన పార్టీ కార్యకర్తలంతా ఏకతాటిపై నడిచి, ఇప్పటిదాకా చేపట్టిన అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలి. క్షేత్ర స్థాయిలో మరింత బాగా పనిచేయగలగాలి అని పిలుపు ఇస్తున్నాను. మన పార్టీ భావజాలాన్ని ప్రజల్లోకి మరింత తీసుకు వెళ్లాలి. విద్యావంతుల సంఖ్య ప్రతి ఐదేళ్లకూ పెరుగుతోంది. అందుబాటులోకి వచ్చిన మాధ్యమాలను,సాంకేతికతను వినియోగించుకుని పార్టీ చేపట్టిన కార్యక్రమాలపై డిజిటల్ ప్రచారం విస్తృత రీతిన సాగించాలి. శ్రీకాకుళం నగరంలో అన్ని డివిజన్లలో ప్రతి ఒక్కరూ ప్రచారం సాగించాలి. నేను నామినేషన్ వేసే ముందు డివిజన్ల పరిధిలో అన్ని ఇళ్లకూ మీ,మీ పరిధిలో పనిచేసే నాయకులు వెళ్లాలి. ఇవాళ ప్రతి వర్గానికీ మనం చేరుకు న్నాం. అన్ని విభాగాలూ ఎంతో సమర్థంగా ముందుకు వెళ్తున్నాయి. ఇంత మంచి నాయకులూ, కార్యకర్తలూ ఉండడం నా అదృష్టం. టీడీపీ పెడుతున్న మీటింగులకు జనాలు లేక సంబంధిత ప్రాంగణాలు వెలవెలబోతున్నాయి. వాళ్లపై ఎవ్వరికీ నమ్మకం లేదు. ఈ నెల 24న నామినేషన్ వేయనున్నాను. అని మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు.