కుత్సిత భావంతో వార్తలు రాయొద్దు

మంత్రి బొత్స సత్యనారాయణ

 విజయవాడ: వ్యక్తుల కోసం కొంద‌రు వ్యవస్థలను నాశనం చేస్తున్నారని మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ మండిప‌డ్డారు.  చంద్రబాబును రక్షించడానికి ఇలా చేయడం సరికాదని హితవు పలికారు. ఇంకోసారి మళ్లీ ఇలాంటి కుత్సిత భావంతో వార్తలు రాయొద్దని ఆయ‌న హిత‌వు ప‌లికారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు పీఎస్‌ నివాస్‌ ఇంటిపై జరిగిన దాడులపై ఐటీ శాఖ ప్రకటనలో స్పష్టంగా అక్రమాలను వివరించిందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఎన్నికల ముందు కూడా ఎన్డీయేతో కలిసి వెళ్తున్నామని ఎల్లో మీడియా ప్రచారం చేసిందని మండిపడ్డారు. నేడు కూడా చంద్రబాబుకు లబ్ధి చేయడం కోసమే రామోజీరావు ఈ కథనం రాయించారని ధ్వజమెత్తారు. ఈనాడు రామోజీరావుకు లేఖ కూడా రాశానని, ప్రజల చేత తిరస్కరించబడినా కూడా రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నారని నిప్పులు చెరిగారు. తాను అనని మాటలను పచ్చ పత్రికలు ఎలా  రాస్తాయని తీవ్రంగా మండిపడ్డారు. రిజాయిండర్‌ను కూడా తప్పుగా ప్రకటించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రకంగా ఏ స్థాయికి దిగజారిపోతున్నారో తెలుస్తోందని ఆయన దుయ్యబట్టారు.   
 తనను తాను మేధావిగా చెప్పుకునే యనమల రామకృష్ణుడు ఐటీ శాఖ ఇచ్చిన వివరాలను కూడా తప్పుబడుతున్నారని దుయ్యబట్టారు. నివాస్‌ వద్ద తప్పు చేసినట్లుగా ఉన్న ఆధారాలు సీజ్‌ చేశామని ఐటీ అధికారులు చెప్పారన్నారు. ‘యనమల రామకృష్ణుడు ఎవరిపై పరువు నష్టం దావా వేస్తారు. చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌లు తేలు కుట్టిన దొంగల్లా ఎందుకు మౌనంగా ఉన్నారు’  అని  మంత్రి ప్రశ్నించారు. రూ.2వేల కోట్ల పన్ను ఎగవేత ఆధారాలు దొరికాయని.. ఐటీ శాఖ స్పష్టంగా చెప్పిందన్నారు. ఐటీ శాఖ చెబుతున్న మూడు కంపెనీలు టీడీపీకి చెందిన వారివేనని  మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.

తాజా వీడియోలు

Back to Top