గురువు అనే పదాన్ని ఈ రకంగా కించపరచడం తప్పు కదా బాబూ? 

మంత్రి బొత్స సత్యనారాయణ

టీచర్ల విషయంలో ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయి

టీడీపీ రాజకీయంగా దిగజాయిపోయింది

సెప్టెంబర్‌ 5 అంటే చంద్రబాబుకు  ఇష్టం ఉండదు

గురువులను అవమానపరిచేలా ప్రతిపక్ష నేత మాట్లాడుతున్నారు

విద్యారంగంలో సీఎం వైయస్‌ జగన్‌ విప్లవాత్మకమైన మార్పులు తెచ్చారు

విద్యారంగానికి చంద్రబాబు ఏం చేశారో చెప్పగలరా?

తాడేపల్లి: గురువులు అనే పదాన్ని ఈ రకంగా కించపరచడం తప్పుకదా? ఏంటీ ఈ సంస్కృతి చంద్రబాబు అంటూ మంత్రి బొత్స సత్యనారాయణ నిలదీశారు. గురుపూజోత్సవం రోజున ఉపాధ్యాయుల సేవలను కొనియాడాలి కానీ.. రాజకీయ లబ్ధి పొందాలని సీఎం వైయస్‌ జగన్‌పై విష ప్రచారం చేశారని మండిపడ్డారు. సెప్టెంబర్‌ 5వ తేదీ అంటే చంద్రబాబుకు ఇష్టం లేదని, సెప్టెంబర్‌ 1నే ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి చంద్రబాబు సీఎం అయ్యారు కాబట్టి ఆరోజు అంటే ఆయనకు ఇష్టమన్నారు. టీచర్ల విషయంలో ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని, ప్రతీ అంశాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నారని మండిపడ్డారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు.

దురదృష్టకర పరిణామం:

తెలుగుదేశం పార్టీ ఇవాళ చేసిన ప్రక్రియ ఒక దురదృష్టకర పరిణామం. చంద్రబాబునాయుడుకు ఉపాధ్యాయుల దినోత్సవం, సెప్టెంబరు 5 అంటే ఇష్టం ఉండదు. ఆయనకు తాను సీఎం పదవి చేపట్టిన రోజు, వెన్నుపోటు పొడిచి పదవి చేపట్టిన రోజు, సెప్టెంబరు 1 అంటే చాలా ఇష్టం. చీటింగ్‌ చేశాడు కాబట్టి, ఆయనకు ఆరోజు గొప్ప. ఇవాళ గురు పూజోత్సవం రోజున సీఎంగారిపై తప్పుడు ట్వీట్లు పెట్టాడు.

 

వారే నీ గురువులు:

చంద్రబాబు ఒకసారి ఆలోచించుకోవాలి. నీవు ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచినప్పుడు, నీతో ఉన్న వాళ్లు, నీకు నేర్పిన వాళ్లు నీకు గురువులు. ఆనాడు వెన్నుపోటుకు ఆజ్యం పోసిన రామోజీరావు, ఇవాళ నీ అడుగులకు మడుగులు ఒత్తుతున్న రాధాకృష్ణ, నీకు అప్పుడు, ఇప్పుడు వత్తాసు పలుకుతున్న యనమల రామకృష్ణుడు నీకు గురువులు.

ఇవాళ టీచర్స్‌ డే రోజు, వారిని కించపర్చే విధంగా మాట్లాడడం ఏమిటి నీ సంస్కృతి. నీ పార్టీ నుంచి నీవు బీజేపీకి పంపించిన సుజనా చౌదరి వంటి వారు మోసంలో పేటెంట్‌ ఉన్న వారు. అందులో వారు గురువులు. నీవు అధికారంలో ఉన్నప్పుడు నీ కలెక్షన్లు చేసిన నీ కుమారుడు, నీ కుటుంబ సభ్యులు.. అందరూ నీ దోపిడి, అవినీతిలో భాగస్వాములు. ఇవన్నీ ప్రజలు గుర్తించారు కాబట్టే, గత ఎన్నికల్లో నిన్ను ఛీ కొట్టారు. వారు నీ అవినీతిని భరించలేకపోయారు.

 

ఏనాడైనా వారికి మంచి చేశావా?:

ఇవాళ నీవు టీచర్లను రెచ్చగొడుతున్నావు. ఏనాడైనా సరే వారి గురించి నీవు సానుభూతిగా మాట్లాడావా? వారికి మంచి చేశావా? నేను 14 ఏళ్లు సీఎంగా ఉన్నాను. విద్యా రంగంలో ఈ మార్పులు చేశాను. ఇలా స్కూళ్లు అభివృద్ధి చేశాను..అని ఒక్కటంటే ఒక్కటైనా చెప్పుకోగలవా?

 

మేము ఇవన్నీ చెప్పుకోగలం:

అదే సీఎం శ్రీ వైయస్‌ జగన్‌గారు, ఫౌండేషన్‌ స్థాయి నుంచే విద్యా రంగంలో గణనీయ మార్పులు చేశారు. సీబీఎస్‌ఈ సిలబస్, ఇంగ్లిష్‌ మీడియమ్‌ ప్రవేశపెడుతున్నాం. నాడు–నేడు మనబడి కార్యక్రమంలో దశలవారీగా అన్ని స్కూళ్లలో సమూల మార్పులు చేస్తున్నాం. డిజిటల్‌ క్లాస్‌రూమ్‌లు ఏర్పాటు చేస్తున్నాం. ఉన్నత విద్యా రంగంలో కరికులమ్‌లో చాలా మార్పులు చేశాం. ఉపాధి అవకాశాల కల్పన దిశలో ఇంటర్న్‌షిప్‌ను తప్పనిసరి చేశాం. ఆ విధంగా వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపర్చాం.

నీవు ఇలా ఒక్కటైనా చెప్పుకోగలవా? అవేవీ లేవు కాబట్టే, ఇవాళ పార్టీ ఆఫీస్‌లో కూర్చుని పనికిరాని కబుర్లు. అర్ధం లేని విమర్శలు చేస్తున్నావు. ఇలాంటి విపక్షనేత ఉండడం మన కర్మ. అనవసరంగా టీచర్లను రెచ్చగొట్టే ప్రయత్నం. అయితే వారు అంత ఈజీగా రెచ్చిపోరు.

 

ఆ సమస్యనూ పరిష్కరిస్తాం:

ఇవాళ సీపీఎస్‌ సమస్య ఉంది. దాన్ని ప్రభుత్వం కూడా గుర్తించింది. అదే సమయంలో ప్రభుత్వంపై భారం కాకుండా, పాత పెన్షన్‌ కాకుండా, గ్యారెంటీ పెన్షన్‌ విధానాన్ని ఆలోచిస్తున్నాం. దాని కోసం ఉద్యోగులతో కూడా మాట్లాడుతున్నాం. ఏది మంచి, ఎంత వరకు చేయొచ్చన్నది మాట్లాడుతున్నాం. వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని సీఎంగారు ఆదేశించారు కూడా. అంతే కాకుండా ప్రభుత్వ స్కూళ్లు మాత్రమే కాకుండా, ఎయిడెడ్, గురుకుల పాఠశాలల్లో కూడా పదవీ విరమణ వయసును పెంచమని సీఎంగారు ఆదేశించారు. వాటికి సంబంధించి ఇప్పటికే జీఓలు కూడా విడుదల అవుతున్నాయి.

 

ఇదేనా నీ రాజకీయ సీనియారిటీ?:

ఇన్ని జరుగుతుంటే, ఇవాళ ఒక  మంచి పండగ వాతావరణం ఉన్నప్పుడు అన్నీ మర్చిపోయి రాజకీయాలు మాట్లాడుతున్నావు. నీవు ఏదో నిజాయితీపరుడివి అన్నట్లు వ్యవహరిస్తున్నావు. ఒక గురువింద గింజ మాదిరిగా మాట్లాడుతున్నావు. కాదంటావా చెప్పు? చివరకు సీఎంగారి ఇంట్లోని ఆడవారిని కూడా ప్రస్తావిస్తున్నావు. ఇది సబబేనా? నీకు బుద్ధి, జ్ఞానం ఉందా? ఉచ్ఛం, నీచం లేదా? ఇదేనా నీ పరిణితి రాజకీయం? ఇదేనా నీ సీనియారిటీ?

సమయం, సందర్భం లేకుండా విమర్శలు చేయడం. నీ ఇంట్లో ఆడవారి గురించి మేము మాట్లాడలేమా? రోజురోజుకీ చంద్రబాబులో అసహనం పెరిగిపోతోంది. అది అతడి ప్రవర్తన, మాటల్లో కనిపిస్తోంది. ఎందుకంటే ప్రజల్లో ఆ పార్టీ పనైపోయిందని చంద్రబాబుకు కూడా అర్ధమైంది. కానీ మిగిలిన కార్యకర్తలను కాపాడుకునేందుకు ఆ విధంగా మాట్లాడుతున్నావు.

ఈ విషయం మాకు తెలుసు కాబట్టే.. నిన్ను మేము పట్టించుకోవడం లేదు. కానీ నీ విమర్శలు, వ్యవహారశైలి చూసిన తర్వాత మేము కూడా మాట్లాడాల్సి వస్తోంది.

 

ఉద్యోగులకు ప్రయోజనకారిగా..:

సీపీఎస్‌ను మర్చిపొండి. ఓపీఎస్‌తో పాటు, మేము ప్రతిపాదిస్తున్న జీపీఎస్‌.. రెండింటిపై కసరత్తు చేస్తున్నాం. అన్ని కోణాల్లో వాటిని చర్చిస్తున్నాం. సీపీఎస్‌ ఉద్యోగులకు ఆమోదయోగ్యం కాదని గుర్తించాం. అందుకే దాని కంటే మెరుగైన పథకం తేవాలని యోచిస్తున్నాం. ఓపీఎస్‌ అనేది అన్ని ప్రభుత్వాలపై భారం వేస్తోంది. అందుకే మరో విధంగా ఉద్యోగులకు ప్రయోజనకారిగా ఉండడంతో పాటు, ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే విధంగా కొత్త పథకాన్ని ఆలోచిస్తున్నాం.

 

స్వయం అవమానం:

టీచర్స్‌ డేను బహిష్కరించాలన్న సంఘం నాయకులను చూస్తే జాలి వేస్తోంది. ఇవాళ వారిని వారు గౌరవించుకోవాల్సిన రోజు. నిజం చెప్పాలంటే అందరూ టీచర్లను గౌరవించే రోజున, తమకు తామే అవమానపర్చుకుంటున్నారు. ఇవాళ టీచర్స్‌డేను బహిష్కరిస్తామని కొన్ని ఉద్యోగ సంఘాలు పేర్కొన్నాయి. మరి స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఉత్తమ ఉపా«ధ్యాయ అవార్డులు కూడా తీసుకున్నారు కదా.

 

తరగతుల విలీనం మాత్రమే:

చంద్రబాబు అర్ధం లేని విమర్శలు చేస్తున్నారు. మేము ఎక్కడా స్కూళ్లు మూసివేయలేదు. 5600 స్కూళ్లలో తరగతి గదులను విలీనం చేశాం. స్కూళ్లు విలీనం కాదు. ఎందుకంటే మూడవ తరగతి నుంచే విద్యార్థులకు అత్యుత్తమ విద్యను అందించే విధంగా సబ్జెక్టుల వారీగా టీచర్లు ఉండేలా ఆ నిర్ణయం. ఇది విద్యార్థులకు ఎంతో మేలు చేస్తోంది. చంద్రబాబు ఆరోపిస్తున్నట్లు స్కూళ్లు మూసి వేయడం లేదు. విద్యార్థులను ఇబ్బంది పెట్టడం లేదు. ప్రభుత్వం ఏది చేసినా విమర్శించడమే ఆయన పని.

 

మూడేళ్లలో రూ.53 వేల కోట్లు:

ఈ మూడేళ్లలో ఒక్క విద్యా రంగంపైనే ప్రభుత్వం దాదాపు రూ.53 వేల కోట్లు వ్యయం చేసింది. ఇలా గతంలో ఏ ప్రభుత్వమూ ఖర్చు చేయలేదు. నిజానికి ఇది సంక్షేమ పథకం కాదు. గతంలో అమ్మ ఒడి వంటి పథకం ఏనాడైనా చూశామా? పథకం ప్రారంభించిన తర్వాత స్కూళ్లలో విద్యార్థులు సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. మధ్యలో స్కూళ్లు మానేసే విద్యార్థుల సంఖ్య చాలా తగ్గుతోంది. విద్యా కానుక కింద పిల్లలకు పుస్తకాలు, నోట్‌బుక్స్, షూస్, సాక్సులు, యూనిఫామ్స్‌ ఇస్తున్నాం.

గోరుముద్ద కింద రోజూ ఒక మెనూతో పౌష్టికాహారం పెడుతున్నాం.

ప్రతి మండలంలో రెండు జూనియర్‌ కాలేజీలు. అందులో ఒకటి బాలికల కళాశాల. అలా ప్రతి దాంట్లో విద్యార్థులకు మేలు చేసే పనులు.

 

ఎందుకంటే..:

ఒక ఇంట్లో ఒక పిల్లవాడు బాగా చదువుకుంటే, ఉన్నతస్థాయికి ఎదిగితే, ఆ కుటుంబ ఆర్థికస్థితి మారుతుంది. వారంతా ఎదుగుతారు.

దాన్ని గట్టిగా నమ్మాం కాబట్టే, విద్యా రంగంలో ఇన్ని సంస్కరణలు తీసుకొచ్చాం.

చంద్రబాబు ఏనాడైనా ఇలా ఆలోచించాడా? ఇన్ని పనులు చేశాడా? ఎంతసేపూ ప్రభుత్వ స్కూళ్లు మూసివేయడం. నారాయణ, చైతన్య వంటి కార్పొరేట్‌ స్కూళ్లను ప్రోత్సహించడం తప్ప. ఇవాళ మేము ఏ కార్పొరేట్‌ స్కూల్‌ను మూసి వేయలేదే? ప్రభుత్వ స్కూళ్లను ఆ స్థాయిలో అభివృద్ధి చేసి, వారికి పోటీగా తయారు చేస్తున్నాం.

విద్య, వైద్యం.. రెండు కళ్ల వంటివి. అందులో భాగంగానే ఇవన్నీ. ఆ దిశలోనే ప్రభుత్వం ఒక ధృఢ సంకల్పంతో ముందుకు వెళ్తోంది.

 

యాప్‌తో ఇబ్బంది లేదు:

యాప్‌లో ఫేస్‌ రికగ్నిషన్‌పై తొలుత టీచర్లతో మాట్లాడాం. వారికి తగిన సమయం కూడా ఇచ్చాం. ఏమైనా సమస్యలు వస్తే, పరిష్కరిస్తామని కూడా చెప్పాం. అందుకు వారు కూడా అంగీకరించారు. అదే విధంగా సూపర్‌విజన్‌ కోసం తగిన సిబ్బంది లేకపోవడంతో, వాటి భర్తీపైనా దృష్టి పెట్టాం. దీనిపైనా ఉపాధ్యాయులకు చెప్పాం. ఇక సమస్య ఎక్కడుంది?

నాకు తెలిసి, ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా ఎలాంటి సమస్యలు లేవు. అందరితో మాట్లాడాం. అన్నింటిపైనా చర్చించాం. పదోన్నతులపైనా మాట్లాడాం. ఆ ప్రక్రియ ఇప్పటికే మొదలైంది.. అని మంత్రి శ్రీ బొత్స సత్యనారాయణ వివరించారు.

 

Back to Top