విశాఖ: పవన్ కళ్యాణ్ మొదట అన్యాయం చేసింది ఉత్తరాంధ్రకేనని.. విశాఖకు చెందిన కాపు బిడ్డను పెళ్లి చేసుకుని మోసం చేశారని మంత్రి అమర్‌నాథ్ పేర్కొన్నారు. బీజేపీతో సంసారం, చంద్రబాబుతో సహజీవనం చేస్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ అంటూ ఆయన విమర్శలు గుప్పించారు. విధానం అంటూ లేని పార్టీ జనసేన అంటూ మంత్రి విమర్శించారు. వారాహి యాత్ర ఎందు కోసమో ప్రజలకు చెప్పాలన్నారు. వాలంటీర్లకు పవన్ క్షమాపణ చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. వారాహి యాత్రకు వస్తున్న పవన్ కళ్యాణ్‌పై మంత్రి అమర్నాథ్ ప్రశ్నల వర్షం కురిపించారు. వారాహి వెబ్ సిరీస్ 3 అంటూ వ్యాఖ్యానించారు. ఉత్తరాంధ్రలో అక్రమాలు అన్యాయాలపై ప్రశ్నిస్తానంటున్న ప్యాకేజ్ స్టార్ తాను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు . పవన్‌కు పది ప్రశ్నల పేరుతో మంత్రి అమర్‌నాథ్ బహిరంగ లేఖ విడుదల చేశారు.
ఉత్తరాంధ్ర ప్రజల తరఫున ప్యాకేజీ స్టార్ కు 10 ప్రశ్నలుః
1- వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధే లక్ష్యంగా... విశాఖను పరిపాలనా రాజధానిగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ప్రకటిస్తే.. స్వాగతించకపోగా, వ్యతిరేకించిన నీకు ఉత్తరాంధ్రలో అడుగు పెట్టే అర్హత ఉందా..?
2- విశాఖ, ఉత్తరాంధ్ర.. ఈ అంశాల మీద బాబు స్టాండే జనసేన స్టాండ్. బాబు తానా అంటే నీవు తందానా అంటున్నావ్.. నీకు వ్యక్తిత్వం ఉందా..?
3- కేంద్రంలోని బీజేపీతో పొత్తులో ఉన్న నీవు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు ఎందుకు ప్రయత్నం చేయలేదు?. పైగా ఈ నెపాన్ని రాష్ట్ర ప్రభుత్వం మీద ఎందుకు నెడుతున్నావు?
4- విశాఖలో పేదలకు ఇళ్ళ పట్టాలు ఇస్తుంటే.. కోర్టులో కేసులు వేయించి చంద్రబాబు అడ్డుకున్నప్పుడు బాబుకు తానా తందానగా మారి, పేదల వ్యతిరేక పెత్తందార్ల జాబితాలో ఎందుకు చేరావు?
5- 2014-19 మధ్య 40 గుడులు కూలగొట్టిన మీ జాయింట్ ప్రభుత్వానికి దేవుడు మీద నమ్మకం, మతం అంటే భయం- భక్తి ఏ కోశాన లేవు కదా..?
6- పోలవరం ప్రాజెక్టును 2014 నుంచి 2017 వరకు చంద్రబాబు తన కమీషన్ల కోసం ముందుకు కదలకుండా ఆపితే, అదే బాబుకు ఎందుకు వంత పాడావు?
7- ప్రత్యేక హోదా వద్దు.. ప్యాకేజీ ముద్దు అని మీ పార్టనర్ చంద్రబాబు, మీ ఉమ్మడి పాలనలో కేంద్రానికి మోకరిల్లినప్పుడు నీవు ఎందుకు ప్రశ్నించలేకపోయావ్?. ఇంతకీ పాచిపోయిన లడ్లు.. ఇప్పటికింకా పాచిపోయాయా.. ? లేక పనసతొనలుగా మారిపోయాయా?
8- ఉద్దానంలో కిడ్నీ జబ్బులతో జనం పిట్టల్లా చనిపోతున్నా.. కిడ్నీ బాధితులకు శాశ్వత పరిష్కారం చూపాలని జగన్ గారి ప్రభుత్వం నెలకొల్పిన, డయాలసిస్, రీసెర్చ్ సెంటర్, రక్షిత తాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని ఏనాడైనా సంస్కారవంతంగా అభినందించావా.. ?
9- సంక్షేమ విప్లవంలో భాగంగా జగన్ మోహన్ రెడ్డిగారు అమలు చేస్తున్న నవరత్నాల పథకాలను, ప్రభుత్వ సేవలను ప్రతి గడపకు అందిస్తున్న వాలంటీర్లను- హ్యూమన్ ట్రాఫికర్లు అంటూ అవమానించిన నీవు క్షమాపణలు చెప్పాలి.
10- చివరిగా, ప్రాజెక్టులపై యుద్ధ భేరి పేరుతో చంద్రబాబు రాష్ట్రంలో ప్రాంతాల మధ్య విద్వేషాలు సృష్టిస్తూ, టీడీపీ శ్రేణులను అల్లర్లకు ఉసిగొల్పుతూ, దాడులు చేయిస్తూ, ప్రజలపై దండయాత్ర చేస్తూ, పుంగనూరులో 40 మంది పోలీసులపై దాడి చేస్తే, అందులో ఒక కానిస్టేబుల్ కన్ను పోతే.. ఖండించని నీది ఒక రాజకీయ పార్టీనా..? ఆ పార్టీకి నీవొక అధ్యక్షుడివా..?