బాబు మాటలు, ఎల్లోమీడియా రాతలు ప్రజలెవరూ నమ్మరు

చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రావడం కలే..

ఎన్టీఆర్‌కు మళ్లే ప్రజలకూ వెన్నుపోటు పొడవాలని చంద్రబాబు కుట్ర

రాష్ట్రంలోని పేదలంతా బాగుండాలనేది సీఎం వైయస్‌ జగన్‌ ఆలోచన

లక్షల కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా పేదలకు అందించారు

సంక్షేమ పథకాల అమలును అడ్డుకోవాలనేది టీడీపీ, ఎల్లోమీడియా కుట్ర

పేదలకు మంచి జరుగుతుంటే బాబు అండ్‌ కో ఓర్వలేకపోతున్నారు

మంత్రివర్గంలో సామాజిక న్యాయం చంద్రబాబు చేయగలిగాడా..? 

పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ ధ్వజం

తాడేపల్లి: ఎల్లో మీడియా తప్పుడు రాతలు, చంద్రబాబు అబద్ధపు మాటలతో ప్రజలు తప్పుదోవపట్టించాలని చూస్తున్నారు. ఎలాగైనా చంద్రబాబును మళ్లీ అధికారంలోకి తీసుకురావాలని రామోజీరావు, రాధాకృష్ణ, టీవీ5 నాయుడు తపన పడుతున్నారు. అది జరగని పని అని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ అన్నారు.  మిగిలిన ఉన్న శేష జీవితాన్ని పేదల ప్రజల కోసం ఆలోచన చేయాలని, పేదల బాగుకోసం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న వైయస్‌ జగన్‌ ప్రభుత్వాన్ని పొగడకపోయినా పర్వాలేదు.. కనీసం విమర్శించే కార్యక్రమానైనా మానుకోవాలని సూచించారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణాల్లోని పేదలు.. పేదలుగానే మిగిలిపోవాలి.. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ఆపేయాలనే విధంగా టీడీపీ, ఎల్లో మీడియా ప్రవర్తిస్తోందని మండిపడ్డారు. చంద్రబాబు మాయమాటలు, ఎల్లో మీడియా తప్పుడు రాతలను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని స్పష్టం చేశారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ విలేకరుల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి అమర్‌నాథ్‌ ఇంకా ఏం మాట్లాడారంటే..

రాష్ట్రంలో వైయస్‌ఆర్‌ సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం మేనిఫెస్టోలోని హామీలను ఒక్కొక్కటిగా సీఎం వైయస్‌ జగన్‌ అమలు చేసుకుంటూ వచ్చారు. మూడేళ్లలో దాదాపు 95 శాతానికి పైగా హామీలు అమలు చేశారు. వాటిల్లో ప్రధానమైన అమ్మ ఒడి పథకం దాదాపు 44 లక్షల మంది తల్లులు, 84 లక్షల మంది పిల్లలకు సంబంధించిన పథకం. ఇప్పటికే దాదాపు రూ.13 వేల కోట్లు ఖర్చు చేసిన పథకం ఆపేయాలనేది చంద్రబాబు, ఎల్లో మీడియా ఉద్దేశంగా కనిపిస్తుంది. 

వైయస్‌ఆర్‌ రైతు భరోసా ద్వారా దాదాపు 52 లక్షల మంది కుటుంబాలకు ఇప్పటికే రూ.20 వేల కోట్లు ప్రభుత్వం ఖర్చు చేశాం. రాష్ట్రంలోని ఏ రైతుకు మేలు జరగకూడదనే అభిప్రాయాన్ని టీడీపీ వారి అనుకూల పత్రికలో వ్యక్తం చేసింది. వైయస్‌ఆర్‌ చేయూత ద్వారా దాదాపు 25 లక్షల కుటుంబాలకు రూ.9 వేలు కోట్లు అందించాం. దాన్ని ఆపేయాలనేది చంద్రబాబు ఆయన అనుకూల మీడియా ఉద్దేశం. వైయస్‌ఆర్‌ ఆసరా ద్వారా దాదాపు కోటి మంది మహిళలకు రూ.13 వేల కోట్లు ఖర్చు చేశాం. దేశ చరిత్రలో ఎన్నడూ లేని 31 లక్షల పేద కుటుంబాలకు సొంతింటి కలను నెరవేర్చిన ప్రభుత్వం దేశ చరిత్రలో వైయస్‌ జగన్‌ ప్రభుత్వం. ఇప్పటికే దాదాపు 25 వేల కోట్లు ఖర్చు చేశాం. రానున్న కాలంలో మొదటి విడతలో 15 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టాం. ఇళ్ల నిర్మాణం పూర్తయ్యే సరికి 31 లక్షల కుటుంబాలకు రూ. 2 – 3 లక్షల కోట్లు ఆస్తిగా ఇచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంది. 

ఎస్సీ, ఎస్టీలకు ఫ్రీ కరెంటు అందిస్తున్నాం. ఎస్టీ, ఎస్సీలకు మేలు జరగకూడదనేది వారి ఉద్దేశం. వ్యవసాయానికి 18 లక్షల పంపు సెట్లకు ఉచిత కరెంటు అందిస్తున్నాం. దాన్ని కూడా అడ్డుకోవాలనేది వారి అభిప్రాయం. విద్యా దీవెన కింద 21 లక్షల విద్యార్థులకు రూ.7 వేల కోట్ల లబ్ధి చేకూర్చాం. వసతి దీవెన ద్వారా దాదాపు 3 వేల కోట్లు ఖర్చు చేసి 19 లక్షల విద్యార్థులకు మేలు చేశాం. జగనన్న గోరుముద్ద ద్వారా 44 లక్షల మంది విద్యార్థులకు పౌష్టికాహారం అందించేందుకు ఇప్పటికే 2650 కోట్లు ఖర్చు చేశాం. 

నాడు–నేడు కింద మొదటి విడతగా 15 వేల స్కూళ్లను అభివృద్ధి చేశారు. దాదాపు 7 లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్‌ నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. ప్రభుత్వ ఆస్పత్రులను ఆధునీకరిస్తున్నాం. పెన్షన్‌ రూ.2500 అందిస్తున్నాం. పెన్షన్ల కోసం నెలకు రూ.1500 కోట్లు ఖర్చు చేస్తున్నాం. కేవలం పెన్షన్ల కోసం ఈ మూడు సంవత్సరాల్లో రూ.49 వేల కోట్లు ఖర్చు చేశారు. ఇవన్నీ ఆపేయాలా.. పేదలకు మేలు, మంచి జరగకూడదా.. వైయస్‌ఆర్‌ నేతన్న నేస్తం కింద రూ.577 కోట్లు 82 వేల కుటుంబాలకు అందించాం. కాపు నేస్తం ద్వారా దాదాపు మూడున్నర లక్షల కుటుంబాలకు రూ.వెయ్యి కోట్లు మేర లబ్ధి చేకూర్చాం. ఈబీసీ, చేదోడు, వాహన మిత్ర ద్వారా వందల కోట్లు ఖర్చు చేసి లబ్ధి చేకూర్చాం. ఆరోగ్యశ్రీలో 2500 రోగాలకు చికిత్స అందిస్తున్నాం. రూ.6 వేల కోట్లు ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు వైద్యం అందిస్తున్నాం.  సంపూర్ణ పోషణ పథకం కింద 34 లక్షల కుటుంబాలకు రూ.4900 కోట్లు ఖర్చు పెట్టాం. 

ఇవన్నీ డీబీటీ ద్వారా రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అందించే కార్యక్రమం చేశాం. ఒక్క రూపాయి అవినీతి జరిగిందని ఆరోపించే ప్రయత్నం చేయగలరా అని రాసిన పత్రికలు, ప్రతిపక్ష పార్టీకి సవాల్‌ చేస్తున్నాం. లక్షా 50 వేల కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా పేదలకు అందించాం. ఒక్క రూపాయి కూడా అవినీతి జరగలేదని చెప్పడానికి గర్వపడుతున్నాం. 

ప్రజాజీవితంలో ఉన్న రాజకీయ పార్టీ, నాయకుడు ఈ పథకాలను ఆపేయాలని అనగలరా..? అని ప్రశ్నిస్తున్నాం. టీడీపీ నేతలు మాత్రమే బాగుండాలనేది చంద్రబాబు ఆలోచన.. రాష్ట్రంలోని పేదలంతా బాగుండాలనేది సీఎం వైయస్‌ జగన్‌ ఆలోచన. కనీస మానవత్వం లేకుండా, ఆలోచన లేకుండా టీడీపీ నేతలు ప్రవర్తిస్తున్నారు. వెన్నుపోటుకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉన్న చంద్రబాబు ప్రజలకు వెన్నుపోటుపొడవాలనే ఆలోచన చేస్తున్నాడు. చంద్రబాబు మాటలకు, తప్పుడు రాతలకు నమ్మిమోసపోయే పరిస్థితుల్లో ప్రజలు లేరు. మంత్రివర్గంలో 70 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అవకాశం ఇస్తే అది చూసి తట్టుకోలేకపోతున్నాడు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు 50 శాతానికి మించి పదవులు ఇచ్చాడా..? సామాజిక న్యాయం చంద్రబాబు ఏ రోజు అయినా చేయగలిగాడా..? 

తప్పుడు రాతలు, అబద్ధపు మాటలతో తప్పుదోవపట్టించాలని, చంద్రబాబును మళ్లీ అధికారంలోకి తీసుకురావాలని రామోజీరావు, రాధాకృష్ణ, టీవీ5 తపన పడుతున్నారు. అది వారు బతికుండగా జరగదు. శేషజీవితాన్ని పేదల కోసం ఆలోచన చేసి.. సంక్షేమ పథకాలను అందిస్తున్న వైయస్‌ జగన్‌ ప్రభుత్వాన్ని పొగడకపోయినా పర్వాలేదు.. విమర్శించే కార్యక్రమాన్ని మానుకోవాలని కోరుతున్నాను. 
 

Back to Top