సీఎం సంకల్పం ముందు కుట్రలన్నీ పటాపంచలు

పేదల కోసం సీఎం వైయస్‌ జగన్‌ ఎంతదూరమైనా వెళ్తారు

పేదవాడి సొంతింటి కలను ముఖ్యమంత్రి సాకారం చేశారు

అహంకారంతో పేదల ఇళ్ల స్థలాలను సమాధులు, శ్మశానాలతో పోల్చాడు

చంద్రబాబుకు రాజకీయ సమాధి కట్టే రోజు దగ్గరలోనే ఉంది

బాబుకు మున్సిపల్‌ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ హెచ్చరిక

అమరావతి: రాష్ట్రాన్ని అభివృద్ధివైపు పరుగులు పెట్టిస్తూ, నిరంతరం పేదల సంక్షేమం కోసం పరితపిస్తూ, తనకు ఎదురయ్యే ఆటంకాలను చిరునవ్వుతో అధిగమిస్తూ ప్రగతివైపు ప్రయాణిస్తున్న బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేద ప్రజల పక్షపాతి సీఎం వైయస్‌ జగన్‌ అని మున్సిపల్‌ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. పేదలను పెద్దోళ్లుగా చూడాలన్న సీఎం వైయస్‌ జగన్‌ సంకల్పం ముందు కళ్లు, కుత్రంత్రాలు, కుట్రలు పటాపంచలై, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ రోజు ఇది అన్నారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ చేతుల మీదుగా సుమారు 52 వేల మందికి అమరావతిలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. అమరావతి వెంకటపాలెంలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి ఆదిమూలపు సురేష్‌ పాల్గొని మాట్లాడారు. 

‘‘నేడు సుమారు 52 వేల మందికి అమరావతిలో పట్టాలు అందిస్తున్నాం. వీటితో పాటు రూపాయికే పట్టణ ప్రజలకు ఇళ్లు అందిస్తామని ముఖ్యమంత్రి గతంలో చెప్పారు. నేడు రాజధానిలోని 8 ప్రాంతాల్లో 5 వేల టిడ్కో ఇళ్లను సీఎం చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేస్తున్నాం. వైయస్‌ జగన్‌ ప్రభుత్వం పేదలందరికీ నిర్మించి ఇచ్చేది ఇళ్లు కాదు.. ఊర్లే నిర్మించి ఇస్తుంది.  

అమరావతిలో పేదలకు స్థలాలు ఇవ్వకూడదని, ముఖ్యమంత్రి తలపెట్టిన మహాయజ్ఞాన్ని భగ్నం చేయాలని చంద్రబాబు కుట్రలు చేశారు. చంద్రబాబుకు తెలిసిందల్లా ఒక్కటే కోట్లు ఖర్చు చేసి కోర్టుల చుట్టూ తిరిగి స్టే తెచ్చుకోవడం. కోర్టుల్లో చుక్కెదురవ్వడం, పేదలకు పట్టాలిచ్చే కార్యక్రమం ముమ్మాటికీ అభివృద్ధిలో భాగమని సుప్రీం కోర్టు ఉత్తర్వులే సీఎం వైయస్‌ జగన్‌ ఆలోచనకు నిదర్శనం. సీఎం వైయస్‌ జగన్‌ ఏదైనా కార్యక్రమం తలపెడితే ఎంత దూరమైనా పోరాటం చేసి పేదలకు అందించగలడనే నమ్మకాన్ని సుప్రీం తీర్పు ద్వారా మరోసారి చూస్తున్నాం. 

బడుగు, బలహీనవర్గాలు, అణగారిన వర్గాలంటే చంద్రబాబుకు పగ. దళితుల గురించి దారుణంగా, హీనంగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఈ రాష్ట్రంలోని దళితులు ఎవ్వరూ మరిచిపోలేదు. ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా, బాబులంతా కలిసినా, బాబుల బాబులంతా కలిసి వచ్చినా జగనన్న ఉక్కు సంకల్పం ముందు ఎవరూ నిలువలేరు. ప్రభుత్వం ఇచ్చే ఇళ్ల స్థలాలను సమాధులతో పోల్చుతూ అవహేళనతో, అహంకారంతో, పెత్తందారి మనస్తత్వంతో చంద్రబాబు మాట్లాడాడు.  కచ్చితంగా రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా దళితులు చంద్రబాబుకు  రాజకీయ సమాధి కట్టే రోజు ఎంతో దూరంలో లేదని’’ మంత్రి ఆదిమూలపు సురేష్‌ హెచ్చరించారు. 
 

Back to Top