మీ బిడ్డకు మీరే సైనికులుగా కదలండి

మూల‌పేట పోర్టు శంకుస్థాన‌న స‌భ‌లో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ పిలుపు

మూలపేట అభివృద్ధికి మూలస్తంభంగా నిలుస్తుంది

భవిష్యత్‌లో మూలపేట, విష్ణుచక్రం గ్రామాలు మరో ముంబై, మద్రాస్‌ కాబోతున్నాయి

మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఫిషింగ్‌ హార్బర్లు నిర్మిస్తున్నాం

మూలపేట పోర్టు పూర్తయితే దాదాపు 35 వేల మందికి ఉపాధి లభిస్తుంది

పోర్టుతో పాటు మరో రెండు ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణం

సెప్టెంబర్‌ నుంచి విశాఖలోనే ఉంటాను

పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా విశాఖలోనే బస

మీ బిడ్డ ఒక్కడే ఒకవైపు..తోడేళ్లు మరోవైపు

అంతా ఏకమై నాతో చీకటి యుద్ధం చేస్తున్నారు

ఈ యుద్ధంలో నా ధైర్యం, నమ్మకం, ఆత్మవిశ్వాసం మీరే

ప్రాంతాల మధ్య వైషమ్యాలు పోవాలనే అన్ని జిల్లాల అభివృద్ధి

ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్నదే తపన

దేవుని దయ..మీ చల్లని ఆశీస్సులే కోరుకున్నా

శ్రీ‌కాకుళం: ప్రాంతాల మధ్య వైషమ్యాలు పోవాలనే అని జిల్లాలను  అభివృద్ధి చేస్తున్నాన‌ని,  ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్నదే త‌న త‌ప‌న అని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే.. మీ బిడ్డకు మీరే తోడుగా నిలవండి. మీ బిడ్డకు మీరే సైనికులుగా కదలండి అంటూ సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ పిలుపునిచ్చారు. మీ బిడ్డ ఒక్కడే ఒకవైపు ఉన్నాడు. అంతా ఏకమై నాతో చీకటి యుద్దం చేస్తున్నారు. ఈ యుద్ధంలో నా ధైర్యం, నమ్మకం, ఆత్మ విశ్వాసం మీరే.. దేవుని దయ.. మీ చల్లని ఆశీస్సులే కోరుకున్నా. తోడేళ్లనీ ఏకమైనా నాకేమీ భయం లేద‌ని సీఎం వైయ‌స్ జగన్‌ అన్నారు. ఈ సెప్టెంబర్‌ నుంచి విశాఖలోనే ఉంటానని సీఎం వెల్లడించారు. రాష్ట్రంలో అందరికీ ఆమోదయోగ్య నగరం విశాఖ అని సీఎం చెప్పారు.  రాష్ట్రంలో పెత్తందార్లు, పేదల పక్షాన నిలబడిన నాకు మధ్య యుద్ధం జరుగుతోంది. ఒకే అబద్ధాన్ని పదేపదే చెబుతున్నారు. వాళ్లలా అబద్ధాలు చెప్పే అలవాటు నాకు లేద‌న్నారు. మూలపేట గ్రీన్‌ఫీల్డ్‌ పోర్ట్‌ నిర్మాణం, నౌపడ వద్ద పోర్టు నిర్వాసిత కాలనీకి సీఎంవైయ‌స్  జగన్‌ శంకుస్థాపన చేశారు. ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెం ఫిషింగ్‌ హార్బర్‌ సహా హిర మండలం వంశధార లిప్ట్‌ లిరిగేషన్‌ ప్రాజెక్టులకు సీఎం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా  ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌ మాట్లాడారు.

 

ఈ సందర్భంగా సీఎం వైయస్‌.జగన్‌ ఏమన్నారంటే...

చిక్కటి చిరునవ్వులతో చెరగని ఆప్యాయతలతో మీ బిడ్డకు తోడుగా నిలబడుతూ ప్రేమానురాగాల‌ను పంచిపెడుతున్న ప్రతి అక్కకూ, చెల్లెమ్మకూ, ప్రతి అవ్వాతాతలకు, ప్రతిసోదరుడికి, స్నేహితుడికి హృదయపూర్వక కృతజ్ఞతలు.

శ్రీకాకుళం ముఖచిత్రాన్ని మార్చేలా –నాలుగు మంచి కార్యక్రమాలకు శ్రీకారం
దేవుడి దయ, మీ అందరి చల్లని ఆశీస్సులతో ఇవాళ నాలుగు మంచి కార్యక్రమాలు జరుపుకుంటున్నాం. మూలపేట పోర్టుకు శంకుస్ధాపన చేసుకున్నాం. రెండు బుడగట్లపాలెం ఫిషింగ్‌ హార్బర్‌కు, మూడోది గొట్టా బ్యారేజీ నుంచి హిరమండలం రిజర్వాయరుకు నీటిని తీసుకెళ్లే లిఫ్ట్‌ స్కీంకు, నాలుగోది మహేంద్ర తనయ పనులు ముందుకు తీసుకెళ్లే పనులకూ ఇవాళ శ్రీకారం చుట్టాం. ఈ నాలుగు కార్యక్రమాలు రాబోయే రోజుల్లో శ్రీకాకుళం ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చబోతున్నాయి. 

193 కిలోమీటర్ల తీరప్రాంతమున్నా...
పోర్టు, ఫిషింగ్‌ హార్బర్‌ గురించి మాట్లాడేముందు కొన్ని విషయాలు మీ అందరితో పంచుకోవాలి. మీరందరూ గమనించాలి. మన రాష్ట్రానికి 974 కిలోమీటర్ల సముద్రతీరం ఉంటే ఒక్క శ్రీకాకులం జిల్లాలోనే ఏకంగా 193 కిలోమీటర్ల సముద్రతీరం ఉంది. ఇంత విస్తారమైన సముద్రతీరం మన జిల్లాలో మనకు ఉన్నా కూడా ఈ జిల్లాలో ఒక పోర్టు కానీ, ఒక ఫిషింగ్‌ హార్బర్‌ కానీ లేదా కనీసం ఒక ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్‌ కానీ వస్తే.. జిల్లా ముఖచిత్రం మారుతుందని, జిల్లా మారిపోయి చెన్నై నగరం మాదిరిగానో, ముంబాయి నగరం మాదిరిగానో అభివృద్ధి బాటన పడుతుందని తెలిసి ఉన్నా కూడా దశాబ్దాలుగా ఎవ్వరూ ఈ దిశగా అడుగులు వేయలేదు. చిత్తశుద్ధి చూపిన పరిస్థితి ఎక్కడా కనిపించలేదు.
అటువంటి ఈ జిల్లా ముఖచిత్రాన్ని మార్చాలన్న తపన, తాపత్రయపడుతూ... మన పిల్లలకు ఇక్కడే ఉద్యోగాలు వచ్చే పరిస్థితులు రావాలని, మన జిల్లా ఏదోఒకరోజు ఒక మహానగరంగా మారాలని అడుగులు ముందుకు వేసి ఇటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. 

అభివృద్దికి మూలస్ధంబాలు....
ఈరోజు శంకుస్ధాపన చేసిన బావనపాడుకు సమీపంలో ఉన్న మూలపేట గ్రామం ఇక మూలనున్న ఒక పేట కాదు, ఇకపై అభివృద్ధికి మూలస్ధంబంగా నిలుస్తుంది. మూలపేట, విష్ణుచక్రం గ్రామాలు రాబోయే రోజుల్లో, రానున్న తరాలకు మద్రాసో, ముంబాయో కానున్నాయి. 

రూ.4362 కోట్లతో పోర్టు నిర్మాణం... 
మూలపేటలో మనం ఏకంగా 24 మిలియన్‌ టన్నుల సామర్ధ్యంతో, నాలుగు బెర్తులతో పోర్టు నిర్మించబోతున్నాం. పోర్టు నిర్మాణం ఈ రోజు నుంచి 24 నెలల్లో పూర్తవుతుంది. పోర్టు నిర్మాణానికి దాదాపుగా రూ.2950 కోట్లు ఖర్చు చేస్తున్నాం. రాబోయే దశాబ్దాలలో ఇక్కడ  ట్రాఫిక్‌ పెరిగి ఈ పోర్టు సామర్ధ్యం వంద మిలియన్‌ టన్నులకు చేరే రోజు అతి సమీపంలో ఉంది. ప్రధాన పోర్టుకు అయ్యే ఖర్చుతో పాటు దీన్ని ప్రధాన రహదారులతోనూ అనుసంధానం చేయడం.. రైల్వే మార్గంతోనూ అనుసంధానం చేసేందుకు 11 కిలోమీటర్లు రైలు మార్గం, 14 కిలోమీటర్ల రోడ్డు మార్గం కూడా నిర్మిస్తున్నాం. అంతేకాకుండా 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న గొట్టా బ్యారేజీ నుంచి ఒక పైప్‌ లైన్‌ వేసి 0.5 ఎంఎల్‌డీ కెపాసిటీతో నీటి సరఫరా ఏర్పాటు చేసేందుకు శ్రీకారం చుడుతున్నాం. ఈ మౌలిక వసతులను, ఆర్‌ అండ్‌ ఆర్‌ను కలుపుకుంటే ఈ పోర్టు నిర్మాణానికి మనందరి ప్రభుత్వం చేయబోతున్న ఖర్చు సొమ్ము రూ.4362 కోట్లు. 

1250 ఎకరాల విస్తీర్ణంలో పోర్టుకు అడుగులు ముందుకు పడుతున్నాయి. విశాఖ నుంచి 170 కిలోమీటర్ల దూరంలోనూ, చెన్నై – కోల్‌కత్తా నేషనల్‌ హైవే – 16కు కేవలం 14 కిలోమీటర్ల దూరంలోనూ, రైల్వే లైనుకు కేవలం 11 కిలోమీటర్ల దూరంలోఉన్న ఈపోర్టు రాబోయే రోజుల్లో శ్రీకాకుళం జిల్లా ముఖచిత్రాన్ని మార్చబోతుంది.

మరో 24 నెలల్లో పోర్టు – 35 వేల మందికి ఉద్యోగాలు.
మరో 24 నెలల్లో ఈ పోర్టు పూర్తయితే దీనివలన ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ ఇక్కడే 35వేలమందికి మన పిల్లలకు ఉద్యోగఅవకాశాలు లభిస్తాయి. అంతేకాదు ఇక్కడ పోర్ట్‌ వస్తే... పోర్ట్‌ ఆధారిత పరిశ్రమలు కూడా వస్తాయి. అనుబంధ పరిశ్రమలు ఎప్పుడైతే ఇక్కడికి వస్తాయో అప్పుడు లక్షలలో మన పిల్లలకు ఉద్యోగాఅవకాశాలు వస్తాయి. 
పోర్టు ఉన్న నగరాలు ముంబాయి తీసుకున్నా, చెన్నై తీసుకున్న ఇంకా విశాఖపట్నం తీసుకున్నా ఇవన్నీ మహానగరాలు అయ్యాయి. లక్షల్లో మన పిల్లలకు ఇక్కడే మన జిల్లాలోనే ఉద్యోగాలు వచ్చే కార్యక్రమం జరుగుతుంది. 

గంగ పుత్రుల కళ్లల్లో కాంతులు నింపాలని...
హార్భర్ల నిర్మాణ విషయానికి వస్తే గంగపుత్రుల కళ్లల్లో మరింత కాంతులు నింపడానికి, మత్స్య కార సోదరులకు మరింత అండగా ఉండేందుకు, కడలినిని నమ్ముకున్న  వారి కష్టాలను తీర్చేందుకు ఫిషింగ్‌ హార్బర్లు నిర్మాణం చేపట్టాం. ఈ నేలతల్లిమీద ప్రేమ ఉన్నా కూడా ఇక్కడ పుట్టిన వారు మరే మార్గంలేక ఎక్కడా ఉద్యోగ అవకాశాలు లేక వేరే ప్రాంతాలకు వేరే రాష్ట్రాలకు వలసపోవడాన్ని చూస్తున్నాం. వీటన్నింటికీ కూడా చెక్‌ పెట్టేందుకు, అరికట్టేందుకు ఇక్కడే ఈ జిల్లాలోనే ఈ మూలపేట పోర్టుతో పాటు మరో రెండు ఫిషింగ్‌ హార్భర్లు కూడా నిర్మిస్తున్నాం.

రెండు ఫిషింగ్‌ హార్బర్లు...
రూ.365 కోట్లతో బుడగట్ల పాలెం ఫిషింగ్‌ హార్బరు నిర్మాణానికి కూడా ఈ రోజు శంకుస్ధాపన చేశాం. మంచినీళ్లపేటలో రూ.12 కోట్ల రూపాయలతో సెప్టెంబరు 2019లో నిర్మాణం చేపట్టిన ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్‌కు అదనంగా మరో రూ.85 కోట్లతో.. దానిని ఫిషింగ్‌ హార్బర్‌గా అప్‌గ్రేడ్‌ చేస్తున్నాం. ఇవన్నీ కూడా మత్స్యకార సోదరులకు మంచి జరగాలని తపన, తాపత్రయంతో చేస్తున్నాం. మత్స్య కార సోదరుల అవసరాల మేరకు ఫిషింగ్‌ హార్బర్లు మరోవైపున మన రాష్ట్ర అభివృద్ధి కొరకు, మన పిల్లల అభివృద్ధి కొరకు పోర్టుల నిర్మాణం కూడా చేయగలిగితే మన ఆర్ధికవ్యవస్ధకు, మన మత్స్య కార సోదరులకు మంచి జరుగుతుంది. తీర ప్రాంతలో వీటి వల్ల రాబోయే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, ఎగుమతులు, దిగుమతులు ద్వారా ఈప్రాంతం మొత్తం మహానగరంగా తీర్చిదిద్దే పరిస్థితులు వస్తాయి. ఇలా అనేక మంచి మార్పులు తీసుకురావచ్చని గట్టిగా నమ్మాం.

75 ఏళ్లలో కేవలం 4– మన 46 నెలల పాలనలో మరో 4  పోర్టులు...
ఈ రాష్ట్రంలో మనం అధికారంలోకి రాకముందు.. స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయినా కూడా ఈ రాష్ట్రం మొత్తం మీద నాలుగు లొకేషన్లలో 6 పోర్టులు మాత్రమే ఉంటే.. మీ బిడ్డ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 46 నెలల కాలంలో మరో 4 పోర్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టాం.

10 ఫిషింగ్‌ హార్భర్ల నిర్మాణం...
నాలుగేళ్ల కాలంలో 10 ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. పనులు వేగంగా జరుగుతున్నాయి. మరో 3 ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్ల పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. ఇవి కాకుండా మరో ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్‌కు కూడా అప్రూవల్‌ తీసుకున్నాం.  రాబోయే రోజుల్లో వాటిని కూడా వేగవంతంగా నిర్మాణంలోకి తీసుకువస్తాం.

ఒక్కసారి ఆలోచన చేయండి.
గమనించండి. ఇప్పటివరకు తీరప్రాంతంలో ఇలాంటి అభివృద్ది ఎందుకు జరగలేదో అన్నది ఒక్కసారి ఆలోచన చేయండి. మీ బిడ్డ ప్రభుత్వానికి ముందు గతంలో కూడా ముఖ్యమంతి ఉన్నారు. గత ఐదు సంవత్సరాలు మనం చూశాం. ఎందుకు వాళ్ల హయాంలో ఈ మాదిరిగా తీరప్రాంత అభివృద్ధికి సంబంధించిన అడుగులు ఎందుకు పడలేదో ఆలోచన చేయండి.

పొట్ట చేత పట్టుకుని వలస పోరాదనే.. 
ఇన్ని పోర్టులు, ఫిషింగ్‌ హార్బర్లు, ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్లు వీటన్నింటి ద్వారా కూడా డీప్‌ సీలోకి వెళ్లి అక్కడ సముద్రంలో ఉత్పత్తి అయ్యే చేపలును మనదగ్గరకు తీసుకొచ్చే కార్యక్రమం జరిగితే.. గుజరాత్‌కో మరో ప్రాంతానికో పొట్ట చేతపట్టుకుని 
వలస వెళ్లే అవసరం లేకుండా.. మనవాళ్లందరికీ కూడా ఇక్కడే ఉద్యోగ అవకాశాలు లభించాలని, గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఈ రోజు అడుగులు పడుతున్నాయి. 

ఒకవైపు అభివృద్ధి బాటలో రాబోయే తరాలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తూనే మరోవైపు రైతన్నలకు మేలు చేసేందుకు ఈ రోజు మరో రెండు కార్యక్రమాలకు అడుగులు వేగంగా పడుతున్నాయి.
జిల్లాలో వంశధార, నాగావళి రెండు నదులు ఉన్నాయి. గత పాలకుల నిర్లక్ష్యం వలన జిల్లాలో ఇప్పటికీ కూడా పూర్తిగా సశ్యశ్యామలం కాని పరిస్థితి ఉంది. జ్ఞాపకం తెచ్చుకోమని అడుగుతున్నాను. అప్పట్లో దివంగత నేత, నాన్నగారు వైయస్సార్‌ గారి హయంలో వంశధార ఫేజ్‌ 2, స్టేజ్‌ 2 కు 33 కిలోమీటర్ల కాలువలు తవ్వుతూ హిరమండలం రిజర్వాయరును 19 టీఎంసీల కెపాసిటీతో ఈ పనులకు కూడా రాజశేఖర్‌గారు అడుగులు వేగంగా వేయించారు. ప్రియతమ నేత రాజశేఖర్‌రెడ్డిగారు మన నుంచి వెళ్లిపోయిన తర్వాత ఆ అడుగులు ఎక్కడికీ కదలని పరిస్థితి.

మన 46 నెలల పాలనలో...
ఆ తర్వాత మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాత 46 నెలల కాలంలో ఈ బృహత్తర కార్యక్రమాన్ని ఒకవైపు పూర్తి చేస్తూ మరోవైపు కట్టాల్సిన నేరడి బ్యారేజ్‌ పూర్తయితే తప్ప హిరమండలం రిజర్వాయరులో 19 టీఎంసీల నీటి కెపాసిటీ పెట్టడం సాధ్యం కాదు కాబట్టి.. ఆ నేరడి బ్యారేజ్‌ కట్టడం కోసం మీ బిడ్డ, గతంలో ఏ ముఖ్యమంత్రి చూపని చొరవ చూపించారు. ఒడిషాకు వెళ్లి అక్కడి ముఖ్యమంత్రిని కలిసి నేరడి బ్యారేజ్‌ గురించి ప్రస్తావించాడు.

రూ.176 కోట్లతో లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీం...
 నేరడిబ్యారేజ్‌ పరిస్ధితులు ఒకవైపు అలానే ఉన్నా... మధ్యేమార్గంలో మన రైతన్నలకు మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ మంచి జరగాలన్న ఉద్దేశ్యంతో ఏకంగా అదే 19 టీఎంసీల నీటిని తీసుకువెళ్లేందుకు రూ.176 కోట్లతో గొట్ట బ్యారేజ్‌పైన లిఫ్ట్‌ఇరిగేషన్‌ స్కీంను కూడా తీసుకొచ్చి హిరమండలం రిజర్వాయరును నింపే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం.
దీనివల్ల ఆయుకట్టు మొత్తం స్ధిరీకరించడంతో పాటు శ్రీకాకుళం జిల్లాలో కోస్తా ప్రాంతంలో మాదిరిగా రెండో పంటకు నీళ్లు వచ్చే కార్యక్రమం జరుగుతుంది. మరోవైపు వంశధార, నాగావళి నదుల అనుసంధానం కూడా ఆగష్టులోనే పూర్తి చేసి దానికి కూడా జాతికి అంకితం చేస్తాను. అలాగే ఆ మహానేత, దివంగత నేత రాజశేఖర్‌రెడ్డిగారుమొదలుపెట్టిన మహేంద్రతనయ ఆఫ్‌షోర్‌ రిజర్వాయరు పనులు కూడా పూర్తి చేసేందుకు మూడు నియోజకవర్గాల రూపురేఖలను మార్చేందుకు మరో రూ.400 కోట్లు ఖర్చయ్యే పనులకు ఇవాళ శ్రీకారం చుట్టాం. 

ఇక్కడే మరికొన్ని విషయాలు కూడా మీ అందరితో పంచుకోవాలి. ఈ ప్రాంతంలో అంతా చాలామంది ముఖ్యమంత్రులను, నాయకులను చూశాం. కిడ్నీ సమస్యలు మన కళ్లముందే కనిపిస్తున్నాయి. కానీ ఏ ఒక్కరైనా కూడా ఈ సమస్యలకు పరిష్కారం చూపాలని చిత్తశుద్ధితో ఎప్పుడైనా అడుగులు వేశారా ?  
మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉద్ధానంలో మొదలుపెట్టిన కిడ్నీ రీసెర్చ్‌ పనులు కూడా పూర్తయ్యాయి. మరలా జూన్‌ మాసంలో వచ్చి ఆ కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్‌ను ప్రారంభిస్తాను.

కిడ్నీ వ్యాధులకు శాశ్వత పరిష్కారం దిశగా...
కిడ్నీ సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరికితే తప్ప ఈ  కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న పరిస్థితులు పోవు అని... కలుషిత నీరు తాగితే ఇదే పరిస్థితి వస్తుంది తెలిసినా గతంలో ఏ ఒక్కరూ పట్టించుకోకపోయినా మీ బిడ్డ మాత్రం శాశ్వత పరిష్కారం కోసం, సర్ఫేస్‌ వాటర్‌ తీసుకురావాలని నిర్ణయించాడు.  దీనికోసం హిరమండలం నుంచి రూ.700 కోట్లతో సర్ఫేస్‌ వాటర్‌ తీసుకుని వచ్చే బృహత్తర కార్యక్రమానికి నాంది పలికాం. ఈ రూ.700 కోట్లతో తలపెట్టిన ఈ బృహత్తర కార్యక్రమం జూన్‌ మాసంలోనే పూర్తి చేసి జాతికి అంకితం చేస్తున్నాం.

అంతే కాదు ఇచ్చాపురం, పలాస నియోజకవర్గాలకు తాగునీటికి, కిడ్నీ సమస్యను పరిష్కరించేందుకు అడుగులు వేగంగా వేస్తూ చేపట్టిన పనులన్నీ పూర్తి చేసుకుని జూన్‌ నాటికి ప్రారంభోత్సవం చేస్తూనే మరోవైపు అదే రోజున పాతపట్నం నియోజకవర్గంలో మరో రూ.265 కోట్లతో ఇదే నీటి పథకాన్ని విస్తరిస్తూ అక్కడే పునాది రాయి వేసి శంకుస్ధాపన చేస్తాను.

ఉత్తరాంధ్రా అభివృద్ధిపై...
ఉత్తరాంధ్రా జిల్లాల్లోఅభివృద్ధికి సంబంధించిన పరిస్థితులను ఒక్కసారి బేరీజు వేసుకొండి.  ఉత్తరాంధ్రా అభివృద్ధిలో భాగంగానే కురుపాంలో ట్రైబల్‌ ఇంజనీరింగ్‌ కాలేజీ నిర్మాణం వేగంగా సాగుతోంది. పాడేరులో ట్రైబల్‌ మెడికల్‌ కాలేజీ నిర్మాణం కూడా వేగంగా సాగుతోంది.  పార్వతీపురంలో కూడా మెడికల్‌ కాలేజీ పనులు ఇప్పటికే మొదలయ్యాయి. నర్సీపట్నం, విజయనగరంలో మెడికల్‌ కాలేజీ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ 46 నెలల కాలంలోనే మీ బిడ్డ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం రంగంలో 4 కొత్త మెడికల్‌ కాలేజీలు కడుతున్నాం. ట్రైబల్‌ ఇంజనీరింగ్‌ కాలేజీ కడుతున్నాం. సాలూరులో ట్రైబల్‌ యూనివర్సిటీకి కూడా ఈ జూన్‌ మాసంలోనే శంకుస్ధాపన చేసే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడుతాం. ఉత్తరాంధ్ర రూపురేఖలు మార్చాలని చిత్తశుద్దితో అడుగులు పడుతున్నాయి.


మే 3న భోగాపురం విమానాశ్రయ పనులకు శ్రీకారం...
ఈ చిత్తశుద్ధిని చూపిస్తూ మే 3వ తేదీన... భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి శంకుస్ధాపన కూడా చేయబోతున్నాం. అదే మే 3న ఆదానీ డేటా సెంటర్‌కు కూడా శంకుస్ధాపన చేయబోతున్నాం.

భోగాపురంలో విమానాశ్రయమొక్కటే కాకుండా... అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లడానికి వీలుగా రూ.6200 కోట్లతో ఆరులైన్ల రహదారిని నిర్మించబోతున్నాం. ఈ పనులు కూడా మరో నాలుగు నెలల్లో శంకుస్ధాపన చేయబోతున్నాం.
ఇంతగా ఉత్తారంధ్ర అభివృద్ధి మీద ధ్యాస పెట్టిన పరిస్థితులు గతంలో జరిగాయా ? ఆలోచన చేయండి.

అందరికీ ఆమోదయోగ్య నగరం – విశాఖ
వీటన్నింటికి మించి రాష్ట్రంలో అతిపెద్ద నగరం మాత్రమే కాకుండా, రాష్ట్రంలో అందరికీ ఆమోదయోగ్యమైన నగరం విశాఖపట్నం. ఈ రాష్ట్రంలో అందరికీ ఆమోదయోగ్యమైన విశాఖలో పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా ఈ సెప్టెంబరు నుంచి మీ బిడ్డ కాపురం కూడా విశాఖలోనే పెడతాడు.

మొత్తంగా ఉత్తరాంధ్రా అభివృద్ధి మీదనే కాకుండా రాష్ట్రంలో ఏ ప్రాంతం తీసుకున్నా, ఏగ్రామం తీసుక్ను ఇదే మాదిరిగానే అభివృద్ధి కనిపిస్తుంది. గతంలో ఎప్పుడూ చూడని విధంగా కనిపిస్తుంది. స్కూళ్లు మారుతున్నాయి. కొత్తగా మెడికల్‌ కాలేజీలు వస్తున్నాయి. ఉన్న ఆసుపత్రులన్నీ రూపురేఖలు మారుతూ కనిపిస్తున్నాయి. ఏ పేద, మధ్యతరగతి కుటుంబంలో అయినా కూడా మనసా, వాచా, కర్మణా వారికి మంచి చేసేందుకు ప్రభుత్వం తపన పడింది. ప్రతి ఇళ్లు అభివృద్ధి కావాలి, ఇంట్లో ఉన్న నా అక్కచెల్లెమ్మ మొహంలో సంతోషం కనపడాలి. అక్కచెల్లెమ్మలు సంతోషంగా ఉంటే కుటుంబం సంతోషంగా ఉంటుంది. 
ఈ విషయాన్ని మనసా, వాచా నమ్మి 46 నెలల కాలంలోనే రూ.2.08 లక్షల కోట్లు నేరుగా బటన్‌ నొక్కి ఎక్కడా లంచాలు లేకుండా, వివక్ష లేకుండా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి జమ చేశారు. 

మీ బిడ్డ జగన్‌ డీబీటీ బటన్‌ నొక్కటం మాత్రమే కాదు... కులాలు, కుటుంబ చరిత్రలను మార్చాలన్న తపన, తాపత్రయంతో పాటు, ప్రాంతాల చరిత్రను కూడా మార్చాలన్న కమిట్‌మెంట్‌తో పనిచేస్తున్నాడు. ఈ రోజు శ్రీకాకుళం జిల్లా రూపురేఖలు మార్చే కార్యక్రమాలకి శ్రీకారం చుడుతున్నాం.

చరిత్ర మార్చేలా అభివృద్ధి...
ఉత్తారంధ్ర, రాయలసీమ, కోస్తాంధ్ర మనందరి నవరత్నాల పాలనలో ఇంటింటి చరిత్రను, సామాజిక వర్గాల చరిత్రను తిరగరాస్తున్న ప్రభుత్వంగా, ప్రాంతాల చరిత్రలను, పారిశ్రామిక వాణిజ్య చరిత్రలను కూడా మారుస్తున్నాం.
మంచి చేస్తున్నాం కాబట్టే ఈ రోజు ప్రతి ప్రాంతంలో మంచి కనిపిస్తుంది కాబట్టే.. మంచి చేయని వారంతా, ఫలానా మంచి మేం చేశామని చెప్పుకోవడానికి ఏ మాత్రం అర్హత లేనివారంతా కూడా ఏకమవుతున్నారు.

చీకటి యుద్ధం చేస్తున్నారు.
మంచి చేయలేని వారంతా ఏకమవుతున్నారు.
మీ బిడ్డ ఒక్కటే ఒకవైపు ఉన్నాడు. మీ బిడ్డకు వ్యతిరేకంగా ఏ రోజూ ఫలానా మంచి చేసామని చెప్పుకోవాడనికి ఒక్కటంటే, ఒక్కటి లేనివారంతా ఏకమవుతున్నారు. అందరూ ఏకౖమై ఈరోజు చీకటి యుద్ధం చేస్తున్నారు. అలోచన చేయండి. వీరు చేసే చీకటి యుద్ధాన్ని గమనించండి. వీరు ఒకే అబద్ధాన్ని పదే, పదే చెప్పి అదే నిజమని చెప్పి నమ్మించే రాక్షస యుద్ధం రాష్ట్రంలో జరుగుతుంది.

మీ బిడ్డకు ఇలాంటి పత్రికలు లేవు. మీ బిడ్డకు ఇలాంటి టీవీలు లేవు. ఇలాంటి సోషల్‌ మీడియా లేదు. ఈ రోజు పెత్తందార్ల పక్షాన నిలబడ్డ టీడీపీకి, పేదవాడి పక్షాన నిలబడ్డ మీ బిడ్డకు మధ్య యుద్ధం జరుగుతుంది.

వ్యవస్ధలను మేనేజ్‌ చేసుకుని నమ్ముకున్నవారికి, ప్రజలను నమ్ముకుని ప్రజల కోసమే బ్రతుకుతున్నవారికి ( మీ బిడ్డకు) మధ్య యుద్ధం జరుగుతుంది.వారి మాదిరిగా మీ బిడ్డకు ఈనాడు లేదు. ఆంధ్రజ్యోతి లేదు. టీవీ5 లేదు. దత్తపుత్రుడూ లేడు.

నా ధైర్యం మీరే– నా నమ్మకం మీరే...
ఈ యుద్ధంలో నా ధైర్యం మీరు. ఈ యుద్ధంలో నా నమ్మకం మీరు. ఈ యుద్ధంలో నా ఆత్మవిశ్వాసం మీరు. మీ బిడ్డ నమ్ముకున్నది ఒక్క దేవుడి దయ, మీ అందరి చల్లని ఆశీస్సులు మాత్రమే.

తోడేళ్లన్నీ ఏకమవుతున్నాయి....
తోడేళ్లన్నీ ఏకమవుతున్నాయి. కానీ మీ బిడ్డకు భయం లేదు. మీ అందరికీ నేను ఒక్కటే కోరుతున్నాను. ఈ అబద్దాలను నమ్మకండి. వీళ్ల మాదిరిగా అబద్ధాలు చెప్పే అలవాటు మీ బిడ్డకు లేదు. మిమ్నల్ని ఒక్కటే కోరుతున్నాను. మీ ఇంట్లో మంచి జరిగిందా ? లేదా ? అన్నది ఒక్కటే కొలమానంగా తీసుకొండి.

మీకు జరిగిన మంచే కొలమానం....
మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా నిలబడండి. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి.
మీ  బిడ్డకు వీళ్ల మాదిరిగా ఇన్నిన్ని మీడియా ఛానెళ్లు, ఇంతింతమంది నాయకులు, చెడిపోయిన రాజకీయ సామ్రాజ్యం, ఒక దత్తపుత్రుడు వీళ్లంతా కూడా తోడుగా లేరు.
మీ బిడ్డ ఆధారపడేది ఆ దేవుడి దయ, మీ చల్లని ఆశీస్సులు మీద మాత్రమే. ఇవాళ శ్రీకాకుళంలో జరుగుతున్న ఈ మంచి వల్ల ఈ ప్రాంతమంతా బాగుపడాలి, ఈ ప్రాంతానికి ఇంకా మంచి చేసే పరిస్థితి, దేవుడి చల్లని దీవెనలు మీ బిడ్డకు ఈ ప్రభుత్వానికి ఎప్పుడూ ఉండాలి.

టెక్కలి నియోజకవర్గానికి సంబంధించి దువ్వాడ శ్రీనివాసరావు మీ అందరికీ తెలిసిన వ్యక్తి. ఈ నియోజకవర్గంలో ఎప్పుడూ కన్ఫ్యూజన్‌ ఉండకూడదు. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో కన్ఫ్యూజన్‌ఉంటే నష్టం జరుగుతుంది. శ్రీనుని మీ చేతులలో పెడుతున్నాను. శ్రీనుకు తోడుగా ఉండి ఆశీర్వదించండి. 

ఇదే టెక్కలి నియోజకవర్గానికి సంబంధించి శ్రీను సంతబొమ్మాలి మండలంలో 94 గ్రామాలకు మంచి నీటి కొరకు రూ.70 కోట్లు ఖర్చయ్యే సీపీడబ్ల్యూ స్కీం మంజూరు కోసం అడిగారు. ఆ గ్రామాలకు మంచినీటి సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం ముందుకు వస్తుంది. మంచి జరగాలని మనసారా కోరుకుంటున్నాను. ఇంకా ఈ ప్రాంతానికి మంచి చేసే పరిస్థితులు రావాలని మనసారా కోరుకుంటున్నాను అని సీఎం తన ప్రసంగం ముగించారు.

తాజా వీడియోలు

Back to Top