సీపీఐని వీడి వైయ‌స్‌ఆర్‌సీపీలో చేరిక 

 ఎమ్మెల్యే అనంత సమక్షంలో చేరిన సీపీఐ కీలక నేతలు 

అనంతపురం : అనంతపురం నియోజకవర్గంలోని రుద్రంపేట పంచాయతీ చంద్రబాబు కాలనీలో సీపీఐకి భారీ షాక్‌ తగిలింది. ఇన్నాళ్లూ ఆ పార్టీలో కీలకంగా ఉన్న నేతలు, కార్యకర్తలు వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొండ్రెడ్డి ప్రకాష్‌రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి సమక్షంలో ఆయన స్వగృహం వద్ద దాదాపు 100 కుటుంబాలు వైసీపీ కండువా వేసుకున్నారు. చంద్రబాబు నగర్‌ సీపీఐ శాఖ కార్యదర్శి పెనకచర్ల బాలయ్య, పాలచెర్ల రవికుమార్, సహాయ కార్యదర్శులు రామదాసు, రామకృష్ణ, సాదిక్‌వలి, సీపీఐ శాఖ కార్యవర్గ సభ్యులు, మహిళా సమాఖ్య సభ్యులు పెద్ద ఎత్తున వైయ‌స్ఆర్‌సీపీలో చేరారు. సీఎం వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి పేదల పక్షాన నిలుస్తూ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని, పేదల జీవితాలు బాగుపడాలంటే మరోసారి వైయ‌స్ఆర్‌సీపీ అధికారంలోకి రావాలని నాయకులు తెలిపారు. అనంతపురం నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి జరుగుతోందని, నగరానికి దీటుగా పంచాయతీలను ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. రానున్న ఎన్నికల్లో వైయ‌స్ఆర్‌సీపీని అధికారంలోకి తీసుకురావడం కోసం పని చేస్తామన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనంత మాట్లాడుతూ నిత్యం పేదల పక్షాన నిలుస్తూ వారి సమస్యల కోసం పోరాటం చేసే నాయకులు వైసీపీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. పార్టీలో అందరికీ సముచిత స్థానం ఉంటుందని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్‌ పద్మావతి, వైయ‌స్ఆర్‌సీపీ నేతలు చంద్రశేఖర్‌రెడ్డి, గోవిందరెడ్డి, సాదిక్, వెంకటేష్‌ నాయక్, రాజు నాయక్, విజయ్, తిరుపతినాయుడు, ఆది నాయక్, మాజీ ఎంపీటీసీ రాఘవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Back to Top