రామోజీ ఆరాటం తప్ప.. బాబు రాజకీయంగా బతకడు

అబద్ధాలతో ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీయాలని చూసినా ప్రజలు నమ్మరు

పోలవరం డయాఫ్రం వాల్‌ నిర్వాకం.. చంద్రబాబు పాపమే

1989లో మూతపడిన డోనేకల్‌ పథకాన్ని మా ప్రభుత్వానికి అంటగడతారా..?

చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఈ రాతలన్నీ ఏమయ్యాయి..?

ఒంటిమిట్ట శ్రీరామ ఎత్తిపోతల పథకం నిరుపయోగం అనే మాట పచ్చి అబద్ధం

ఇరిగేషన్‌ శాఖ మంత్రి అంబటి రాంబాబు

తాడేపల్లి: ‘దుర్మార్గపు రాజకీయాలు చేసిన పచ్చి మోసగాడు చంద్రబాబు. రామోజీరావు, ఎల్లోమీడియా ఆరాటం తప్ప.. చంద్రబాబు రాజకీయంగా బతకడు’ అని ఇరిగేషన్‌ శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. చంద్రబాబును అధికారంలోకి తీసుకురావాలనే తాపత్రయంతో అబద్ధాలు రాసే ప్రయత్నాన్ని  మానుకొని, వాస్తవాలు చెబితే.. ప్రజలు మెచ్చుకుంటారన్నారు. ‘అక్క ఆరాటం తప్ప.. బావ బతకడు’. అబద్ధాలు రాసి సీఎం వైయస్‌ జగన్‌ ప్రతిష్టను దెబ్బతీయాలనే ప్రయత్నం చేసినా ఫలితం శూన్యం.. ప్రజలు వైయస్‌ జగన్‌కు దూరంకారని మంత్రి అంబటిరాంబాబు అన్నారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి అంబటి రాంబాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా అంబటి ఏం మాట్లాడారంటే..

పోలవరానికి సంబంధించి డయాఫ్రం వాల్‌ దెబ్బతినడం వల్ల పనుల్లో కొంత జాప్యం జరిగినమాట వాస్తవం. వాల్‌ నిర్మాణం.. పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున గుంటలు ఏర్పడి.. వాటిని సరిచేయాల్సిన అనివార్య పరిస్థితి రావడం విచారకరం. తెలుగుదేశం పార్టీ తప్పుడు విధానాల వల్లే ఈ పరిస్థితి ఏర్పడింది. జలశక్తి అడ్వయిజర్‌తో కలిసి ప్రిన్సిపల్‌ సెక్రటరీ, ఈఎన్‌సీ, సీడబ్ల్యూసీ నిపుణులు సుదీర్ఘంగా చర్చలు జరుపుతున్నారు. త్వరలోనే ఒక నిర్ణయానికి వచ్చి రీడిజైన్‌ చేసి గుంటలు పూడ్చే కార్యక్రమాన్ని ప్రారంభించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. 

డయాఫ్రంవాల్‌ విషయంలో ఇప్పటికీ సందిగ్ధత కొనసాగుతుంది. వాల్‌ పూర్తిగా దెబ్బతిన్నదా.. లేదా అనే టెక్నాలజీ లేకపోవడం దురదృష్టకరం. ప్రజలు, మేధావులు గమనించాల్సిన విషయం ఏంటంటే.. ఇప్పటి వరకు ప్రపంచంలో ఏ ప్రాజెక్టు డయాఫ్రం వాల్‌ దెబ్బతిన్న సంఘటన లేదు. ఇదే తొలిసారి. ప్రధాన కారణం..  చంద్రబాబు, దేవినేని ఉమల అజ్ఞానం, తొందరపాటు చర్య, డబ్బు ఆశించి చేసే కార్యక్రమాల వల్లే దెబ్బతిన్నది అనేది వాస్తవం. రెండు, మూడు నెలల్లోనే నిర్ణయం వస్తుంది. డయాఫ్రం వాల్‌ పూర్తయిన తరువాత ఎర్త్‌ కం రాక్‌ఫిల్లింగ్‌ డ్యామ్‌ పూర్తిచేసి నీరు ఇచ్చే కార్యక్రమం చేపడుతాం. 

తెలుగుదేశానికి బాకా ఊదే పత్రికలా ఈనాడు ప్రవర్తిస్తుంది. ప్రతిరోజూ ఏదో ఒక హెడ్‌లైన్‌.. ప్రభుత్వం వ్యవసాయాన్ని, డ్యామ్‌లు, పోలవరం, పులిచింతల గేటు గురించి సక్రమంగా పట్టించుకోవడం లేదని విషంకక్కే ప్రయత్నం చేస్తున్నారు. ‘ఎత్తిపోతున్న ఎత్తిపోతల పథకాలు’ అని రాశారు. ప్రభుత్వంపై విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారు. ఏ పత్రిక అయినా నిస్పక్షపాతంగా వ్యవహరిస్తేనే ప్రజలు ఆదరిస్తారు.. పక్షపాత ధోరణితో, ఎవరినో అధికారంలోకి తీసుకురావాలనే తాపత్రయంతో పనిచేసే పత్రికలు ప్రజలు దూరం అవుతాయని గమనించాలి. 

మన రాష్ట్రంలో వ్యవసాయానికి పనికొచ్చే లక్షల ఎకరాల భూమి ఉంది. ఇరిగేషన్‌ ద్వారా 1.04 లక్షల ఎకరాలను సాగుచేస్తున్నాం. ఇంకా మిగిలిన 94.63 లక్షల ఎకరాలు వర్షాధారంగా పండుతున్నాయి. జలయజ్ఞం కింద దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి అనేక ప్రాజెక్టులు ప్రారంభించారు. దాని ద్వారా 31 వేల ఎకరాల పైచిలుకు భూమిని ఇరిగేషన్‌లోకి తీసుకురావాలనే ప్రయత్నం చేశారు. లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీమ్‌ను ప్రారంభించి సుమారు 8 లక్షల ఎకరాలను సాగులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేశాం. దీనికి సుమారుగా 1,032 ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి. ప్రాజెక్టుల నిర్మాణం తరువాత ఆయకట్టులోని రైతాంగాన్ని సంఘం ఏర్పాటు చేసి.. నిర్వహణ  బాధ్యత అప్పగిస్తారు. వారు ఎకరానికి కొంత వసూలు చేసి ప్రాజెక్టు నిర్వహణ చూసుకుంటారు. విద్యుత్‌ బిల్లులను మాత్రం ప్రభుత్వం చెల్లిస్తుంది. కొన్ని సందర్భాల్లో నిర్వహణలోపం వల్ల ప్రాజెక్టులు దెబ్బతింటున్నాయి. వారిని ఎడ్యుకేట్‌ చేస్తాం. 

రాష్ట్రంలో 250 పైగా పథకాలు పనిచేయడం లేదని ఈనాడు రాస్తుంది. ఈనాడు, ఎల్లోమీడియా, రామోజీరావుకు నా సూటి ప్రశ్న. డోనేకల్‌ ఎత్తిపోతల పథకం 1989లో ప్రారంభించారు. నిర్వహణ లోపం, చొరవ లేకపోవడం వల్ల అదే ఏడాది 1989లో మూతపడింది. దానికి  వైయస్‌ జగన్‌ ప్రభుత్వం కారణమా..? 14 సంవత్సరాలు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎందుకు రాయలేదు..? ఎన్నికలకు ముందు సీఎం వైయస్‌ జగన్‌పై విషం చిమ్మితే.. ప్రజలు నమ్మితే.. చంద్రబాబును గెలిపిస్తారనే కదా ఈనాడు ఆరాటం. చంద్రబాబు, అంతకు ముందు మూలనపడిన ప్రాజెక్టు గురించి మాత్రం రాయరా..? రైతులకు మేలు చేసే ప్రభుత్వంపై విషం చిమ్ముతారా..? ఎప్పుడూ ఇవ్వని విధంగా జూన్‌ మాసంలో నీరు ఇస్తుంటే అది గొప్పగా రాయలేరా..? చంద్రబాబు, అంతకుముందు జరిగిన లోపాలను సీఎం వైయస్‌ జగన్‌ నెత్తినపెట్టి లబ్ధిపొందాలని ప్రయత్నం చేస్తున్నారు. 

వైయస్‌ఆర్‌ జిల్లాలో ఒంటిమిట్ట శ్రీరామ ఎత్తిపోతల పథకం నిరుపయోగంగా ఉన్న మాట పచ్చి అబద్ధం. ఇది ఎల్లో మీడియా, రామోజీరావు అబద్ధం. సోమశిల నుంచి నీటిని లిఫ్ట్‌ చేసి.. చెరువుకు పంపించి గ్రావిటీ ద్వారా తాగునీరు, సాగునీరు అందించే ప్రాజెక్టు. ఆ చెరువు నిండిపోయింది కాబట్టే మోటార్లు ఆపారు.. చెరువు ఖాళీ అయితే.. మోటార్లు స్టార్ట్‌ చేస్తారు. ఎందుకు పచ్చి అబద్ధాలు రాస్తున్నారు. విషం కక్కే ప్రయత్నం చేయొద్దు.. చేసినా ప్రజలు నమ్మరు. 
 

Back to Top