వైయస్ జగన్ పర్యటనలో పోలీసుల అత్యుత్సాహం

ప్రజలను రానివ్వకుండా అడ్డుకునేందుకు కుట్రలు

వైయస్ఆర్‌సీపీ మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆగ్రహం

నరసరావుపేట క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి
 
వైయస్ జగన్ పర్యటన విఫలం కావాలని చూశారు

సింగయ్యను కాన్వాయి వాహన ఢీకొట్టిందని తప్పుడు ప్రచారం

సొమ్మసిల్లి హార్ట్ఎటాక్‌తో చనిపోయిన యువకుడి మృతిపైనా రాజకీయం

మృతుల కుటుంబాలకు వైయస్ఆర్‌సీపీ అండగా నిలుస్తోంది

వైయస్ఆర్‌సీపీ మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి 

నరసరావుపేట: పల్నాడులో వైయస్ జగన్ పర్యటనను అడ్డుకునేందుకు పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. నరసరావుపేట క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. బారికేట్లు, ఆంక్షలు, ముందస్తు నోటీసులతో అడుగడుగునా పర్యటనను విఫలం చేయాలనే చూశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దురదృష్టవశాత్తు ఇరువరు మృతి చెందితే, వారి మరణాలను కూడా వివాదం చేయాలని కూటమి నేతలు దిగజారుడు రాజకీయం చేశారని ధ్వజమెత్తారు. అన్ని కుట్రలను విఫలం చేస్తూ, అశేష ప్రజావాహిని వైయస్ జగన్ వెంట నిలబడిందని, కూటమి ప్రభుత్వంపై ప్రజాగ్రహం వెల్లువెత్తిందని అన్నారు. 

ఇంకా ఆయనేమన్నారంటే... 

వైయస్ జగన్ బయలుదేరిన నాటి నుంచి సత్తెనపల్లిలో వైయస్ జగన్‌ను చూడాలని, ఆయనను కలవాలని ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పోలీసులు దీనిని అడ్డుకునేందుకు అనేక ఆంక్షలు పెట్టారు. పల్నాడు జిల్లాలో పార్టీ ఇన్‌చార్జీలతో పాటు ద్వితీయశ్రేణి నాయకులు, గ్రామస్థాయి నాయకులకు కూడా వెళ్ళవద్దని నోటీసలు ఇచ్చారు. సత్తెనపల్లిలో కనీసం మంచినీరు కూడా దొరకకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు హోటళ్ళను మూసేయించారు. వైయస్ జగన్ పర్యటన విజయవంతం కాకూడదని కూటమి ప్రభుత్వం ఆదేశాలతో పోలీసులు అనేక ఇబ్బందులు పెట్టారు. 

తప్పుడు కేసులతో భయపెట్టలేరు
 
వైయస్ జగన్ పర్యటనలో సింగయ్య అనే వ్యక్తి చుట్టుగుంట వద్ద కాన్వాయ్ వెహికిల్ తగిలి చనిపోయారంటూ కూటమి పార్టీలు తప్పుడు వార్తలను ప్రచారం చేశాయి. గుంటూరు ఎస్పీ సతీష్‌కుమార్ ఈ మరణంపై వైయస్ జగన్ కాన్వాయి వెహికిల్ వల్ల సింగయ్య మృతి చెందలేదని, అది ఒక ప్రైవేటు వెహికిల్ అంటూ దాని రిజిస్ట్రేషన్ నెంబర్‌తో సహా వాస్తవాన్ని వెల్లడించారు. తరువాత సత్తెనపల్లి టౌన్‌లో జయవర్థన్‌రెడ్డి అనే యువకుడు సొమ్మసిల్లి పడిపోయి, హార్ట్‌ ఎటాక్‌ వల్ల మృతి చెందాడు. వైయస్ జగన్ రాకముందే, ఉదయం నుంచి ఆహారం తీసుకునేందుకు వీలులేక, సొమ్మసిల్లి చనిపోయాడు. దానిని కూడా వైయస్ జగన్ వల్లే అంటూ ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేసింది. ఈ రెండు మరణాలను కూడా వైయస్ జగన్ వల్లే అంటూ తెలుగుదేశం నాయకులు సిగ్గులేకుండా అబద్దాలను చెబుతున్నారు. వైయస్ జగన్ పర్యటన పై అనేక మంది నాయకులతో పాటు చనిపోయిన నాగమల్లేశ్వరరావు తండ్రిపైన కూడా పోలీసులు కేసులు పెట్టారు. ఇటువంటి కేసులకు భయడే ప్రసక్తే లేదు. మృతుల కుటుంబాలకు వైయస్ఆర్‌సీపీ అండగా నిలుస్తోంది. 

మీవల్ల చనిపోయిన కుటుంబాలకు ఎవరు బాధ్యత వహిస్తారు?

గోదావరి పుష్కరాల్లో 29 మంది చంద్రబాబు ప్రచార ఆర్భాటం వల్ల తొక్కిసలాటలో చనిపోయారు. కందుకూరు రోడ్‌షోలో చంద్రబాబు సభను ఇరుకుసందుల్లో పెట్టడం వల్ల డ్రైనేజీలో పడి ఎనిమిది మంది చనిపోయారు. 2023 లో గుంటూరులో టీడీపీ చీరెల పంపిణీలో ముగ్గురు చనిపోయారు. ఇటీవలే తిరుపతి వైకుంఠ ఏకాదశి టిక్కెట్ల పంపిణీలో తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు చనిపోయారు. సింహాచలం క్షేత్రంలో గోడకూలి ఏడుగురు చనిపోయారు. లోకేష్ పాదయాత్ర ప్రారంభించిన రోజు సినీనటుడు తారకరత్న చనిపోయాడు. ఈ మరణాలకు చంద్రబాబు కారకుడు కాదా? వీటికి ఎవరు బాధ్యత తీసుకుంటారు? మృతుల కుటుంబాలకు ఎవరు సమాధానం చెబుతారు? 
వైయస్ జగన్‌ను చూసి చంద్రబాబు భయపడుతున్నారు. భూతాన్ని భూస్థాపితం చేయాలని మాట్లాడిన చంద్రబాబుపై న్యాయపరంగా చర్యలు తీసుకోవాలి. రవితేజ అనే యువకుడు ఫ్లెక్సీ ప్రదర్శించాడని అతడిని పోలీసులు అదుపులోకి తీసుకుని ఎక్కడకు తీసుకువెళ్లారో ఇప్పటికీ తెలియదు. అతడు తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్త అని ఆయన తీసుకున్న సభ్యత్వ కార్డు ద్వారానే తెలుస్తోంది. అతడు ఏ పార్టీకి చెందిన వ్యక్తి అయినా సరే, అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్న తరువాత ఎక్కడకు తీసుకువెళ్ళారు? ఏం చేస్తున్నారు అనే కనీస సమాచారాన్ని అతడి భార్యాబిడ్డలకు ఇవ్వాల్సిన అవసరం లేదా అని ప్రశ్నిస్తున్నాం. చట్టప్రకారం వ్యవహరించాల్సిన అవసరం లేదా?

Back to Top