తాడేపల్లి: నవ మాసాల్లో మహిళలకు నవ మోసాలను పరిచయం చేసిన కూటమి ప్రభుత్వానికి అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరిపే అర్హత లేదని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణితో కలిసి మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు ఆకర్షణీయమైన హామీలతో మహిళలను నమ్మించి, అధికారంలోకి రాగానే పథకాల అమలులో వారికి మొండిచేయి చూపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్ జగన్ పాలనలోనే మహిళలు నిజమైన సాధికారితను అందుకున్నారని అన్నారు. ఇంకా ఆమె ఏమన్నారంటే... రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో మహిళలు నరకాన్ని అనుభవిస్తున్నారు. ఈ రాష్ట్రంలో మహిళలు సంతోషంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవంను జరుపుకోలేని స్థితిలో ఉన్నారు. వైయస్ జగన్ పాలనలో సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా మహిళలు నిలదొక్కుకునే విధంగా వ్యవహరించారు. ఒక అన్నగా, తమ్ముడిగా, తండ్రిగా అందరి గుండెల్లో గుడి కట్టుకున్నారు. గత అయిదేళ్ళు మహిళలను మహరాణులుగా చూసుకున్నారు. ప్రతి పథకాన్ని మహిళ పేరుమీద ఇచ్చి ఆ ఇంట్లో మహిళ గౌరవాన్ని పెంచడమే కాకుండా మగవారితో సమానమైన స్థానం కల్పించారు. ఇళ్ళ స్థలాలు, పక్కాగృహాలు, చేయూత, ఆసరా, అమ్మ ఒడి, సున్నా వడ్డీ, ఇలా అన్ని మహిళల పేరు మీద ఇచ్చారు. ఒక మహిళ బాగుంటే ఆ కుటుంబం బాగుంటుందనే నమ్మకంతో ఆయన ముందుకు వెళ్ళారు. నూరుశాతం మహిళలు కూడా దానిని సద్వినియోగం చేసుకున్నారు. రాజకీయంగా యాబైశాతం నామినేటెడ్ పోస్ట్ లు మహిళలకు కల్పించి, వారిని అన్ని విధాలుగా ప్రోత్సహించారు. కూటమి పాలనలో భయం భయంగా బతుకుతున్నారు ఈ రోజు కూటమి పాలనలో మహిళలు భయం... భయంగా బతుకుతున్నారు. మహిళలపై వేధింపులకు పాల్పడుతున్నారు. మహిళా భద్రత కోసం జగన్ గారు దిశాయాప్, దిశా పోలీస్ స్టేషన్లు, మహిళా పోలీసులను తీసుకువచ్చారు. కానీ కూటమి ప్రభుత్వం వీటిని నిర్వీర్యం చేసింది. సీఎం చంద్రబాబు, డీసీఎం పవన్, హోమంత్రి అనితకు మహిళలు అంటే గౌరవం, అభిమానం లేదు. చంద్రబాబు సీఎం అయిన తరువాత చంద్రన్న పగ... చంద్రన్న దగా... చంద్రన్న మోసం... తల్లికి పంగనామం.. నిరుద్యోగులకు వెన్నుపోటు... లతో పాలనను సాగిస్తున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అందరూ ఈ ప్రభుత్వం మహిళలకు మంచిని పంచేది కాదు... ముంచే ప్రభుత్వం అని చెబుతున్నారు. ఇటీవల చంద్రబాబు ఒక సమావేశంలో నేరుగా, పరోక్షంగా గానూ వైయస్ఆర్ సీపీ వారికి ఏ పనీ చేయవద్దని చెప్పారు. కానీ కూటమ ప్రభుత్వానికి ఓట్లు వేసిన మహిళలకు కూడా వారు ఏ పనీ చేయడం లేదు. సిగ్గులేకుండా కూటమి ప్రభుత్వం పచ్చ చానెల్స్ లో మహిళా సాధికారిత కోసం ఎంతో కృషి చేసినట్లు ప్రచారం చేసుకుంటోంది. ఈ రాష్ట్రంలో ప్రతి రోజూ సగటున డెబ్బై మంది మహిళలు, వృద్దులు, చిన్నపిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ఇదేనా మహిళా సాధికారిత అంటే? యాబైశాతం రిజర్వేషన్లు మహిళలకు ఎత్తేశారు. ఆరేళ్ళనుంచి అరవై ఏళ్ళ వరకు మహిళలను మోసం చేశారు. దాదాపు యాబై వేలకు పైగా బెల్ట్ షాప్ లు పెట్టి, ఆడవారి పసుపు కుంకుమలతో చెలగాటం ఆడుతున్నారు. పవన్ కళ్యాణ్ మహిళా ద్రోహి.. డిప్యూటీసీఎం పవన్ కల్యాణ్ గత అయిదేళ్ళు ఊగిపోతూ, అరుస్తూ మహిళల కోసం మాట్లాడారు. జగన్ గారి ప్రభుత్వంలో ముప్పై వేల మంది మహిళలు అక్రమ రవాణా అయ్యారని కేంద్ర నిఘా వర్గాలు చెప్పాయని అన్నారు. ఇప్పుడు కేంద్రంలో బాగస్వామిగా ఉన్నారు. ఆ ముప్పై వేల మందిని ఇళ్ళకు తీసుకు వచ్చేందుకు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? మీ రాజకీయం కోసం ఆడబిడ్డలను అడ్డం పెట్టుకుని జగన్ గారిపైన దుష్ప్రచారం చేస్తారా? పవన్ కళ్యాణ్ ఒక మహిళా ద్రోహి. సుగాలి ప్రీతి కేసు విషయంలో ఆయన వ్యవహారశైలి చూస్తే ఆయనేంటో అందరికీ అర్ధమవుతోంది. సుగాలి ప్రీతి తల్లి జనసేన సభ్యతం తీసుకుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు అవుతోంది. ఆమెకు ఎందుకు అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదు. రాజకీయం కోసం వినియోగించుకుని, అవమానిస్తున్నారని సుగాలి ప్రీతి తల్లి పవన్ పై ఆరోపణలు చేయడం వాస్తవం కాదా? ఆనాడు మీరు డిమాండ్ చేసినట్లు ఎందుకు సీబీఐ విచారణకు కేంద్రంపై వత్తిడి తీసుకురావడం లేదు? మద్యం, గంజాయి వల్ల మహిళలపై వేధింపులు పెరుగుతున్నాయి. కుప్పంలో గంజాయి సాగు పెద్ద ఎత్తున జరుగుతోంది. సీఎం నివాసం ఉంటున్న గుంటూరు జిల్లా డగ్స్‌కు అడ్డగామారింది. హోంమంత్రి అనిత నివాసం ఉంటున్న వైజాగ్ లో గంజాయి సాగు భారీగా జరుగుతోంది. ముందు వీటిని అరికట్టాలి. మహిళలకు ఇచ్చిన హామీల అమలు ఏదీ?: ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ఆగ్రహం ఎన్నికలకు ముందు ఓట్ల కోసం కూటమ పార్టీలు మహిళలకు ఇచ్చిన హామీల అమలు ఏమయ్యిందని వైయస్ఆర్ సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ప్రశ్నించారు. మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ... రాష్ట్రంలో మహిళ భద్రతను కూటమి గాలికి వదిలేసింది. జగన్ గారి కంటే ఎక్కువ మేలు చేస్తామంటూ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. సూపర్ సిక్స్ పథకాలను ప్రకటించి, వాటిని ఎగ్గొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రభుత్వం మహిళలను నిలువునా నట్టేట ముంచింది. మహాశక్తి పేరుతో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఇప్పటి వరకు ఒక్క మహిళకు కూడా ఈ పథకం కింద మేలు జరగలేదు. ఉచిత బస్సు అంటూ పెద్ద ఎత్తున ఊదరగొట్టారు. రాష్ట్రంలోని అన్ని పుణ్యక్షేత్రాలు ఉచితంగా బస్సులో తిరగవచ్చంటూ ఊరించారు. ఎన్నికలకు ముందు పొరుగు రాష్ట్రాలను చూసి ఉచిత బస్పు హామీ ఇచ్చారు. ఆయా రాష్ట్రాల్లో వారు అధికారంలోకి రాగానే ఉచిత బస్సు ను అమలు చేస్తున్నారు. కానీ ఏపీలో మాత్రం హామీలు ఇవ్వడం, అధికారం లోకి రాగానే వాటిని విస్మరించడం అలవాటుగా మారింది. నిరుద్యోగులకు భృతి, ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించకుండా మోసం చేశారు. బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ మహిళలకు యాబై ఏళ్ళకే పెన్షన్ అన్నారు. దానీ ఊసే లేదు. దేశ చరిత్రలోనే తొలిసారి డ్రాప్ అవుట్స్ ను ఆపేందుకు వైయస్ జగన్ గారు అమ్మ ఒడి అనే పథకాన్ని అమలు చేశారు. తల్లికి వందనం పేరుతో ఆ పథకాన్ని ప్రకటించిన ప్రభుత్వం కనీసం బడ్జెట్ లో అందుకు అవసరమైన నిధులను కూడా కేటాయించడం లేదు. రాష్ట్రంలో దాదాపు 83 లక్షల మంది పిల్లలు ఈ పథకం అమలు కోసం ఎదురుచూస్తున్నారు. చివరికి ఉద్యోగులకు, వాలంటీర్లను మోసం చేసిన ఘనత ఈ ప్రభుత్వానికే దక్కుతుంది.