తణుకు: ఇంటి వద్దే రేషన్ సరుకుల డెలివరీలో కీలకంగా నిల్చి, ప్రజలకు ఎంతో సేవలందించిన ‘మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్స్’ (ఎండీయూ) రద్దు చేయడం ద్వారా సీఎం చంద్రబాబు ప్రజలకు మరో వెన్నుపోటు పొడిచారని వైయస్ఆర్‌సీపీ రీజినల్ కోఆర్డినేటర్, మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఆక్షేపించారు. ప్రజలకు ఏది బాగున్నా, చంద్రబాబుకు అది నచ్చదని ఆయన స్పష్టం చేశారు. ఎండీయూల రద్దుపై తన నిర్ణయాన్ని సమర్థించుకునేలా సీఎం చంద్రబాబు, ఆ వాహనాల ఆపరేటర్లపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని తణుకులో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. ప్రెస్‌మీట్‌లో ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే..: మళ్లీ పాత ‘రేషన్’ కష్టాలు: ప్రజలు సుఖసంతోషాలతో ఉంటే సీఎం చంద్రబాబుకు నచ్చడం లేదు. అందుకే పాత రేషన్ పంపిణీ విధానాన్ని తీసుకొచ్చి దాదాపు కోటిన్నర కుటుంబాలను వేధిస్తున్నారు. ఇంటికే రేషన్ పంపిణీ చేసే వ్యవస్థకు మంగళం పాడేసి, ఎండీయూలను రద్దు చేసి, పాత విధానాన్ని తీసుకొచ్చి పగ తీర్చుకుంటున్నాడు. రేషన్ డెలివరీలో సర్వర్లు పని చేయక మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మహిళలను నిర్దయగా ఎండల్లో నిలబెడుతున్నారు. రేషన్ కోసం వెళ్లిన వారు గంటల తరబడి లైన్లలో నిరీక్షించలేక సతమతం అవుతున్నారు. ఏజెన్సీ ఏరియాల్లో రేషన్ సరుకులు తెచ్చుకునేందుకు గిరిజనులు.. ముఖ్యంగా మహిళలు.. బాలింతలు. గర్భిణులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అనంతపురం జిల్లాలో మందల లక్ష్మీదేవి(70) అనే వృద్ధురాలు రేషన్ కోసం వెళ్లి ఎండకు సొమ్మసిల్లిపోయి మరణించింది. వారి అవినీతిపై ఆధారాలున్నాయా?: ఎండీయూలు రద్దు చేసిన సీఎం చంద్రబాబు, తన నిర్ణయాన్ని సమర్థించుకుంటూ, వాటి ఆపరేటర్లపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే, ఇంటి వద్దకే రేషన్ సరుకులు అందజేస్తున్న ఎండీయూ వాహనాలను ఎందుకు రద్దు చేస్తున్నారో సరైన కారణం చెప్పలేక, రేషన్ వాహనాల ద్వారా అవినీతి జరుగుతోందని, బియ్యం అక్రమంగా తరలిపోతోందని సీఎం చంద్రబాబు చెప్పడం సిగ్గుచేటు. చంద్రబాబు చెప్పేదే నిజమైతే, ఈ ఏడాది కాలంలో ఎన్ని ఎండీయూ వాహనాల మీద కేసులు నమోదు చేసి సీజ్ చేశారో చెప్పాలి. అవినీతికి పాల్పడుతున్న ఎంతమంది ఆపరేటర్ల మీద కేసులు నమోదు చేశారు, వారి నుంచి ఎంత సరుకు రికవరీ చేశారో చూపించాలి. జగన్‌కి మంచి పేరొస్తుంటే ఓర్వలేకనే..: రేషన్ షాపుల నిర్వహణకు వైయస్ఆర్‌సీపీ వ్యతిరేకం కాదు. మా హయాంలో ఎండీయూ వాహనాలతో పాటు, రేషన్ షాపులు కూడా కొనసాగించాం. ఎక్కడా రేషన్ షాపులు మూసేయలేదు. అధికారంలోకి వచ్చాక రేషన్ డీలర్ల కమీషన్ పెంచుతామని కూడా హామీ ఇచ్చాం. కానీ, ఎండీయూ వాహనాలను రద్దు చేయడం వల్ల 9260 ఎండీయూలకు సంబంధించి, దాదాపు 20 వేల మంది ఉపాధి కోల్పోవడంతో, వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయి. మన రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకుని పంజాబ్‌లో కూడా ఎండీయూ వాహనాలను ప్రవేశపెడితే, చంద్రబాబు మాత్రం ప్రజలకు నాణ్యమైన సేవలందిస్తున్న వ్యవస్థను దెబ్బ తీస్తున్నారుజ కేవలం జగన్ గారికి మంచి పేరొస్తుంటే ఓర్వలేక ఎండీయూ వాహనాలను రద్దు చేయడం దారుణం. ఒక పక్క డ్రోన్లతో ఇంటికే సరుకులు అందజేస్తానని చెప్పుకుంటున్న చంద్రబాబు, ఆదర్శంగా నడుస్తున్న వ్యవస్థను రద్దు చేయడం నమ్మి ఓటేసి గెలిపించిన ప్రజలను వెన్నుపోటు పొడవడమే. చంద్రబాబు సీఎం అయ్యాక ఈ ఏడాదిగా ప్రజలు పండగలు కూడా మర్చిపోయారు. పండగలు చేసుకోలేని దుస్థితికి రాష్ట్రాన్ని తీసుకెళ్లారు. బియ్యం పంపిణీ కూడా ఎత్తేసే కుట్ర: గత ప్రభుత్వ హయాంలో రేషన్ షాపుల ద్వారా పోషక విలువలతో కూడిన సార్టెక్స్ బియ్యం అందజేశాం. ఇంకా రేషన్ సరుకులు డెలివరీ చేసే ఎండీయూ వాహనాలను జియో ట్యాగింగ్ చేసి అక్రమాలను అరికట్టగలిగాం. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక యథేచ్ఛగా ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) బియ్యాన్ని తరలిస్తున్నారు. తాజాగా విశాఖ, కోనసీమ జిల్లాల్లో రేషన్ బియ్యాన్ని అక్రమ రవాణా చేస్తున్న వాహనాలను ప్రజలే పట్టుకుని పోలీసులకు అప్పగించారు. సీజ్ ద షిప్ అనే పేరుతో డ్రామా చేయడం తప్ప, రికవరీ చేసిన రేషన్ బియ్యాన్ని వేలం వేసినట్టు ఒక్క సంఘటన అయినా ఉంటే చూపించాలి. గత ప్రభుత్వంలో రేషన్ షాపుల ద్వారా బియ్యంతోపాటు, గోధుమ పిండి, రాగి పిండి, కంది పప్పు, చక్కెర పంపిణీ చేస్తే, ఈరోజు అవన్నీ ఇవ్వడం లేదు. రాబోయే రోజుల్లో ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) పేరుతో బియ్యం కూడా ఇవ్వకుండా మంగళం పాడేసే కుట్ర జరుగుతోంది. ప్రభుత్వం వెంటనే తన నిర్ణయం మార్చుకోవాలి. వెంటనే ఎండీయూ వాహనాలు తిరిగి ప్రారంభించాలి. ఇంటి వద్దకే రేషన్ సరుకులు పంపిణీ చేయాలి. లేదంటే బాధితుల పక్షాన నిలబడి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమిస్తుంది. బుధవారం (జూన్ 4) వెన్నుపోటు దినం: ఏడాది కాలంగా ప్రజలకిచ్చిన హామీలు తుంగలో తొక్కి టీడీపీ కూటమి ప్రభుత్వం సాగించిన దురహంకార, అవినీతి, నియంత పాలనపై బుధవారం (జూన్ 4) వైయస్ఆర్‌సీపీ ఆధర్యంలో ‘వెన్నుపోటు దినం’ నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా, ఆరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించి, ప్రజా సమస్యలపై ఎమ్మార్వోలు, ఆర్డీవోలు, కలెక్టర్లకు వినతి పత్రాలు అందజేస్తామని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు వివరించారు.