మాజీ మంత్రి శైలజానాథ్‌ వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌

తాడేపల్లి: వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షులు, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌మ‌క్షంలో పీసీసీ మాజీ అధ్య‌క్షుడు, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ వైయ‌స్ఆర్‌సీపీ చేరారు.  తాడేప‌ల్లిలోని క్యాంపు కార్యాల‌యంలో ఆయ‌న‌కు కండవా కప్పి వైయ‌స్ జగన్ పార్టీలోకి ఆహ్వానించారు. శైలజానాథ్‌తో పాటు ఏఐసీసీ మెంబర్‌, అనంతపురం డీసీసీ మాజీ అధ్యక్షుడు ప్రతాప్‌ రెడ్డి వైయ‌స్ఆర్‌సీపీలో చేరారు. కార్యక్రమంలో ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌ రెడ్డి, వైయ‌స్ఆర్‌సీపీ సీనియర్‌ నాయకులు అనంత వెంకట్రామిరెడ్డి, వేంపల్లి సతీష్‌ రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి, వై.విశ్వేశ్వర రెడ్డి, తలారి రంగయ్య, మేరుగ నాగార్జున, పలువురు నాయకులు  పాల్గొన్నారు. 

 

సాకే శైలజానాథ్, మాజీ మంత్రి:
– జగన్‌గారి నాయకత్వంలో పని చేస్తూ, ఎన్‌డీఏ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను అడ్డుకుని ప్రజల పక్షాన పోరాడాలని నిర్ణయించుకున్నాను. కూటమి ప్రభుత్వం సూపర్‌ సిక్స్‌ హామీలు అమలు చేయడం లేదు. మరోవైపు ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలను నిర్వీర్యం చేయడం ద్వారా, పేదలకు వైద్య విద్య దూరం చేస్తున్నారు. గతంలో జగన్‌గారు విద్యా రంగంలో చేసిన అమలు చేసిన అనేక సంస్కరణలను ఈ ప్రభుత్వం పక్కన పెట్టింది. ప్రజల సంక్షేమాన్ని కూటమి ప్రభుత్వం పూర్తిగా గాలికొదిలేసింది. రాయలసీమ జిల్లాల్లో రైతుల కష్టాలను కూడా చంద్రబాబు ప్రభుత్వం అస్సలు పట్టించుకోవడం లేదు. వారి తరపున ప్రభుత్వాన్ని నిలదీస్తాం. వైయస్ఆర్‌సీపీ సీనియర్‌ నాయకుల సహకారంతో ముందుకు వెళ్తాం. ప్రజల పక్షాన పోరాడుతాం. మొక్కవోని ధైర్యంతో పని చేసే నాయకత్వం జగన్‌గారిది. అందుకే ఆయన నేతృత్వంలో పని చేసేందుకు, వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరినట్లు సాకే శైలజానాథ్‌ వెల్లడించారు.

అనంత వెంకట్రామిరెడ్డి, వైయస్ఆర్‌సీపీ సీనియర్‌ నేత:
– ఈరోజు శైలజానాథ్‌గారు మా వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరడాన్ని ఆహ్వానిస్తున్నాం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. చంద్రబాబు నిజ స్వరూపం బయటపడుతోంది. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పని చేస్తుందని అనేక మంది మా పార్టీలోకి వస్తున్నారు. రాయలసీమకు కృష్ణా జలాలు తీసుకొస్తానని చంద్రబాబు చెబుతున్నది శుద్ద అబద్దం. చంద్రబాబు 1996లో ఆ పనులకు శంకుస్ధాపన చేశారు. ఆ తర్వాత పట్టించుకోలేదు. కానీ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డిగారు సీఎం అయిన తర్వాత కృష్ణా జలాలను రాయలసీమకు అందించారు. చంద్రబాబు రాయలసీమకు ద్రోహం చేశారు. జగన్‌గారు సీఎంగా రాయలసీమ అభివృద్ధి కోసం అనేక చర్యలు తీసుకున్నారు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం మా రాయలసీమకు మళ్ళీ అన్యాయం చేస్తో్తంది. 

    కాగా, సాకే శైలజానాథ్‌ అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం నుంచి 2004, 2009 లో కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేగా గెలుపొందారు, పాఠశాల విద్యా శాఖ, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రిగా పని చేశారు. ఆ తర్వాత ఏపీ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. దళితులకు సంబంధించిన అనేక అంశాలపై తన గళం వినిపించి, ఆ సమస్యల పరిష్కారానికి విశేషంగా కృషి చేశారు.

Back to Top