వెలిగొండ ప్రాజెక్ట్‌పై కూటమి ప్రభుత్వం కుట్ర

నిధుల కేటాయింపులో తీవ్ర నిర్లక్ష్యం

మూడు జిల్లాలకు వరప్రదాయినికి అరకొర కేటాయింపులా?

వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌ ఆగ్రహం

రాజకీయాలకు అతీతంగా సీఎంను నిలదీయాలి

వెలిగొండ ప్రాజెక్ట్‌కు నిధుల కోసం కోసం పాదయత్ర

ఆస్తులు అమరావతికి.. పస్తులు ప్రకాశానికా?

ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌ ధ్వజం

తాడేపల్లి వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మీడియా స‌మావేశం

తాడేపల్లి: మూడు జిల్లాలకు వరప్రదాయినిగా నిలుస్తున్న వెలిగొండ ప్రాజెక్ట్‌కు నిధులు కేటాయించకుండా కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోందని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌ మండిపడ్డారు. తాడేపల్లి వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. కేవలం రూ.4 వేల కోట్లు ఖర్చు చేస్తే పూర్తయ్యే వెలిగొండ ప్రాజెక్ట్‌కు కూటమి ప్రభుత్వం ఈ ఏడాది కేవలం రూ.359 కోట్లు మాత్రమే కేటాయించడం దుర్మార్గం కాదా? అని ప్రశ్నించారు. ఏకంగా 53 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం గల ప్రాజెక్ట్‌పై ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం దుర్మార్గమని ధ్వజమెత్తారు.

 ఎమ్యెల్యే చంద్రశేఖర్ ఏమన్నారంటే..:

నాడు చిత్తశుద్దితో పనులు:
    ప్రకాశం జిల్లాలోని ఎర్రగొండపాలెం ప్రాంతంలో నెలకొన్న నీటి ఎద్దడి, కరవు పరిస్థితులను ఐక్యరాజ్యసమతి వంటి అంతర్జాతీయ సంస్థలే గుర్తించాయి. ఈ కరవు పరిస్థితులను మార్చేందుకు నిర్దేశించిన వెలిగొండ ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడంలో వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం చిత్తశుద్దితో వ్యవహరించింది. ఈ ప్రాజక్ట్‌ పనులు శరవేగంతో చేయడం వల్ల శ్రీశైలం నుంచి నీటిని తీసుకురావడానికి నిర్మించిన రెండు టన్నెల్స్‌ పనులు పూర్తయ్యాయి. దానిలోని మట్టిని మాత్రం తొలగించాల్సి ఉంటుంది. అలాగే స్టోరేజీ చేసే కొండల మధ్య ఉన్న గ్యాప్‌లను పూడ్చడం జరిగింది. పునరావాసానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు.
    గతంలో పునరాసానికి రూ.1.80 లక్షలు ప్రకటిస్తే, జగన్‌గారు వచ్చిన తరువాత రూ.12.5 లక్షలు ప్రకటించారు. ఈ ఏడాది జనవరి వరకు ఎవరికైతే 18 ఏళ్ళు నిండి ఉంటాయో వారికి పరిహారం ఇచ్చి, ముంపు ప్రాంతాల నుంచి తరలించాల్సి ఉంది. ఇదే జరిగితే 53 టీఎంసీల సామర్థ్యం ఉన్న ఈ ప్రాజెక్ట్‌కు పూర్తిస్థాయిలో నీరందుతుంది. శ్రీశైలంలో 45 రోజుల పాటు వచ్చే నీటిని ఇక్కడికి తీసుకువచ్చి, కరవును దాదాపు రూపుమాపవచ్చు. 

పాదయాత్ర.. ప్రభుత్వాన్ని నిలదీస్తాం:
    వెలిగొండ ప్రాజెక్ట్‌లో గత బడ్జెట్‌లో అరకొర నిధులను మాత్రమే కేటాయించారు. ఈ నిధుల కేటాయింపుతోనే అసలు వెలిగొండను పూర్తి చేసే ఉద్దేశం కూటమి ప్రభుత్వానికి లేదని అర్థమవుతోంది. కూటమి ప్రభుత్వం చేస్తున్న కుటిల ప్రయత్నాలను తిప్పికొడతాం. వెలిగొండ ప్రాజెక్ట్‌కు నిధులు సాధించేందుకు మేం చేపట్టే పాదయాత్రలో అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములు అవుతారు. ప్రకాశం జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు కూడా రాజకీయాలను పక్కకుపెట్టి ఈ ప్రాజెక్ట్‌ సాధనకు ముందుకు రావాలి. తప్పుడు రాజకీయాలు చేస్తున్న నేతలను నిలదీయాలి. వెలిగొండ ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వ వైఖరిపై ఇప్పటికే ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నాయి. 
    వెలిగొండ ప్రాజెక్ట్‌ ప్రాముఖ్యత ఈ ప్రాంత ప్రజలకు తెలుసు కాబట్టి, తనను నిలదీస్తారనే భయంతోనే చంద్రబాబు తన పర్యటనను ప్రాజెక్ట్‌ వద్ద కాకుండా దూరంగా పెట్టుకుంటున్నారు. తన కుమారుడు నారా లోకేష్‌ కోసం ఆయన నియోజకవర్గంలో వందల కోట్లు కేటాయించుకుంటున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. ‘ఆస్తులు అమరావతికి.. పస్తులు ప్రకాశానికి’ అన్నట్లుగా వీరి వ్యవహారం ఉంది.

 
 

Back to Top