‘కరోనా’పై ముందస్తు చర్యలు తీసుకుంటున్నాం

ఏఎన్‌ఎంల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కల్పిస్తాం

కరపత్రాలు ప్రింట్‌ చేయమని సీఎం ఆదేశించారు

వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని

సచివాలయం: కరోనా వైరస్‌ రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని అన్నారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు అవగాహన కల్పిస్తామని, ప్రజలకు అవగాహన వచ్చేలా కరపత్రాలు ప్రింట్‌ చేయమని సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశాలు ఇచ్చారన్నారు. సచివాలయంలో మంత్రి ఆళ్ల నాని మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ఐదారుగురు నిపుణులు కేంద్ర ప్రభుత్వం వద్ద తర్ఫీదు తీసుకొని వచ్చిన తరువాత 9వ తేదీన రాష్ట్ర స్థాయిలో ట్రైనింగ్‌ క్యాంపు నిర్వహించబోతున్నామన్నారు. కరోనా వైరస్‌ రాష్ట్రంలోకి ఎంటర్‌ అయితే దాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి. ఏ విధంగా ట్రీట్‌మెంట్‌ ఇవ్వాలని కేంద్రంలో ట్రైనింగ్‌ తీసుకున్న రాష్ట్రస్థాయి నిపుణులు జిల్లాలో ఉన్న డాక్టర్లు, సిబ్బందికి తర్ఫీదు ఇస్తారన్నారు. ఈ విధంగా కరోనా వైరస్‌ రాష్ట్రంలోకి రాకుండా చర్యలు తీసుకోవడమే కాకుండా ఒక వేళ వస్తే ఏ విధమైన చర్యలు తీసుకోవాలని కూడా  ముందుకువెళ్తున్నామన్నారు.  

కరోనా వైరస్‌పై ప్రచార కార్యక్రమానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు. కరోనా వైరస్‌ బారినపడకుండా ప్రజలు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. వ్యక్తిగత పరిశుభ్రత, ఆహార నియమాలు పాటించాలన్నారు. ప్రజలకు అవగాహన వచ్చేలా కరపత్రాలు ప్రింట్‌ చేయమని సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశాలు ఇచ్చారని చెప్పారు. గ్రామ,వార్డు సెక్రటేరియట్‌ స్థాయిలో కరపత్రాలు అందజేస్తామన్నారు. ఏఎన్‌ఎంల ద్వారా గ్రామ స్థాయిలో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. కరోనా వైరస్‌ పట్ల ముందస్తు జాగ్రత్తలు గురించి వివరిస్తారు. ప్రజలు ఎవరూ ఆందోళన చెందవద్దని, కరోనా వైరస్‌ రాకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ కేసు నమోదైనా పూర్తిస్థాయిలో వారికి వైద్య సేవలు అందించేందుకు, వ్యాధి అదుపు చేయడానికి చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

 

Back to Top