వైద్యరంగంలో పేదవాడికి ఇబ్బంది కలుగకూడదు

ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి 

14 మెడికల్‌ కాలేజీలకు సీఎం వైయస్‌ జగన్‌ శంకుస్థాపన

ప్రతి పేదవాడికి మంచి వైద్యం అందించాలన్నదే నా ఉద్దేశం

రాష్ట్రవ్యాప్తంగా 16 కొత్త మెడికల్‌ కాలేజీలను ఏర్పాటు చేస్తున్నాం  

ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గానికి ఒక మెడికల్‌ కళాశాల

రూ.8000 కోట్లతో మెడికల్‌ కాలేజీల నిర్మాణం

ప్రతి గ్రామంలోనూ వైయస్‌ఆర్‌ విలేజ్‌ క్లినిక్‌లను ఏర్పాటు చేస్తున్నాం

ప్రతి మండలానికి రెండు పీహెచ్‌సీలను తీసుకొస్తున్నాం

రూ.246 కోట్లతో గిరిజన ప్రాంతాల్లో 5 మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు

వైయస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీలో గణనీయమైన మార్పులు చేశాం

2436 చికిత్సలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చాం

వైద్యం ఖర్చు రూ.1000 దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపు 

కోవిడ్‌ వైద్యాన్ని కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చాం

దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు రూ.10 వేల పెన్షన్‌ అందిస్తున్నాం

ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ ద్వారా ఇప్పటి వరకు రూ.5,215 కోట్లు చెల్లించాం

నాడు–నేడు ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల రూపురేఖలు మారుస్తున్నాం

తాడేపల్లి: వైద్య రంగంలో ఏ పేదవాడికి ఇబ్బంది కలుగకూడదని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో పేదవాడికి వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నామని, రాష్ట్రవ్యాప్తంగా 16 కొత్త మెడికల్‌ కాలేజీలను ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఏ రాష్ట్రానికి తీసిపోకుండా ఆరోగ్య రంగంలో అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నామని చెప్పారు. ఇప్పటికే పులివెందుల, పాడేలో మెడికల్‌ కాలేజీల పనులు జరుగుతున్నాయని, ఈ రోజు మరో 14 కొత్త మెడికల్‌ కళాశాలకు శంకుస్థాపన చేస్తున్నామని తెలిపారు. ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గంలో ఒక టీచింగ్‌ కాలేజీ, మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. కొత్త కాలేజీల నిర్మాణాలను మూడేళ్లలో పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించామని చెప్పారు. ఆరోగ్యశ్రీలో గణనీయమైన మార్పులు తెచ్చామని, 2436 చికిత్సలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చామని సీఎం వైయస్‌ జగన్‌ పేర్కొన్నారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సోమవారం కొత్తగా 14 మెడికల్‌ కాలేజీలకు సీఎం వైయస్‌ జగన్‌ వర్చువల్‌ విధానంలో శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మాట్లాడారు.

మనందరి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత ..ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి రెండేళ్లు పూర్తి అయిన సందర్భంగా ఈ రోజు దేవుడి దయతో మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టగలుగుతున్నాం. 

వైద్య రంగంలో ఏ పేదవాడికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదు. ఏ పేదవాడైనా సరే కార్పొరేట్‌  ఆసుపత్రికి వెళ్లి వైద్యం చేయించుకునే పరిస్థితి లేకపోవడం, మన వద్ద సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులు  లేకపోయినా ఏరకంగా ఇబ్బంది పడుతున్నారో చూస్తున్నాం. అలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గంలో ఒక మెడికల్‌ కాలేజీ, నర్సింగ్‌ ఆసుపత్రి, మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు చేసి డాక్టర్లు అందుబాటులోకి తీసుకువచ్చే గొప్ప కార్యక్రమానికి ఈ రోజు శ్రీకారం చుడుతున్నాం.

రాష్ట్రం అవతరించిన కాలం నుంచి , బ్రిటిష్‌ కాలం నుంచి మన రాష్ట్రంలో కేవలం 11 మెడికల్‌ కాలేజీలు మాత్రమే ఉండేవి. ఈ రోజు రాష్ట్రంలో ఏకంగా 16 కొత్త మెడికల్‌ కాలేజీలను ఏర్పాటు చేయగలిగే పరిస్థితిలోకి వెళ్తున్నాం. ఇంత గొప్ప అవకాశం దేవుడిచ్చినందుకు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం.

ఈ రోజు కొత్తగా ఏర్పాటు చేసే మెడికల్‌ కాలేజీల్లో ఇప్పటికే పాడేరు, పులివెందులలో శంకుస్థాపన చేశాం. అక్కడ పనులు కూడా జరుగుతున్నాయి. ఈ రోజు 14 కాలేజీలకు వర్చువల్‌ విధానంలో శంకుస్థాపన చేస్తున్నాం. దేశంలో ఏ రాష్ట్రానికి తీసిపోని విధంగా వైద్య రంగంలో మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని గర్వంగా చెప్పగలను. మన వద్ద పెద్ద పెద్ద నగరాలు లేవు, సూపర్‌ స్పెషాలిటీ, మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు మన వద్ద లేవు. ఇలాంటి ఆసుపత్రులు మన వద్దకు రావాలంటే ఈ గొప్ప అడుగు ఉపయోగపడుతుంది. ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గంలో మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేస్తున్నాం.

మూడేళ్లలో ఈ ఆసుపత్రులను పూర్తి చేసేలా రూ.100 కోట్లు ఎవరు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చినా కూడా ఒక్కొక్కరికి రెండెకరాలు భూమి ఉచితంగా ఇస్తుంది. కనీసం అంటే ప్రతి జిల్లాలో ఐదారు ఆసుపత్రులను నిర్మించగలిగితే వైద్యానికి ఇబ్బంది ఉండదు. ఇవన్నీ కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి అనుసంధానం చేస్తాం. మన రాష్ట్రంలో మరో కొన్ని ఆసుపత్రులను అనుసంధానం చేస్తాం. వైద్య రంగంలో మెరుగైన పరిస్థితి తీసుకువస్తాం.

ఈ రోజు 14 మెడికల్‌ కాలేజీలకు శంకుస్థాపన చేస్తున్నాం. ఇదీవరకే రెండు కాలేజీలను ప్రారంభించాం. వీటి నిర్మాణానికి రూ.8 వేల కోట్లు ఖర్చు చేయగలుగుతున్నామని సంతోషంగా చెబుతున్నాను. ప్రాణం విలువ తెలిసిన వ్యక్తిగా, రాబోయే అవసరాలను బేరిజు వేసుకొని, ప్రతి ఒక్కరికి మంచి వైద్యం అందించాలనే లక్ష్యంతో ఈ అడుగులు వేస్తున్నాం. ఆర్థిక, సామాజిక, రాజకీయ న్యాయం చేయడమే కాకుండా పేదవారికి మంచి వైద్యం అందించే కార్యక్రమంలో భాగంగా ఈ ఆసుపత్రులను ఏర్పాటు చేస్తున్నాం. 

పాదయాత్రలో ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గంలో ఒక ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ ఉండేలా పిడుగురాళ్ల, మచిలీపట్నం, విజయనగరం, అనకాపల్లి, రాజమండ్రి, మార్కాపురం, పాలకొల్లు, ఏలూరు, బాపట్ల, నంద్యాల, ఆదోని, పాడేరు, పులివెందులలో 16 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నాం. విశాఖ జిల్లా పాడేరు, వైయస్‌ఆర్‌ జిల్లా పులివెందులలో రెండు ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల నిర్మాణం పనులు ఇప్పటికే ప్రారంభించారు.  2023 డిసెంబర్‌నాటికి వీటి నిర్మాణాలు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తాం. 
ప్రతి ప్రభుత్వ మెడికల్‌ కాలేజీకి అనుబంధంగా నర్సింగ్‌ కళాశాల. ప్రత్యేక సేవలతో కూడిన 500 పడకల ఆసుపత్రి, సమగ్ర ఐటీ సేవలు, సీసీ టీవీలు, అత్యాధునిక సౌకర్యాలతో కూడిన 10 మాడ్యులర్‌ ఆపరేషన్‌ థియేటర్లు, సెంట్రలైజ్డ్‌ ఎయిర్‌ కండిషన్‌తో కూడిన ఐసీయూ, అవుట్‌ పేషెంట్‌ డిపార్ట్‌మెంట్, డాక్టర్ల రూమ్‌లు, మెడికల్‌ గ్యాస్‌ పైప్‌లైన్‌తో అనుసంధానంచేసిన బెడ్లు, ఆక్సిజన్‌ నిల్వ చేసే ట్యాంకులు, ఆక్సిజన్‌ జనరేషన్‌ ప్లాంట్స్‌ ఏర్పాటు చేస్తున్నాం. ఎంఆర్‌ఐ, సీటీ స్కాన్‌లు కూడా ప్రతి కాలేజీలో ఏర్పాటు చేస్తున్నాం.  వీటిలో జాతీయ స్థాయి ప్రమాణాలతో సౌకర్యాలు కల్పిస్తాం. 

నాడు–నేడు పథకం ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల రూపురేఖలు మార్చుతున్నాం. దాదాపు రూ.16300 కోట్లు ఇందుకు ఖర్చు చేస్తున్నాం. ఇందులో భాగంగా 10111 విలేజి క్లినిక్స్‌ తీసుకువస్తున్నాం. మండలానికి రెండు పీహెచ్‌సీలు ఏర్పాటు చేస్తున్నాం. మరో 176 కొత్త పీహెచ్‌సీలను నిర్మిస్తున్నాం, 52 ఏరియా ఆసుపత్రులు, 192 కమ్యూనిటీ ఆసుపత్రులను ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటికే ఉన్న 11 మెడికల్‌కాలేజీల రూపురేఖలు మార్చబోతున్నాం. వీటిలో జాతీయ స్థాయి స్టాండెట్స్‌ ఉంటాయి. 
ఐపీహెచ్‌ స్టాండెట్స్‌ ఉంటాయి. ఇవన్నీ కూడా 2023 డిసెంబర్‌ నాటికి పూర్తి చేసి అందుబాటులోకి తెస్తాం.

గిరిజన ప్రాంతాల్లోని ప్రజలకు రూ.246 కోట్లతో ఐదు గిరిజన మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులను నిర్మించేందుకు శ్రీకారం చుట్టాం. ఉద్దానం ప్రాంత ప్రజల కోసం కిడ్నీ రిసెర్చ్‌ సెంటర్, కడపలో మానసిక ఆరోగ్య కేంద్రం, క్యాన్సర్‌ ఆసుపత్రుల నిర్మాణానికి శ్రీకారం చుట్టాం.

దేశంలో ఏ రాష్ట్రంలో కనీవిని ఎరుగని విధంగా వైయస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ సేవల్లో ఘననీయమైన మార్పులు తెచ్చాం. ఈ రోజు 2436 వైద్య సేవలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చాం. వైద్యం ఖర్చు రూ.1000 దాటితే అన్ని సేవలు ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చాం. వైద్యం ఏ ఒక్కరికి కూడా భారం కాకూడదని ప్రతి కుటుంబాన్ని ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చాం. ఆపరేషన్‌ అయ్యాక విశ్రాంతి సమయంలో కూడా వైయస్‌ఆర్‌ ఆరోగ్య ఆసరా ద్వారా నెలకు రూ.5 వేలు పరిహారం ఇస్తున్నాం. 

దృష్టిలోపాలు ఉన్న వారికి ప్రభుత్వమే ఉచితంగా ఆపరేషన్లు చేయించి, కంటి  అద్దాలు కూడా అందజేస్తున్నాం. ప్రతి ఒక్కరికి మేలు జరిగే కార్యక్రమాలు శ్రీకారం చుట్టాం. ఆరోగ్యశ్రీ పరిధిలోకి కాంక్లియర్‌ ఇన్‌ప్లాంట్‌ ఆపరేషన్‌ చేయించే పరిస్థితిలోకి తీసుకువచ్చాం. క్యాన్సర్‌ వంటి చికిత్సలు కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చాం. 
130 సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులను మన రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాలను కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చాం.

దీర్ఘకాలిక వ్యాధులతో సతమతమయ్యేవారికి తోడుగా ఉండేందుకు పింఛన్‌ను రూ.3 వేల నుంచి రూ.10 వేలకు పెంచామని సగర్వంగా చెబుతున్నాను. ప్రతి గ్రామంలో వైయస్‌ఆర్‌ విలేజ్‌ క్లినిక్‌లో 91 రకాల మందులు అక్కడే అందుబాటులో ఉంచుతాం. అక్కడే ఏఎన్‌ఎంలు, ఆశావర్కర్లు నివాసం ఉంటారు. ప్రతి పీహెచ్‌సీలో ఇద్దరు డాక్టర్లు ఉంటారు. ప్రతీ పీహెచ్‌సీకి 104 వాహనం అందుబాటులో ఉంటుంది. డాక్టర్లు 7 గ్రామాలను దత్తత తీసుకుంటారు. ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ తీసుకువస్తున్నాం. 
ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్‌ నుంచి కోలుకునేందుకు ఈ వైద్యాన్ని కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకువచ్చాం. కోవిడ్‌ తరువాత కొత్త కొత్తగా వస్తున్న ఫంగస్‌లను కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకువచ్చామని గర్వంగా చెబుతున్నాను.

గత ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పరిధిలో రూ.600 కోట్లు బకాయిలు పెడితే..మన ప్రభుత్వమే చెల్లించింది. ఈ రోజు 3 వారాల్లోపే బిల్లులు చెల్లిస్తున్నాం. గతంలో ఆరోగ్యశ్రీ పేషెంట్లు వస్తే వద్దు బాబోయ్‌ అన్న ఆసుప్రతులు..ఈ రోజు నెట్‌వర్క్‌ఆసుప్రతులు ముందుకు వచ్చాయి. 

ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ ద్వారా రెండేళ్లలో రూ.5215 కోట్లు చెల్లించామని సగర్వంగా చెబుతున్నాను. శస్త్ర చికిత్సలకే రూ.3650 కోట్లు చెల్లించాం.  ఈ రోజు ప్రతి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖాళీలను భర్తీ చేస్తున్నాం. 9710 పోస్టులు పూర్తిగా భర్తీ చేశామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వైద్య ఆరోగ్య రంగంలో ఇన్ని వేల పోస్టులు భర్తీ చేసింది గతంలో ఎప్పుడూ చూడలేదు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో డబ్యూ›్లహెచ్‌వో, ప్రమాణాలు ఉండేలా మార్పు చేశాం. గతంలో ప్రభుత్వ ఆసుపత్రుల మందులతో రోగం నయం కాదన్న భయం ఉండేది. ఈ పరిస్థితిని మార్చేశాం. 

రాష్ట్రవ్యాప్తంగా 1180 ఒకేసారి 108 వాహనాలు అందజేశాం. మరో విషయం ఇక్కడ ప్రకటిస్తున్నాం. కోవిడ్‌ సమయంలో ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌కు కేంద్రం ప్రకటించిన పరిహారం అందకపోతే రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షలు పరిహారం అందజేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి కరోనాతో మరణిస్తే..ఆ కుటుంబాన్ని త్వరగా ఆదుకునేందుకు సంబంధించిన విధి విధానాలు ఖరారు చేయాలని సీఎస్‌కు ఆదేశాలు జారీ చేస్తున్నాం. 40కి పైగా సంక్షేమ పథకాలతో పాటు మీ కుటుంబ సభ్యుడిగా నిండు మనసుతో దృష్టి పెట్టామని సగర్వంగా చెబుతున్నాను. 

అసెంబ్లీ సాక్షిగా, అనేక సందర్భాల్లో కోవిడ్‌ సేవలను వివరించాం. రాష్ట్ర ప్రభుత్వం చేసే ప్రతి ప్రయత్నంలో ఎలాంటి లోటు లేదని, ఉండదని మరోక్కసారి మాట ఇస్తూ మనందరి ప్రభుత్వం, మీ అందరికీ మరించి మంచి చేసేలా ఈ ప్రభుత్వంపై దేవుడి దయ, మీ అందరి ఆçశీస్సులు ఉండాలని మనసారా కోరుకుంటూ సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి వర్చువల్‌ విధానంలో 14 మెడికల్‌ కాలేజీలకు శంకుస్థాపన చేశారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top