సింహంలా మీ బిడ్డ ఒక్కడే నడుస్తున్నాడు

  జగనన్న చేదోడు మూడో విడత కార్యక్రమంలో సీఎం వైయస్‌ జగన్‌

మూడేళ్లలో జగనన్న చేదోడు కింద రూ.927.51 కోట్లు అందజేశాం

వివక్ష లేకుండా, లంచాలకు తావులేని వ్యవస్థ ద్వారా పారదర్శకంగా సంక్షేమ పథకాలు

11.43 శాతం గ్రోత్‌ రేట్‌తో ఆదర్శంగా నిలిచాం

గిట్టనివాళ్లు రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని దుష్ప్రచారం చేస్తున్నారు

బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు అండగా నిలిచాం

 నా.. నా.. నా.. అని సంబోధిస్తూ మీ బిడ్డ పరిపాలన చేస్తున్నాడు

తోడేళ్లందరూ ఒక్కటవుతున్నారు

పేద వారికి పెత్తందారులకు మధ్య యుద్ధం జరుగుతోంది

ముసలాయన పాలనలో గజదొంగల ముఠా ఉండేది

డీపీటీ..దోచుకో, పంచుకో, తినుకో వీరి విధానం

ప‌ల్నాడు:  రాష్ట్రంలో తోడేళ్లంద‌రూ ఒక్క‌ట‌వుతున్నా..మీ బిడ్డ సింహంలా ఒక్క‌డే న‌డుస్తున్నాడ‌ని ముఖ్య‌మంత్రి, వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు. గ‌తంలో ముస‌లాయ‌న పాల‌న‌లో గ‌జ దొంగ‌ల ముఠా ఉండేద‌ని, వారు దోచుకో, పంచుకో, తినుకో అన్న విధానంలో ప‌ని చేశార‌న్నారు.  మీ బిడ్డ నా ఎస్సీలు, నా ఎస్టీలు, నాబీసీలు, నా మైనారిటీలు అంటూ అన్నివ‌ర్గాలకు తోడుగా నిలిచార‌న్నారు. నవరత్నాలు, ఇతర సంక్షేమ పథకాలతో రాష్ట్రంలోని ప్రతీ నిరుపేద కుటుంబానికి ఎంతో మేలు జరుగుతోందని చెప్పారు. ఇది పేదవాడికి, పెత్తందారుకి మధ్య నడుస్తున్న యుద్ధం. మాట ఇస్తే నిలబడే వ్యక్తి ఒక వైపు ఉంటే, వెన్నుపోట్లు, మోసాలు చేసే తోడేళ్లు మరో వైపు ఉన్నారు. ఎటు వైపు ఉండాలో మీరే నిర్ణయించుకోండి. మంచి చేసే అవకాశం ఇవ్వండి. మీ అందరి చల్లటి దీవెనలతో నడుస్తున్నా. మీ బిడ్డకు ఉన్న నమ్మకం ఒక్కటే మీ అందరి ఆశీస్సులు, దేవుడి చల్లటి దీవెనలు ఉన్నాయి అని సీఎం జగన్‌ పేర్కొన్నారు.  జగనన్న చేదోడు పథకం కింద లబ్దిదారులకు మూడవ విడత సాయాన్ని ఇవాళ ప‌ల్నాడు జిల్లా వినుకొండలో జరిగిన కార్యక్రమంలో విడుదల చేశారు.  ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌సంగించారు..

వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఏమ‌న్నారంటే..

  • చిక్కటి చిరునవ్వులతో...చెరగని ఆప్యాయతలతో ఆత్మీయతలను పంచిపెడుతున్న ప్రతి ఒక్కరికీ మీ బిడ్డ రెండు చేతులు జోడించి పేరుపేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
  • వినుకొండలో ఈ రోజు దేవుడి దయతో, మీ అందరి చల్లని దీవెనలతో ఇవాళ మరో మంచి కార్యక్రమాన్ని ఇక్కడి నుంచి ప్రారంభిస్తున్నాం.
  • వెనకబడిన కులాలను, వర్గాలను.. వెన్నెముక కులాలుగా మారుస్తామని మాట ఇచ్చాం. ఈ మూడు ఏళ్లలో నవరత్నాలులోని ప్రతీ పథకాన్ని, సంక్షేమ పథకాల్లోని ప్రతీ పథకాన్ని ఈ రాష్ట్రంలోని ప్రతీ వర్గాల కుటుంబాలకు మేలు చేసేలా మన అందరి ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తూ వచ్చింది.  ఇచ్చిన మాట అమలు చేసే విషయంలో భాగంగా.. సొంత షాప్‌ ఉన్న రజక సోదరుడికి, నాయీబ్రాహ్మణుడికి, దర్జీ అక్కాచెల్లెలకు ఏటా పది వేల రూపాయల ఆర్థిక సాయం చేసేలా జగనన్న చేదోడు పథకం తీసుకొచ్చాం. 
  • లంచాలకు తావులేని వ్యవస్థ ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నాం. వివక్ష లేకుండా పారదర్శకంగా అందజేస్తున్నాం. వరుసగా ఈ మూడేళ్లలో అక్షరాల మూడు లక్షల ముప్పై వేల మందికి మంచి చేస్తూ.. నేడు రూ. 330 కోట్లు నేరుగా ఖాతాల్లోకి జమ చేస్తామని సీఎం జగన్‌ ప్రకటించారు. మొత్తంగా.. జగనన్న చేదోడు కార్యక్రమంతో రూ. 927 కోట్లు జమ చేసినట్లు అవుతుంది. ఎక్కడా వివక్ష లేదు. ఎక్కడా లంచాలు లేవు. పారదర్శకంగా గ్రామ స్థాయిలో జరుగుతుంది.
  • మొత్తంగా 43 నెలల పాలనలోకే కేవలం బటన్‌ నొక్కి నేరుగా నా అక్కచెల్లెమ్మల కుటుంబాల్లోకి చేర్పించిన సొమ్ము అక్షరాల రూ.1,92,937 కోట్లు ఇచ్చామని సగర్వంగా, మీ బిడ్డగా, మీ ప్రభుత్వంలో ఇది చేశానని సంతోషంగా తెలియజేస్తున్నాను.
  • ఈ మూడున్నరేళ్ల పాలనలో కేవలం డీబీటీ ద్వారా మధ్యలో దళారులు లేరు, వివక్ష లేకుండా నేరుగా అందజేస్తున్నాం. ఇక నాన్‌ డీబీటీ ద్వారా అక్షరాల రూ.3 లక్షల కోట్లు నేరుగా నా అక్కచెల్లెమ్మల కుటుంబాలకు ఇవ్వగలిగాను.
  • ఈ రోజు నా బీసీలకు సంబంధించి కానీ, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, మొట్ట మొదటి ప్రభుత్వం ఈ రోజు వైయస్‌ జగన్‌ నోటి నుంచి వచ్చే మాట నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనారిటీలు..నా వాళ్లు అని మీ జగన్‌ అనని రోజు లేదు. ప్రతి రోజు ప్రభుత్వం వీళ్ల మంచి కోసం ఉందని నా నా నా అని సంబోధిస్తూ మీ బిడ్డ పరిపాలన చేస్తున్నారు.
  • వర్గాలుగా తీసుకుంటే రైతులు, అక్కచెల్లెమ్మలు, అవ్వతాతలు, చదువుకుంటున్న పిల్లలు ఇలా ఎవరిని తీసుకున్నా..ఏ ప్రాంతాన్ని తీసుకున్నా..ఏ గ్రామాన్ని తీసుకున్నా ప్రతి గడపకు ఇంతకు ముందు ఏ ప్రభుత్వం చేయని విధంగా దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో ఈ రోజు మీ బిడ్డ ప్రభుత్వం చేస్తుందని సగర్వంగా చెబుతున్నాను. 
  • జగనన్న చేదోడు ద్వారా ఈ రోజు ప్రయోజన ం పొందుతున్న నా నాయీ బ్రహ్మణులు 47537 మంది, నా రజక సోదరులు 1,14,661 మంది, నా టైలర్‌ అక్కచెల్లెళ్లు, అన్నదమ్ములు అక్షరాల 1,67951 మంది వెరసీ 3.30 లక్షల మంది ఈ రోజు వాళ్ల కుటుంబాల్లో సంక్రాంతి వేడుకలు జరుగబోతున్నాయని చెప్పడానికి గర్వపడుతున్నాను.  
  • నిజంగా వీళ్ల గురించి ఎప్పుడు కూడా గతంలో ఎవరూ ఆలోచన చేయలేదు. మీ అందరితో కూడా ఈ సందర్భంగా ఒక్క విషయం చెప్పాలి. మన రాష్ట్రం దేశంలో జీడీపీ ప్రకారం చూస్తే మన పెరుగుదల 11.43 శాతంతో జీఎస్‌డీపీలో దేశంలోనే మొట్ట మొదటి స్థానంలో ఉన్నామని చెప్పడానికి గర్వపడుతున్నా..అన్ని రాష్ట్రాల కంటే మీ బిడ్డ ప్రభుత్వం దేశానికి ఆదర్శంగా ఉంటోంది.
  • ఒక్కసారి ఆలోచన చేయండి..ఈ మాదిరిగా దేశానికి ఆదర్శంగా మీ బిడ్డ ప్రభుత్వం 11.43 శాతం గ్రోత్‌రేట్‌తో ఎందుకు పరుగెత్తుతుందో ఆలోచన చేయండి. 
  • మీ బిడ్డ అంటే నచ్చని వాళ్లు రాష్ట్రం శ్రీలంక అవుతుందని అబద్ధాలు చెబుతున్న నేపథ్యంలో ఒక్కసారి ఆలోచన చేయండి. వాళ్ల హయాంలో ఎప్పుడు జరగని విధంగా దేశానికే దిక్సూచిలా ఏపీ ఎందుకు పరుగెత్తుతోందో ఆలోచన చేయండి.
  • రాష్ట్రంలోని ప్రతి రంగాన్ని చేయ్యి పట్టుకుని నడిపిస్తేనే రాష్ట్రం అభివృద్ధి వైపు పరుగులు తీస్తుంది. రాష్ట్రంలో గ్రోత్‌ రేట్‌ వస్తుంది. ప్రతి కుటుంబం బాగుపడుతుంది.
  • 62 శాతం జనాభా వ్యవసాయంపై ఆధారపడిన పరిస్థితి మనందరికి తెలుసు. అటువంటి వ్యవసాయంపై ఆధారపడిన వ్యవసాయ రంగాన్ని తీసుకుంటే అక్షరాల 50శాతం మంది రైతులకు కేవలం 1.25 ఎకరాలు మాత్రమే ఉన్న పరిస్థితి. 70 శాతం మంది రైతులు మాత్రమే ఒక్క హెక్టార్‌ పొలం ఉంది. 
  • కోటి మందికి పైగా ఉన్న రైతులకు క్రమం తప్పకుండా ప్రతి ఏటా క్యాలెండర్‌ ఇచ్చి సాగులో అడుగు ముందుకు పడేలోగా జగనన్న నుంచి రైతు భరోసా వస్తుందన్న నమ్మకం ఆ రైతులకు ఉంది. అరహెక్టార్‌ లేని రైతులు కూడా రూ.13500 రైతు భరోసా నిధులతో సాగుకు 80 శాతం అందుతోంది. సాగులో వేగం కనిపిస్తోంది.
  • రైతుల ఇంటి వద్దనే ఆర్‌బీకేలు పెట్టాం. ప్రతి ఎకరాను ఈ–క్రాపింగ్‌ చేసి రైతులను చేయి పట్టి నడిపిస్తున్నాం. రైతులకు ఏ కష్టం వచ్చినా..సీజన్‌ ముగియక ముందే ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇస్తున్నాం. ఉచితంగా ఇన్సూరెన్స్‌ చేయించి అండగా నిలుస్తున్నాం.అందుకే ఇటువంటి గ్రోత్‌రేట్‌ పెరిగింది.
  • కోటి మందికి పైగా డ్వాక్రా సంఘాల్లో ఉన్న అక్కచెల్లెమ్మలకు రుణాలు మాఫీ చేస్తామని గతంలో మోసం చేస్తే..పొదుపు సంఘాలు అన్ని కూడా సీ గ్రేడ్‌కు దిగాయి. అలాంటి సంఘాలను మీ బిడ్డ ప్రభుత్వం తోడుగా ఉంటూ మంచి అన్నగా, తమ్ముడిగా అక్కచెల్లెమ్మలకు వైయస్‌ఆర్‌ ఆసరా, సున్నా వడ్డీ అని తోడుగా నిలబడ్డాడు. అందుకే ఈ రోజు ఆ అక్కచెల్లెమ్మలు, అమ్మ ఒడి, సున్నా వడ్డీ, ఆసరా డబ్బుతో అభివృద్ధి చెందుతున్నారు. ఆలోచన చేయండి. 
  • ఎవరి మీద ఆధారపడకుండా స్వయంగా వాళ్ల కష్టం మీద ఆధారపడి బతుకుతున్న అనేక మంది 55 లక్షల పై చిలుకు కుటుంబాలు, వీరికి సొంతంగా ఉద్యోగాలు లేవు, సొంత కాళ్లపై నిలబడి బతుకుపోరాటంలో అడుగులు ముందుకు వేస్తున్నారు. బయటికి నాలుగు అడుగులు వేస్తే కిరణా షాపులు, తోపుడు బండ్లు, దోశలు వేసుకుంటూ బతుకుతున్నారు. ఇలాంటి వారికి ప్రతి ఏటా క్రమం తప్పకుండా చేయూతనిచ్చి అక్కచెల్లెమ్మలను నడిపిస్తున్నాం..కాబట్టే అభివృద్ధిలో పరుగులు తీస్తోంది.
  • ఈ రోజు అమూల్, పీ అండ్‌ జీ, వంటి సంస్థలతో ఒప్పందాలు చేసుకోవడంతో అభివృద్ధి పరుగులు తీస్తోంది. రోడ్డు పక్కన వ్యాపారం చేసుకుంటున్న వారిని జగనన్న తోడు ద్వారా రూ.10 వేల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నాం. 
  • మత్స్యకారులకు అండగా నిలిచాం. నేతన్న కుటుంబాలకు తోడుగా నిలిచాం. సొంతంగా ఆటోలు నడుపుతున్న వారికి అండగా నిలిచాం. కాపు నేస్తం ద్వారా 3.56 లక్షల కుటుంబాలకు అండగా నిలిచాం. చేదోడు ద్వారా 3.30 లక్షల మందికి ఈ రోజు తోడుగా నిలిచాం. మరో 4 లక్షల కుటుంబాలకు ఈబీసీ నేస్తం ద్వారా అండగా నిలిచాం. అందుకే ఈ రోజు వాళ్ల కాళ్లపై వాళ్లు నిలబడ్డారు కాబట్టి, కోవిడ్‌ లాంటి మహ్మమ్మారిని వీరిని ఎదుర్కొని నిలబడ్డారు కాబట్టి ఈ రోజు రాష్ట్రంలో 11.43 గ్రోత్‌ రేట్‌తో అడుగులు ముందుకు వేస్తోంది. ఏకంగా 30 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు దేశ చరిత్రలో, రాష్ట్ర చరిత్రలో ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్‌ చేయించి ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. స్టీల్‌ సిమెంట్‌ వినియోగంతో రాష్ట్రం 11.43 గ్రోత్‌ రేట్‌తో వేగంగా దూసుకెళ్తోంది. గిట్టని వాళ్లు రాష్ట్రం శ్రీలంక అవుతుందని ఆరోపిస్తున్నారు. ఆలోచన చేయండి.
  • గతంలో పాలకులను చూశాం. గతంలో ఒక ముసలాయన ను ముఖ్యమంత్రి స్థానంలో చూశాం. గతంలో కూడా ఇదే రాష్ట్రం, ఇదే బడ్జెట్‌. గతం కన్నా ఈ రోజు మీ బిడ్డ చేస్తున్న అప్పుల రేటు గతంలో కన్నా తక్కువే. గతంలో ఎందుకు బటన్‌ లేదు. నేరుగా ఎందుకు డబ్బులు ఇవ్వలేదో ఆలోచన చేయండి. మీ బిడ్డ పాలనలోనే ఎందుకు జరుగుతోంది ఆలోచన చేయండి. ఈ రోజు మీ బిడ్డ పరిపాలనలో బటన్‌ మాత్రమే ఉంది. ఎక్కడా లంచాలు లేవు. వివక్ష లేదు. మీ బిడ్డ నేరుగా బటన్‌ నొక్కుతున్నాడు..నేరుగా నా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి డబ్బులు వస్తున్నాయి. గత ప్రభుత్వం..ఆ ముసలాయన ప్రభుత్వంను గుర్తు తెచ్చుకోండి. ఆ ప్రభుత్వంలో ఒక గజదొంగల ముఠా ఉండేది. ఆ ముఠాకు దుష్టచతుష్టయం అని పేరు ఉండేది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు. వీళ్ల స్కీమ్‌ అప్పట్లో ఒక్కటే డీపీటీ(దోచుకో, పంచుకో, తినుకో) రాష్ట్రాన్ని దోచేశారు. ఇక ఎవరు మాట్లాడకూడదు. ఎవరు చూపకూడదు అన్నట్లుగా గతంలో పాలించారు. ఈనాడు రాయదు, ఆంధ్రజ్యోతి రాయదు, చూడడు. ప్రశ్నిస్తానన్న దత్తపుత్రుడు ప్రశ్నించడు. యధేచ్చగా దోచుకో, పంచుకో , తినుకో అన్న పద్ధతిలో పాలించారు. ఇక లంచాలు లేని, వివక్ష లేని, నేరుగా బటన్‌ నొక్కి మీ ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్న మీ బిడ్డ పరిపాలన కావాలో తేల్చుకోండి.
  • ఈ రోజు మీ అందరితో ఒక్కటే చెబుతున్నాను. నాకు ముసలాయన మాదిరిగా ఈనాడు,ఆంధ్రజ్యోతి అండగా ఉండకపోవచ్చు, టీవీ5 తోడుగా ఉండకపోవచ్చు. దత్తపుత్రుడు నాకోసం మైక్‌ పట్టుకోకపోవచ్చు. నేను వీరిని న మ్ముకోలేదు. 
  • నేను నమ్ముకున్నది ఎవరినో తెలుసా..నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు, నా నిరుపేద వర్గాలను నమ్ముకున్నాను.
  • ఈ రోజు రాష్ట్రంలో కులాల మధ్య కాదు యుద్ధం జరిగిదే..క్లాస్‌ వారు..పేదవాడు ఒకవైపున ఉంటే పెత్తందార్లు మరోవైపు ఉండి యుద్ధం జరుగుతోంది. ఈ రోజు యుద్ధం జరుగుతున్నది మాట ఇస్తే మాట నిలబడే మీ బిడ్డ ఒక వైపు ఉంటే..వెన్నుపోట్లు, మోసాలు చేసే వారు మరోకవైపున ఉన్నారు. ఈరోజు యుద్ధంలో మీ బిడ్డకు ఉన్నదల్ల, మీ బిడ్డ నమ్మకం కేవలం దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలే. మీ బిడ్డకు పొత్తులు లేవు. మీ బిడ్డ వాళ్ల మీద, వీళ్ల మీద నిలబడడు.
  • మీ బిడ్డ ఒక్కడే సింహంలా ఒక్కడే నడుస్తాడు.. తోడేళ్లందరూ ఒక్కటవుతున్నారు. కానీ మీ బిడ్డకు భయం లేదు. కారణం మీ బిడ్డ నమ్ముకున్నది మిమ్మల్ని, ఆ దేవుడిని నమ్ముకున్నాడు.
  • ఎల్లప్పుడు మీ బిడ్డపై మీ అందరి చల్లని దీవెనలు ఉండాలని, ఇంకా మీకు మంచి చేసే రోజులు రావాలని, మన స్కూళ్లు బాగుపడాలని, మన పిల్లలు  ఇంగ్లీష్‌ మీడియం చదువులు చదవాలని, ఆసుపత్రి రూపురేఖలు మారాలని, ఆసుపత్రిలో డాక్టర్లు లేని పరిస్థితి ఉండకూడదని, ఏ పేదవాడు అప్పులపాలు కాకూడదని ఆ దేవుడిని కోరుతున్నాను. మీ బిడ్డకు బలాన్ని ఇవ్వాలని దేవుడిని కోరుతున్నాను. రైతులు, అక్కచెల్లెమ్మలకు తోడుగా నిలవాలని, మీ బిడ్డ తీసుకువచ్చిన సంస్కరణలకు ఆ దేవుడి ఆశీస్సులు ఎల్లప్పుడు ఉండాలని, ఇంకా మంచి చేసే ఆలోచనలు, పరిస్థితులు ఇవ్వాలని, మీ చల్లని దీవెనలు కోరుకుంటూ సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి బటన్‌ నొక్కి జగనన్న చేదోడు కార్యక్రమం ద్వారా నేరుగా డబ్బులు ఖాతాల్లో జమ చేశారు.
     

తాజా వీడియోలు

Back to Top