అమరావతి: కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అన్ని కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లతో ప్రధాని నరేంద్ర మోదీ కీలక సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి వర్చువల్ విధానంలో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. భారత్ లో కరోనా కేసులు మళ్లీ ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో దాదాపు 188 మంది కరోనా వల్ల చనిపోవడం భయాందోళలను పెంచుతున్నాయి. మహారాష్ట్రలో కరోనా సెకండ్ వేవ్ ప్రారంభ దశలో ఉందని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, మహమ్మారి కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సీఎంలతో మోదీ సమీక్ష నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రుల నుంచి సలహాలు స్వీకరిస్తూనే, రాష్ట్రాలకు కీలక సూచనలు చేయనున్నారు. దీంతోపాటు, దేశ వ్యాప్తంగా కొనసాగుతున్న వ్యాక్సినేషన్ డ్రైవ్ పై కూడా చర్చించనున్నారు.