రైతు భరోసా రెండోవిడత సాయం విడుదల

ఆన్‌లైన్‌లో ద్వారా ప్రారంభించిన సీఎం వైయస్‌ జగన్‌

తాడేపల్లి: ‘వైయస్‌ఆర్‌ రైతు భరోసా– పీఎం కిసాన్‌’ పథకం కింద వరుసగా రెండవ ఏడాది.. రెండవ విడత సాయాన్ని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విడుదల చేశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి రైతు భరోసా పథకం కింద రెండవ విడత సాయాన్ని ల్యాప్‌టాప్‌ బటన్‌ నొక్కి రూ.1,114.87 కోట్ల నగదును నేరుగా రైతుల ఖాతాల్లోకి బదిలీ చేశారు. ఈ సందర్భంగా సీఎం వైయస్‌ జగన్‌ మాట్లాడుతూ.. అరకోటికి పైగా రైతులకు దాదాపుగా రూ.6,800 కోట్లు సాయంగా అందిస్తున్న ఈ వైయస్‌ఆర్‌ రైతు భరోసా – పీఎం కిసాన్‌ పథకం అమలు చేస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంలో దాదాపుగా 1.50 కోట్ల ఇళ్లు ఉంటే అందులో 50 లక్షల పైచిలుకు ఇళ్లకు మేలు చేస్తున్నామని, రైతు భరోసా ద్వారా దాదాపుగా ప్రతి మూడు ఇళ్లకు ఒక ఇంటికి మేలు జరుగుతుందన్నారు. ఇలాంటి గొప్ప కార్యక్రమం చేయడానికి దేవుడు అవకాశం ఇచ్చినందుకు సంతోషంగా ఉందన్నారు.

గతేడాది చూస్తే వైయస్‌ఆర్‌ రైతు భరోసా ద్వారా 46.69 లక్షల రైతు కుటుంబాలకు రూ.6,173 కోట్లతో ఆర్థికసాయం అందించగలిగామని, ఈ ఏడాది రైతుభరోసా సాయం సంఖ్య 50.50 లక్షల కుటుంబాలకు పెరిగిందన్నారు. 49.45 లక్షల రైతు కుటుంబాలతో పాటు 1.02 లక్షల మంది గిరిజనులకు ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ పరిధిలోని కుటుంబాలకు కూడా ఈ ఏడాది సాయం అందిస్తున్నామని వివరించారు. రైతు భరోసాగా మే నెలలోపే దాదాపుగా రూ.3,713 కోట్లు ఇవ్వడం జరిగింది. మే నెలలోపే రూ.7,500, అక్టోబర్‌ నెలలోపే రూ.4000, మళ్లీ జనవరిలో సంక్రాంతి పండగలోపే రూ.2000 ఇలా మూడు దఫాలుగా ఈ పథకాన్ని అందిస్తున్నామని వివరించారు.  
 

Back to Top