నిర్దేశించుకున్న స‌మ‌యానికి సర్వే పూర్తిచేయాలి

అధికారుల‌కు ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ ఆదేశం

శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నాం

ప్ర‌భుత్వం చేప‌డుతున్న భూస‌ర్వే భ‌విష్య‌త్తు త‌రాల‌కూ ఉప‌యోగ‌క‌రం

జాప్యానికి తావు లేకుండా కావాల్సిన సాంకేతిక పరికరాలను తెప్పించుకోవాలి

ప్రతి గ్రామ సచివాలయంలో సర్వేకోసం పరికరాలు ఉండాలి

రాళ్ల కొరత రాకుండా ముందస్తుగానే సన్నాహాలు చేసుకోవాలి

వైయ‌స్ఆర్‌ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష ప‌థ‌కంపై సీఎం స‌మీక్ష‌

తాడేపల్లి: వైయ‌స్ఆర్‌ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నామని,  ప్రజలకు అత్యంత ఉపయోగకరమైన కార్యక్రమం ఇది, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఎవరూ టాంపర్ చేయలేని విధంగా పత్రాలు అందిస్తున్నామని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇంత పెద్ద ఎత్తున భూస‌ర్వే చేప‌ట్ట‌డం లేద‌న్నారు. ప్ర‌భుత్వం చేప‌డుతున్న భూస‌ర్వే భ‌విష్య‌త్తు త‌రాల‌వారికి కూడా ఉప‌యోగ‌క‌రంగా ఉంటుంద‌న్నారు. వైయ‌స్ఆర్ జ‌గ‌న‌న్న శాశ్వ‌త భూహ‌క్కు-భూర‌క్ష ప‌థ‌కంపై ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మాట్లాడుతూ.. నిర్దేశించుకున్న లక్ష్యాల మేరకు సర్వే ప్రక్రియను పూర్తిచేసే దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. జాప్యానికి తావు లేకుండా కావాల్సిన సాంకేతిక పరికరాలను తెప్పించుకోవాలని సీఎం సూచించారు. 

రెవెన్యూశాఖ పరిధిలో తొలి దశలో చేపట్టిన 2వేల గ్రామాల్లో సర్వే ప్రక్రియపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే చాలావరకు పత్రాల పంపిణీ జరుగుతోందని అధికారులు సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు వివరించారు. మే 20 నాటికి సర్వే రాళ్లు వేసే పనితోపాటు అన్ని రకాలుగా సర్వే ప్రక్రియ పూర్తిచేయాల‌ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆదేశించారు. అవసరమైనంతమేర రోవర్లను ఆర్డర్ చేయాలని సూచించారు. దీనివల్ల అనుకున్న సమయానికే సర్వే ప్రక్రియ పూర్తవుతుందని సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ అన్నారు.

ప్రతి గ్రామ సచివాలయంలో సర్వేకోసం పరికరాలు ఉండాల‌ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ అధికారుల‌ను ఆదేశించారు. రోవర్ తరహా.. పరికరాలు తప్పకుండా ఉండేలా చూసుకోవాలన్నారు. దీనివల్ల సర్వేయర్ పూర్తిస్థాయిలో తన పనిని పూర్తి చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. సర్వే పూర్త‌యిన తర్వాత సరిహద్దులు వద్ద వేసేందుకు 31 లక్షల సర్వే రాళ్లను సిద్ధంచేశామని అధికారులు సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు తెలిపారు. రోజుకు 50 వేల సర్వే రాళ్ల చొప్పున సరఫరా చేసేందుకు ప్రణాళిక వేసుకున్నామని అధికారులు వివ‌రించారు. 

తర్వాత దశల్లో జరిగే సర్వే ప్రక్రియ కోసం రాళ్ల కొరత రాకుండా ముందస్తుగానే సన్నాహాలు చేసుకోవాలని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ అధికారుల‌ను ఆదేశించారు. మున్సిపల్ ప్రాంతాల్లో చేయాల్సిన సర్వేకోసం సన్నాహాలు చేసుకుంటున్నామని మున్సిపల్ శాఖ అధికారులు తెలిపారు. దీనికి సంబంధించి డేటా క్రోడీకరణ జరుగుతుందన్నారు. నిర్దేశించుకున్న టైం లైన్స్‌ ప్రకారం కచ్చితంగా సర్వే పూర్తిచేయాలని ముఖ్య‌మంత్రి ఆదేశించారు. ఏప్రిల్ మూడో వారం నాటికి 300 గ్రామాల్లో సర్వే ప్రక్రియ పూర్తవుతుందని, డిసెంబర్‌లోగా మొత్తం అన్ని గ్రామాల్లో ఈ సర్వే పూర్తి చేసేదిశగా లక్ష్యాలను పెట్టుకున్నామని పంచాయ‌తీరాజ్ శాఖ అధికారులు ముఖ్య‌మంత్రికి వివ‌రించారు. 

తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జ‌రిగిన‌ ఈ స‌మావేశానికి భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎం ముఖ్య సలహాదారు అజేయ కల్లం, స్పెషల్‌ సీఎస్‌లు జి.సాయి ప్రసాద్, వై.శ్రీలక్ష్మి, రజత్‌ భార్గవ, బుడితి రాజశేఖర్, భూగర్భ గనుల శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఐఏఎస్‌లు సిద్దార్ధ్‌ జైన్, ఏ.ఎండి.ఇంతియాజ్, ప్రవీణ్‌ కుమార్, షన్‌మోహన్, పలువురు ఉన్నతాధికారులు హాజ‌ర‌య్యారు.

Back to Top