పేదలకు ‘ఇళ్ల పట్టా’భిషేకం

మరికొద్దిసేపట్లో ప్రతిష్టాత్మక పథకానికి శ్రీకారం

తూర్పుగోదావరి జిల్లా కొమరగిరిలో ప్రారంభించనున్న సీఎం వైయస్‌ జగన్‌

పట్టాల పంపిణీతో పాటు ఇళ్ల నిర్మాణానికి భూమిపూజ చేయనున్న సీఎం

రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల పట్టాల పండుగ వాతావరణం

తూర్పుగోదావరి: పేదవాడి సొంతింటి కలను నెరవేర్చే లక్ష్యాన్ని తన భుజాన వేసుకున్న ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌.. ఆ లక్ష్యసాధనకు పునాది రాయి వేసే శుభ ముహూర్తం మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా తూర్పుగోదావరి జిల్లా యు.కొత్తపల్లి మండలం  కొమరగిరిలో ప్రతిష్టాత్మకమైన ప‌థ‌కం లాంఛ‌నంగా ప్రారంభం కానుంది. నేటి నుంచి 15 రోజుల పాటు ఇళ్ల పట్టాల పంపిణీ, ఇళ్ల నిర్మాణాలకు భూమి పూజ కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా పండుగలా జరుగనున్నాయి. 

ఇళ్ల పట్టాల పంపిణీ, గృహ నిర్మాణాలకు శంకుస్థాపనలు రెండు వారాల పాటు వాడవాడలా పండుగలా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. లబ్ధిదారుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా వైయస్‌ఆర్‌ జగనన్న కాలనీలు చక్కటి వసతులతో సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకున్నాయి. మన ప్రభుత్వం వస్తే 25 లక్షల ఇళ్ల స్థల పట్టాలు ఇస్తామని ప్రజా సంకల్పయాత్ర సందర్భంగా విపక్షనేత హోదాలో ప్రకటించిన వైయస్‌ జగన్‌.. ముఖ్యమంత్రి అయ్యాక ఏకంగా 30.75 లక్షల మందికి పట్టాలు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు.

వాడవాడలా..పండుగలా
భారత దేశ చరిత్రలో ఇదివరకెన్నడూ కనీ వినీ ఎరుగని రీతిలో 30,75,755 మందికి నివాస స్థల పట్టాలు అందజేయడంతోపాటు వచ్చే మూడేళ్లలో ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలన్న వైయస్‌ జగన్‌ ప్రభుత్వ లక్ష్యంపై ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

ఇంత మంచి కార్యక్రమం చేస్తే సీఎం వైయస్‌ జగన్‌కు ప్రజల్లో ఎంతో పేరు ప్రతిష్టలు వస్తాయనే కసితో దీనిని ఎలాగైనా అడ్డుకోవాలని టీడీపీ నాయకులు శతవిధాలా ప్రయత్నించారు. ఇందులో భాగంగానే ఇళ్ల స్థలాల పంపిణీకి బ్రేకులు వేయించేందుకు వెనకుండి కోర్టుల్లో కేసులు వేయించారు. ఇలా కోర్టు కేసుల్లో ఉన్న లేఅవుట్లలోనివి మినహా మిగిలిన వారందరికీ ఇళ్ల స్థల పట్టాలను ప్రజా ప్రతినిధుల చేతుల మీదుగా పంపిణీ చేయనున్నారు.

రూ.50,940 కోట్ల అంచనా వ్యయంతో 28.30 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని వచ్చే మూడేళ్లలో పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా రూ.28,080 కోట్ల వ్యయంతో మొదటి విడతలో నిర్మించ తలపెట్టిన 15.60 లక్షల ఇళ్లకు వచ్చే నెల ఏడో తేదీ వరకూ ప్రజా ప్రతినిధులు శంకుస్థాపనలు చేస్తారు. వాస్తవాలను కోర్టులకు నివేదించడం ద్వారా స్టేలను ఎత్తివేయించి మిగిలిన 3.51 లక్షల మందికి కూడా త్వరలో ఇళ్ల స్థల పట్టాలు ఇచ్చే దిశగా రెవెన్యూ యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది.

అర్హతే ప్రామాణికం
కులం, మతం, ప్రాంతం, పార్టీలు చూడకుండా అర్హతే ప్రాతిపదికగా అత్యంత పారదర్శకంగా, జవాబుదారీతనంతో గ్రామ/ వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేశారు. లబ్ధిదారుల జాబితాను ప్రదర్శించారు. అర్హుల పేర్లెవరివైనా పొరపాటున మిస్సయితే మళ్లీ దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు.

68,361 ఎకరాల ప్రభుత్వ, ప్రయివేటు భూమిని సేకరించి పాఠశాలలు, సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, పార్కులు, వైయస్‌ఆర్‌ హెల్త్‌ క్లీనిక్‌లు, క్రీడా ప్రాంగణాలు లాంటి సామాజిక అవసరాల కోసం స్థలాలను వదిలేచి చక్కగా రహదారులు ఏర్పాటు చేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా 17004 వైయస్‌ఆర్‌ జగనన్న కాలనీలను అధికారులు అభివృద్ధి చేశారు. ఈ కాలనీల్లో ప్లాట్లను అత్యంత పారదర్శకంగా లాటరీ విధానం ద్వారా కేటాయించారు. తమకు కేటాయించిన ప్లాట్లను చూసేందుకు ఆయా కాలనీల వద్దకు జనం తండోపతండాలుగా తరలివస్తున్నారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top